ది దీపికా ఫైల్స్…!

సినిమా రంగం అంటేనే రంగుల ప్రపంచం. ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరు ఎప్పుడు టాప్‌లో ఉంటారో, ఎవరు ఒక్కసారిగా కనుమరుగవుతారో ఊహించడం కష్టం. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్, గ్లోబల్ ఐకాన్ దీపికా పదుకొణె విషయంలో జరుగుతున్న పరిణామాలు

Post Published By: dialnews
Updated : 23 April 2026, 2:20 PM IST

సినిమా రంగం అంటేనే రంగుల ప్రపంచం. ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరు ఎప్పుడు టాప్‌లో ఉంటారో, ఎవరు ఒక్కసారిగా కనుమరుగవుతారో ఊహించడం కష్టం. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్, గ్లోబల్ ఐకాన్ దీపికా పదుకొణె విషయంలో జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఒకప్పుడు వరుస విజయాలతో దూసుకుపోయిన ఈ స్టార్ హీరోయిన్‌కు ఇప్పుడు కాలం కలిసి రావడం లేదనే వార్తలు జోరందుకున్నాయి. గత కొంతకాలంగా దీపికా పదుకొణె పేరు సోషల్ మీడియాలో నెగటివ్ వార్తలతో మారుమోగుతోంది. అందుకు ప్రధాన కారణం ఆమె వరుసగా పెద్ద ప్రాజెక్టుల నుంచి తప్పుకుంటున్నట్లు వస్తున్న వార్తలే. మొదట పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'స్పిరిట్' సినిమా నుంచి దీపికా తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి.

ఈ ప్రాజెక్ట్ నుంచి ఆమెను తొలగించారని తెలియడంతో అభిమానులు షాక్‌కు గురయ్యారు. అక్కడితో ఆగకుండా, ప్రభాస్ - నాగ్ అశ్విన్ ల విజువల్ వండర్ 'కల్కి 2898 AD' సీక్వెల్ 'కల్కి 2' నుంచి కూడా వైజయంతీ మూవీస్ దీపికాను తప్పించినట్లు ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఈ వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే, ఇంత పెద్ద స్టార్ హీరోయిన్‌ను మేకర్స్ ఎందుకు వద్దనుకుంటున్నారు? అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. దీని వెనుక దీపికా పెడుతున్న కండిషన్లే ప్రధాన కారణమని బి-టౌన్ మీడియా కోడై కూస్తోంది. తల్లయిన తర్వాత షూటింగ్‌లో రోజుకు కేవలం 8 గంటలు మాత్రమే పాల్గొంటానని ఆమె కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది.

భారీ స్థాయిలో పారితోషికంతో పాటు ఇతర భత్యాల విషయంలో కూడా ఆమె వెనక్కి తగ్గకపోవడంతో దర్శకులు, నిర్మాతలు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారని టాక్. ప్రస్తుతం దీపికా పదుకొణె చేతిలో ఉన్న అతిపెద్ద ప్రాజెక్టులలో అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న 'రాకా' ఒకటి. అలాగే షారూఖ్ ఖాన్ తో 'కింగ్' మూవీలోనూ ఆమె నటిస్తోంది. అయితే దీపికా రెండోసారి గర్భం దాల్చినట్లు ఇటీవల అధికారిక ప్రకటన వచ్చింది. ప్రెగ్నెన్సీ సమయంలో విశ్రాంతి అవసరం కాబట్టి, యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువగా ఉండే 'రాకా' నుంచి ఆమె తప్పుకోవాలని భావిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

అట్లీ సినిమాలో దీపికా పాత్ర కోసం ఆమె ఇప్పటికే ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారట. కానీ ఇప్పుడు ఆరోగ్యం దృష్ట్యా, బిడ్డ క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఆమె ఈ కఠినమైన షూటింగ్స్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. తనపై వస్తున్న ఈ పుకార్లపై దీపికా పదుకొణె స్పందించినట్లు తెలుస్తోంది. "ఆ క్షణంలో అలా లొంగిపోయా.. అన్నీ కోల్పోయాకే విలువ తెలిసేది" అంటూ ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఊహాగానాలను ఆమె ఖండించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.ఏది ఏమైనా, ఒక వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్ కెరీర్ లో ఇలాంటి ఒడిదుడుకులు రావడం సహజమే అయినా.. దీపికా వంటి స్టార్ ఇలా వరుస ప్రాజెక్టుల నుంచి తప్పుకోవడం మాత్రం ఆమె అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

Published : 
  • 23 April 2026, 2:20 PM IST