సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా అంటేనే అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. అలాంటిది వీళ్ళిద్దరి కలయికలో తెరకెక్కుతున్న వారణాసి సినిమా గురించి బయటకు వచ్చిన అప్డేట్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాను కేవలం సాధారణ ఫార్మాట్‌లో కాకుండా, పూర్తిస్థాయిలో IMAX ఫార్మాట్‌లో చిత్రీకరించాలని జక్కన్న నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని ముందే చెప్పాడు దర్శక ధీరుడు.. ఇది కేవలం గొప్పగా చెప్పుకోవడానికి తీసుకున్న నిర్ణయం కాదు.. కథ డిమాండ్ మేరకే ఈ భారీ సాంకేతికతను వాడుతున్నట్లు స్పష్టమవుతోంది. రాజమౌళి ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం సినిమాలోని స్కేల్. ఈ కథను గ్లోబల్ స్థాయిలో చెప్పబోతున్నాడు కాబట్టి.. ఆ భారీతనాన్ని చూపించడానికి సాధారణ స్క్రీన్లు సరిపోవు. ముఖ్యంగా అంటార్కిటికా మంచు కొండలు, దట్టమైన అటవీ ప్రాంతాల్లో జరిగే సాహస ఘట్టాలను ప్రేక్షకులు చూస్తున్నప్పుడు.. తాము కూడా ఆ ప్రదేశంలోనే ఉన్నామనే అనుభూతిని పొందాలి.
సాధారణ థియేటర్ స్క్రీన్ కొంతమేర విజువల్స్‌ను కట్ చేస్తే, ఐమాక్స్ మాత్రం ఆ దృశ్యాలను విస్తృతంగా, అత్యంత స్పష్టతతో కళ్లకు కడుతుంది. అందుకే జక్కన్న తన విజన్‌కు ఐమాక్సే సరైన వేదిక అని భావించాడు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ కథలో రామాయణ కాలానికి చెందిన కొన్ని గ్రాండ్ విజువల్స్, పురాతన ఆలయాల ప్రస్తావన ఉండబోతోందని సమాచారం. ఆనాటి వైభవాన్ని, ఆర్కిటెక్చర్‌ను, డివైన్ ఎలిమెంట్స్‌ను ఎలివేట్ చేయాలంటే స్క్రీన్ మీద గ్రాండియర్ చాలా ముఖ్యం. చిన్న స్క్రీన్‌పై చూస్తే మిస్ అయ్యే డీటైలింగ్, ఐమాక్స్ కెమెరాలతో షూట్ చేయడం వల్ల ప్రతి చిన్న అంశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎమోషన్‌ను, భక్తి భావాన్ని అలాగే ఆ ఉద్విగ్నతను ప్రేక్షకుడి గుండెల్లోకి నేరుగా పంపడానికి ఈ లార్జ్ ఫార్మాట్ అద్భుతంగా ఉపయోగపడుతుందని రాజమౌళి నమ్ముతున్నాడు.
ఇక మహేష్ బాబు అభిమానులకు ఇది నిజంగానే ఒక విజువల్ ఫీస్ట్ కానుంది. మహేష్‌ను ఇంతవరకు ఎవరూ చూపించని విధంగా, అత్యంత స్టైలిష్‌గా, గ్లోబల్ అడ్వెంచరర్‌గా రాజమౌళి చూపించబోతున్నాడు. ఐమాక్స్ స్క్రీన్ మీద సూపర్ స్టార్ కటౌట్ కనిపిస్తుంటే.. ఆ ఇంపాక్ట్ మామూలుగా ఉండదు. మహేష్ అందం, అభినయం, యాక్షన్ సీక్వెన్స్‌లు ఈ హై-రిజల్యూషన్ ఫార్మాట్‌లో రెట్టింపు స్థాయిలో ఎలివేట్ అవుతాయి. ఇది కేవలం సినిమా చూడటం కాదు.. మహేష్ బాబును సరికొత్త కోణంలో ఆవిష్కరించే ఒక దృశ్య కావ్యంలా ఉండబోతోంది. మొత్తానికి వారణాసి సినిమాతో రాజమౌళి ఇండియన్ సినిమా టెక్నికల్ స్టాండర్డ్స్‌ను మరో మెట్టు ఎక్కించబోతున్నాడు. హాలీవుడ్ సినిమాలు చూసి మనం ఆశ్చర్యపోయే రోజులు పోయి, మన సినిమా చూసి ప్రపంచం ఆశ్చర్యపోయేలా చేయాలన్నదే జక్కన్న తపన. కథ, కథనంతో పాటు సాంకేతికతను కూడా జోడించి, ప్రేక్షకులకు ఒక కంప్లీట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడమే లక్ష్యంగా వారణాసి సిద్ధమవుతోంది. ఈ ఐమాక్స్ అనుభవం కోసం ప్రేక్షకులు ఇప్పుడు రెట్టింపు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.