టాలీవుడ్ ‘జాతి రత్నం’ ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ‘చిట్టి’ పాత్రతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈ పొడుగుకాళ్ల సుందరి, తనదైన శైలిలో కెరీర్‌ను ప్లాన్ చేసుకుంటోంది. అయితే, తాజాగా ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. ఒక భారీ బ్లాక్‌బస్టర్ సినిమాను రిజెక్ట్ చేయడం తన కెరీర్‌లోనే అతిపెద్ద పొరపాటని ఆమె బహిరంగంగా అంగీకరించింది.మొదటి సినిమా ‘జాతి రత్నాలు’ అద్భుతమైన విజయం సాధించడంతో ఫరియాకు రాత్రికి రాత్రే స్టార్‌డమ్ వచ్చేసింది. ఆ సినిమా ఇచ్చిన జోష్‌లో వరుస అవకాశాలు తలుపు తట్టాయి. అయితే, ఒక నటిగా ఇండస్ట్రీలోకి కొత్తగా అడుగుపెట్టిన సమయంలో కథలను ఎంచుకోవడంలో, పాత్రల ప్రాధాన్యతను గుర్తించడంలో తనకు అప్పట్లో సరైన అవగాహన లేదని ఫరియా పేర్కొంది.
ఆ అపరిపక్వత వల్ల ఒక అద్భుతమైన అవకాశాన్ని చేజార్చుకున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దర్శకుడు ప్రశాంత్ వర్మ - హీరో తేజ సజ్జ కాంబినేషన్‌లో వచ్చిన ‘హను-మాన్’ ఎంతటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించిన ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం మొదట ఫరియా అబ్దుల్లాను సంప్రదించారట. కానీ, కొన్ని కారణాల వల్ల ఆమె ఆ ప్రాజెక్టుకు నో చెప్పింది. ఆ నిర్ణయం గురించి ఫరియా మాట్లాడుతూ.. "ప్రశాంత్ వర్మ గారు వచ్చి నాకు కథ చెప్పినప్పుడు, నాకు దానిపై పెద్దగా అవగాహన కలగలేదు. పైగా అప్పుడే ఇండస్ట్రీలోకి రావడంతో పాత్రల వెయిటేజ్‌ను అంచనా వేయలేకపోయాను.
అందుకే నో చెప్పాను. కానీ, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సాధించిన విజయం, ఆ కంటెంట్ చూశాక.. నా కెరీర్‌లోనే అది ఒక పెద్ద మిస్టేక్ అని అర్థమైంది" అని చెప్పుకొచ్చింది. ఫరియా వదులుకున్న ఆ పాత్రను చివరకు అమృత అయ్యర్ పోషించింది. ఆ సినిమా సక్సెస్‌తో అమృత కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఇప్పటికీ తేజ సజ్జ లేదా ప్రశాంత్ వర్మ కనిపిస్తే.. ఆ సినిమాను మిస్ చేసుకున్నాననే బాధ మనసులో మెదులుతూనే ఉంటుందని ఫరియా తన మనసులోని మాటను బయటపెట్టింది. ప్రస్తుతం ఫరియా అబ్దుల్లా ‘గాయపడ్డ సింహం’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగానే ఆమె ఈ ఆసక్తికర విషయాలను పంచుకుంది. గతంలో జరిగిన పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకున్నానని, ఇకపై సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉండబోతున్నానని ఆమె స్పష్టం చేసింది.