మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'పెద్ది'. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్ర ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా పంచుకున్న విశేషాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా ఈ సినిమా కథ గురించి చెప్తూ చాలా ఎమోషనల్ అయ్యారు. "పెద్ది కథ విన్న తర్వాత నేను మనిషిని కాలేకపోయాను.. సినిమా చూశాక అందరి కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి" అని ఆయన వ్యాఖ్యానించడం చూస్తుంటే, బుచ్చిబాబు ఈసారి ఒక భారీ ఎమోషనల్ డ్రామాను సిద్ధం చేసినట్లు అర్థమవుతోంది. 'లగాన్' సినిమా తరహాలో ఈ చిత్రం ప్రేక్షకులను ఒక కొత్త అనుభూతికి లోను చేస్తుందని ఇండస్ట్రీ వర్గాల టాక్.
సినిమా ప్రధానంగా 1970-80ల నాటి విజయనగరం నేపథ్యంతో సాగే ఒక పీరియడ్ డ్రామా. ఆ కాలం నాటి వాతావరణాన్ని సహజంగా చూపించడానికి చిత్ర బృందం ఎంతో కష్టపడింది. విజయనగరం వీధులు, క్లాక్ టవర్ వంటి ప్రాంతాలను అద్భుతంగా రీ-క్రియేట్ చేశారు. మొత్తం మీద సినిమా కోసం 24 భారీ సెట్లు, 60 నుండి 70 వరకు చిన్న సెట్లు నిర్మించారు. సహజత్వం కోసం దాదాపు ఒక ఏడాది పాటు ప్రీ-ప్రొడక్షన్ పనులు చేశారు. కుస్తీ నేపథ్యం ఉన్నందున, మునుపెన్నడూ చూడని విధంగా ఒక అండర్ గ్రౌండ్ కుస్తీ సెటప్‌ను రూపొందించారు. రామ్ చరణ్ గద పట్టుకుని కనిపించే షాట్లను ఇక్కడే చిత్రీకరించారు.
భారీ స్టార్ కాస్ట్ ఉన్నప్పుడు అవుట్‌డోర్ లోకేషన్లలో షూటింగ్ చేయడం కష్టమని భావించి, హైదరాబాద్‌లోనే అద్భుతమైన లోకేషన్లను సెట్స్ రూపంలో తీర్చిదిద్దారు. ఒక హిల్ స్టేషన్ గ్రామం అవసరమైతే, దానిని హైదరాబాద్‌లోని ఒక భూత్ బంగ్లా ప్రాంతంలో నిర్మించారు. స్క్రీన్‌పై చూస్తున్నప్పుడు అది ఒక కొండ కింద ఉన్న గ్రామంలాగే కనిపిస్తుందని అవినాష్ ధీమా వ్యక్తం చేశారు. వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. విజయనగరం పీరియడ్ బ్యాక్‌డ్రాప్ మరియు రామ్ చరణ్ నటన ఈ వేసవికి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.