పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ వినయం, నిరాడంబరత గురించి సినీ వర్గాల్లో తరచుగా చర్చ జరుగుతుంటుంది. 'బాహుబలి' సినిమాతో పాన్-ఇండియా ట్రెండ్‌ను మొదలుపెట్టిన ప్రభాస్, గ్లోబల్ స్థాయిలో ఎంతటి గుర్తింపు తెచ్చుకున్నా ఆయన వ్యక్తిత్వంలో ఏమాత్రం గర్వం కనిపించదు. ఇటీవల సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కబోతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'స్పిరిట్' కు సంబంధించి ఒక వార్త బాగా వైరల్ అయింది. అదేంటంటే.. ఈ సినిమాలో ప్రభాస్ పేరు ముందు 'ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్‌స్టార్' అనే భారీ ట్యాగ్ వేయబోతున్నారని.
ఈ ట్యాగ్ పై సోషల్ మీడియాలో మరియు చిత్ర పరిశ్రమలో తీవ్రస్థాయిలో చర్చ నడిచింది. అయితే ఈ భారీ టైటిల్ పట్ల ప్రభాస్ ఎలా స్పందించారు? దానిని ఆయన ఎలా స్వీకరించారనే దానిపై 'స్పిరిట్' చిత్ర నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా స్పందిస్తూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
సాధారణంగా చిత్ర పరిశ్రమలో అగ్ర నటులు తమ బిరుదులు, ప్రచార ట్యాగ్స్ లేదా క్రెడిట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా, పట్టింపులతో ఉంటారు. ఏ చిన్న మార్పు ఉన్నా ముందే పక్కాగా ప్లాన్ చేసుకుంటారు. కానీ ప్రభాస్ విషయంలో ఈ ప్రకటన ఎలా జరిగిందో నిర్మాత ప్రణయ్ రెడ్డి వివరించారు. టైటిల్ లేదా ఫస్ట్ లుక్ ఆవిష్కరణకు ముందే ఈ అంశాన్ని ప్రభాస్ వద్ద మేకర్స్ ప్రస్తావించారట. 'ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్‌స్టార్' అనే ట్యాగ్ ఉపయోగించడం గురించి చెప్పగానే, ప్రభాస్ ఎంతో క్యాజువల్‌గా, తన సహజ సిద్ధమైన నవ్వుతో "మీ ఇష్టం డార్లింగ్" అంటూ ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా వెంటనే అంగీకారం తెలిపారట. ఆయన ఇచ్చిన ఈ ఒక్క చిన్న సమాధానమే ఆయన నిరాడంబరతకు, అలాగే దర్శక నిర్మాతలపై ఆయనకున్న అపారమైన నమ్మకానికి అద్దం పడుతోందని ప్రణయ్ రెడ్డి వంగా ప్రశంసించారు.
ప్రస్తుతం ప్రభాస్ వరుసగా భారీ బడ్జెట్ పాన్-ఇండియా సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. విభిన్న కథాంశాలతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాల షూటింగ్ షెడ్యూళ్లను సర్దుబాటు చేయడంలో ప్రభాస్ చాలా ఫ్లెక్సిబుల్‌గా వ్యవహరిస్తున్నారని నిర్మాత చెప్పారు. ఒకవైపు భారీ ఆక్షన్ ఎంటర్టైనర్లు, మరొకవైపు డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలను బ్యాలెన్స్ చేస్తూ ప్రభాస్ చూపిస్తున్న సమర్పణ భావం మేకర్స్‌కు ఎంతో ఉపశమనాన్ని ఇస్తోందని ప్రణయ్ రెడ్డి తెలిపారు. తన ఇమేజ్ గురించి ఏమాత్రం హడావుడి చేయకుండా, కంటెంట్ మరియు దర్శకుడి విజన్ కే ప్రాధాన్యతనిచ్చే ప్రభాస్ రియల్ లైఫ్ క్యారెక్టర్ చూసి సినీ అభిమానులు మరోసారి మురిసిపోతున్నారు. అందుకే ఆయన కేవలం తెరపైనే కాకుండా నిజ జీవితంలో కూడా రియల్ 'సూపర్‌స్టార్' అని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.