ఒకప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్‌ను తన మాస్ సినిమాలతో షేక్ చేసిన దర్శకుడు వి.వి.వినాయక్. 'ఆది', 'ఠాగూర్', 'ఖైదీ నెం. 150' వంటి ఇండస్ట్రీ హిట్లను అందించిన ఆయన.. గత కొంతకాలంగా వెండితెరపై తన సినిమాలతో కనిపించట్లేదు. గత కొన్ని నెలలుగా విక్టరీ వెంకటేష్ మరియు వి.వి.వినాయక్ కాంబోలో ఒక యాక్షన్ డ్రామా రాబోతోందని వార్తలు వచ్చాయి.తాజా సమాచారం ప్రకారం, ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి ఆగిపోయింది. వినాయక్ దాదాపు 8 నెలల పాటు స్క్రిప్ట్ మీద వర్క్ చేసినప్పటికీ, ఫైనల్ వర్షన్ పట్ల వెంకటేష్ సంతృప్తిగా లేకపోవడంతో ఈ మూవీ ముందుకు సాగడం లేదు.
వినాయక్ ఇప్పుడు ఇతర సీనియర్ హీరోలకు మరియు యంగ్ హీరోలకు సరిపోయే మాస్ కథలను సిద్ధం చేసే పనిలో ఉన్నాడు.ఇటీవల వినాయక్ ఆరోగ్యం క్షీణించిందని, ఆయన హాస్పిటల్ లో చేరారని కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి.
వినాయక్ టీమ్ ఈ వార్తలను ఖండించింది. ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, కేవలం విశ్రాంతి తీసుకుంటున్నారని స్పష్టం చేశారు. ఇటీవల దిల్ రాజు, సుకుమార్ లతో కలిసి వినాయక్ ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. అందులో వినాయక్ చాలా చిక్కిపోయి గుర్తుపట్టలేనంతగా మారాడు.
ఇది ఆయన ఆరోగ్యం వల్ల కాదని, 'శీనయ్య' సినిమా కోసం చేసిన డైట్ ప్రభావమని సన్నిహితులు చెబుతున్నారు. దిల్ రాజు నిర్మాణంలో వినాయక్ హీరోగా 'శీనయ్య' అనే సినిమా ప్రారంభమైంది. అయితే టెక్నికల్ కారణాల వల్ల ఇది వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమాని పూర్తిగా పక్కన పెట్టలేదని, సరైన సమయం చూసి మళ్ళీ షూటింగ్ మొదలుపెడతారని సమాచారం. 2026 చివరి నాటికి దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మాస్ సినిమాల కింగ్ వినాయక్ మళ్ళీ 'ఠాగూర్' రేంజ్ హిట్ తో బౌన్స్ బ్యాక్ అవ్వాలని అభిమానులు ఆశిస్తున్నారు.