భారతీయ సినిమా పరిశ్రమను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన అగ్రదర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి మరో అసాధారణ సాహసానికి సిద్ధమవుతున్నారు. 'బాహుబలి' సినిమాతో ప్రపంచ సినీ ప్రేమికుల దృష్టిని ఆకర్షించిన రాజమౌళి, 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో తన క్రేజ్‌ను మరింత పెంచుకున్నారు. క్రిస్టోఫర్ నోలన్ వంటి దిగ్గజ దర్శకులు సైతం రాజమౌళి టేకింగ్, మేకింగ్‌పై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి వారణాసి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.ఇప్పుడు ఈ సినిమాను హాలీవుడ్‌ను సైతం మించిపోయేలా మరో మెట్టు పైకి తీసుకెళ్లేందుకు జక్కన్న ప్రయత్నిస్తున్నారు.
రాజమౌళి తన తాజా చిత్రానికి సంబంధించి అత్యంత సాహసోపేతమైన, ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే... ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 భాషల్లోకి డబ్ చేయాలని రాజమౌళి నిర్ణయించుకున్నారు!ఇక్కడ మరో విశేషమేమిటంటే, ఈ భారీ డబ్బింగ్ ప్రక్రియను ఎలాంటి కృత్రిమ మేధస్సు సహాయం లేకుండానే పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సాధారణంగా రాజమౌళి తన సినిమాల కోసం ప్రపంచంలోనే అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానం, అలాగే అత్యుత్తమ సాంకేతిక నిపుణులను ఉపయోగిస్తుంటారు. ఈ ప్రాజెక్ట్ విషయంలోనూ అదే పద్ధతిని అనుసరిస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా భాగం పూర్తి చేశారు రాజమౌళి.
వచ్చే అక్టోబర్‌లో ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించి మిగిలిన పనులు పూర్తి చేసి, ఆ తర్వాత పోస్ట్-ప్రొడక్షన్ పనులను ప్రారంభించే యోచనలో జక్కన్న ఉన్నారు. రాజమౌళి - మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలవనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 50 భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచ నలుమూలలకూ చాటిచెప్పడం ఖాయం.