సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ లెక్కలు ఎలా మారుతాయో చెప్పడం కష్టం. సాధారణంగా ఒక సినిమా ముందుగా అనుకున్న డేట్‌కి రాకుండా వాయిదా పడితే.. ఆ సినిమా మీద బజ్ తగ్గిపోతుందని నిర్మాతలు టెన్షన్ పడుతుంటారు. కానీ ఇప్పుడు మన టాలీవుడ్ హీరోల విషయంలో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. లేట్ అవ్వడమే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అన్నట్లుగా.. ముందు రావాల్సిన సినిమా వెనక్కి వెళ్లి, తర్వాత రావాల్సిన సినిమా ముందు రావడం వాళ్లకు విపరీతంగా కలిసొస్తోంది. అనుకోకుండా జరుగుతున్న ఈ షెడ్యూల్ మార్పులు, ఆ తర్వాత వస్తున్న హిట్లు.. వాయిదా పడిన సినిమాలకు ఊహించని రేంజ్లో హైప్ తీసుకొస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి లైనప్ చూసుకుంటే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. వశిష్ట దర్శకత్వంలో చేస్తున్న సోషియో ఫాంటసీ సినిమా విశ్వంభర ఎప్పుడో మొదలైంది.. 2024 నవంబర్లోనే పూర్తైంది కూడా. కానీ అనిల్ రావిపూడితో చేసిన మన శంకరవరప్రసాద్ గారు ముందుగా థియేటర్లలోకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది.
నిజానికి విశ్వంభరకి ఉన్న బడ్జెట్, గ్రాఫిక్స్ వర్క్ వల్ల లేట్ అయ్యింది. కానీ అనిల్ రావిపూడి ఇచ్చిన భారీ కమర్షియల్ సక్సెస్ వల్ల ఇప్పుడు మెగాస్టార్ ఫుల్ ఫామ్‌లోకి వచ్చేశాడు. ఈ ఎనర్జీ, ఈ మార్కెట్ ఊపు అంతా ఇప్పుడు వాయిదా పడిన విశ్వంభరకి అద్భుతంగా హెల్ప్ అవుతుంది. వశిష్టకి ఇది నిజంగా ఒక లక్కీ ఛాన్స్. టైర్-2 హీరోల్లో మినిమం గ్యారెంటీ హీరో అయిన శర్వానంద్ కూడా ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్లో ఉన్నాడు. వాస్తవానికి డిసెంబర్ 6న శర్వానంద్ బైకర్ సినిమా రిలీజ్ కావాలి. కానీ అనివార్య కారణాల వల్ల అది పోస్ట్ పోన్ అయ్యింది. అదే సమయంలో నారీనారీ నడుమ మురారి సినిమా సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ అయింది. కెరీర్లో కొద్దిగా వెనుక బడిన శర్వానంద్‌కి ఈ సక్సెస్ మంచి బూస్ట్ ఇచ్చింది. నారీ నారీ ఇచ్చిన ఈ హిట్ వైబ్స్, పాజిటివ్ బజ్.. ఇప్పుడు లేట్‌గా రాబోతున్న బైకర్ సినిమాకి ఒక పర్ఫెక్ట్ లాంచ్ ప్యాడ్లా మారాయి. డిసెంబర్లో వచ్చి ఉంటే ఉండే బజ్ కంటే.. ఇప్పుడు ఈ సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి.
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయానికొస్తే ఈ రివర్స్ గేర్ ఆయనకు మామూలుగా ప్లస్ అవ్వడం లేదు. హరీష్ శంకర్‌తో ఉస్తాద్ భగత్ సింగ్ ఎప్పుడో మూడేళ్ళ కింద మొదలైంది. కానీ సుజీత్ దర్శకత్వంలో వచ్చిన OG ముందుగా విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించింది. ఓజితో పవన్ క్రేజ్ పీక్స్‌కి వెళ్ళిపోయింది. మొదట ఉస్తాద్ భగత్ సింగ్ లేట్ అవుతుందని ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. కానీ ఓజి ఇచ్చిన సక్సెస్ ఇప్పుడు ఉస్తాద్‌పై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్ళింది. గబ్బర్ సింగ్ కాంబోపై ఉన్న నమ్మకానికి, ఓజి హిట్ తోడవ్వడంతో ఉస్తాద్ బిజినెస్ రేంజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. మొత్తానికి టాలీవుడ్లో ఇప్పుడు ఇదొక విచిత్రమైన.. కానీ ప్రాఫిటబుల్ ట్రెండ్ అనే చెప్పాలి. ముందు అనుకున్నది వెనక్కి వెళ్లి, వెనక అనుకున్నది ముందు వచ్చి హిట్ అవ్వడం వల్ల.. లేట్ అయిన ప్రాజెక్టుల దర్శక, నిర్మాతలకు కళ్లు చెదిరే లాభాలు, ఓపెనింగ్స్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. సినిమా రిలీజ్ ఆర్డర్ మారినా, కంటెంట్ ఉంటే అది హీరో మార్కెట్‌ను పెంచి.. తదుపరి సినిమాలకు ఎలా వరంగా మారుతుందో చెప్పడానికి ఈ ముగ్గురు హీరోల లైనప్సే నిదర్శనం. సో మన హీరోలు లేట్ చేసినా.. అది కూడా వాళ్ళకు లేటెస్ట్ మార్కెట్ స్ట్రాటజీనే అవుతుంది.