ఇండస్ట్రీ పెద్దంటే ఆయనే.. ఇంతకంటే ఇంకేం చేస్తారు.. చిరంజీవిలో కొత్తగా కనిపిస్తున్న పెద్దరికం..!

తెలుగు చలనచిత్ర పరిశ్రమకు దిశానిర్దేశం చేసే పెద్ద దిక్కు ఎవరు అనే చర్చ ఎప్పటి నుంచో ఉంది. అయితే ఇటీవల మెగాస్టార్ చిరంజీవి వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 27, 2026 | 02:48 PMLast Updated on: Jan 27, 2026 | 3:49 PM

He Is The Industrys Elder Statesman What More Can He Do The Statesmanship In Chiranjeevi Is Becoming Increasingly Evident

తెలుగు చలనచిత్ర పరిశ్రమకు దిశానిర్దేశం చేసే పెద్ద దిక్కు ఎవరు అనే చర్చ ఎప్పటి నుంచో ఉంది. అయితే ఇటీవల మెగాస్టార్ చిరంజీవి వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే.. ఇండస్ట్రీ పెద్ద అంటే ఇలాగే ఉండాలనేంతగా ఆయన మారిపోయారనిపిస్తోంది. కేవలం సినిమాల్లో నటించడమే కాదు, పరిశ్రమకు ఏ కష్టం వచ్చినా.. ఏ సమస్య ఎదురైనా నేనున్నాను అంటూ ముందుకొస్తున్నారు. ప్రభుత్వాలతో చర్చలు జరపడం దగ్గరి నుంచి, పరిశ్రమ బాగోగుల కోసం చొరవ తీసుకోవడం వరకు ప్రతి విషయంలోనూ చిరంజీవి తనదైన ముద్ర వేస్తూ.. నిజమైన నాయకత్వ లక్షణాలను ప్రదర్శిస్తున్నారు. సాధారణంగా ఎవరైనా ప్రముఖులకు అవార్డులు వస్తే.. సోషల్ మీడియాలో ఒక ట్వీట్ వేసి లేదా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి విషెస్ చెప్పడం ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. కానీ చిరంజీవి మాత్రం ఆ సంప్రదాయానికి భిన్నంగా వెళ్తున్నారు.

పద్మశ్రీ అవార్డులు అందుకున్న సీనియర్ నటులు మురళీ మోహన్, రాజేంద్రప్రసాద్‌లను అభినందించడానికి స్వయంగా వాళ్ళ ఇళ్లకు వెళ్లారు. కేవలం అభినందనలు తెలపడమే కాకుండా.. వారిని ఆప్యాయంగా కౌగిలించుకుని, పూలగుచ్చాలు ఇచ్చి గౌరవించడం చూస్తుంటే.. తోటి వారి విజయాన్ని తన విజయంగా భావించే గొప్ప మనసు ఆయనలో కనిపిస్తోంది. అంతేకాదు చిరంజీవి వారి ఇళ్లకు వెళ్లి కేవలం ఫోటోలకు ఫోజులిచ్చి రాలేదు. అక్కడ వారి కుటుంబ సభ్యులతోనూ కాసేపు ముచ్చటించారు. ఆత్మీయంగా గడిపారు. ఒక ఇండస్ట్రీ పెద్దగా, సహచర నటుడిగా ఆయన చూపించిన ఈ సాన్నిహిత్యం నిజంగా అభినందనీయం. సోషల్ మీడియా విషెస్‌లో లేని ఆప్యాయత.. ఇలా ప్రత్యక్షంగా వెళ్లి కలవడంలోనే ఉంటుందని ఆయన నిరూపించారు. ఇది కేవలం మర్యాదపూర్వక కలయిక మాత్రమే కాదు, తోటి కళాకారులకు తాము ఒంటరి వాళ్ళం కాము, మా వెనుక ఒక పెద్ద ఉన్నాడు అనే భరోసాను కల్పించే చర్య ఇది.

నిజానికి ఇండస్ట్రీలో సమస్యలు వచ్చినప్పుడు ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి పరిష్కరించడం ఒక ఎత్తైతే.. పరిశ్రమలోని వ్యక్తుల విజయాలను సెలబ్రేట్ చేయడం మరో ఎత్తు. ఏ సమస్య వచ్చినా ముందుండి ప్రభుత్వాలతో మాట్లాడటంలో ఆయన ఎంత యాక్టివ్‌గా ఉంటున్నారో.. సహచరుల ఆనందంలో పాలుపంచుకోవడంలోనూ అంతే ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. అవార్డు గ్రహీతల ఇళ్లకు వెళ్లి మరీ ప్రశంసించడం ద్వారా.. మీరు సాధించిన విజయం మన అందరిదీ అనే సంకేతాన్ని చిరంజీవి బలంగా పంపించారు. ఒక నాయకుడికి ఉండాల్సిన ప్రధాన లక్షణం ఇదే కదా..! మొత్తానికి చిరంజీవి ఇప్పుడు పోషిస్తున్న పాత్ర కేవలం ఒక స్టార్ హీరోకి పరిమితం కాదు. అందరినీ కలుపుకుపోతూ, కష్టసుఖాల్లో తోడుంటూ.. విజయాలను మనస్ఫూర్తిగా ఆహ్వానించే ఒక పరిపూర్ణమైన ఇండస్ట్రీ పెద్దగా ఆయన స్థిరపడిపోతున్నారు. ఎవరైనా ఏ విజయం సాధించినా వారిని ముందుండి నడిపించడం, గౌరవించడం ద్వారా చిరంజీవి రాబోయే తరాలకు ఒక గొప్ప దారిని చూపిస్తున్నారు. బహుశా దాసరి నారాయణరావు తర్వాత ఆ స్థాయి పెద్దరికాన్ని, బాధ్యతను చిరంజీవి అంత సమర్థవంతంగా భుజాన వేసుకున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.