రెహమాన్ మెచ్చిన రక్షిత…!

సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పాట మార్మోగిపోతోంది. అదే.. గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమాలోని ప్రత్యేక గీతం ‘హల్లల్లల్లో’.ఈ పాటలో వినిపిస్తున్న ఆ విలక్షణమైన, గమ్మత్తైన గొంతు ఎవరిదా అని సంగీత శ్రోతలు

Post Published By: dialnews
Updated : 28 May 2026, 11:50 AM IST

సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పాట మార్మోగిపోతోంది. అదే.. గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమాలోని ప్రత్యేక గీతం ‘హల్లల్లల్లో’.ఈ పాటలో వినిపిస్తున్న ఆ విలక్షణమైన, గమ్మత్తైన గొంతు ఎవరిదా అని సంగీత శ్రోతలు అంతర్జాలంలో తెగ సెర్చ్ చేసేస్తున్నారు. తను మరెవరో కాదు, ప్రముఖ గాయని రక్షితా సురేష్. ఈ సాంగ్, ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఉత్తరాంధ్ర యాసతో కూడిన ఈ మాస్ నంబర్‌ను తనదైన శైలిలో పాడి సంగీత ప్రియులను ఊరూతలూగిస్తున్నారు రక్షిత. కర్ణాటకలోని మైసూర్ నగరానికి చెందిన రక్షితకు చిన్నతనం నుంచే సంగీతంపై విపరీతమైన ఆసక్తి ఉండేది. కేవలం ఆసక్తితోనే ఆగిపోకుండా.. కర్ణాటక సంగీతం, హిందుస్తానీ శాస్త్రీయ సంగీతంతో పాటు లైట్ మ్యూజిక్‌లో కూడా ఆమె విధిగా శిక్షణ పొందారు. తన ప్రతిభతో టీవీ రియాలిటీ షోలలో రక్షిత రికార్డులు సృష్టించారు.

కన్నడంలో ప్రసారమైన ‘రిథమ్ తధీమ్’, అలాగే ‘లిటిల్ స్టార్ సింగర్-2009’ టైటిల్స్‌ను ఆమె కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత తమిళంలో ఊహించని స్థాయిలో పాపులారిటీ తెచ్చుకున్న ‘సూపర్ సింగర్ 6’ షోలో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించారు.
రక్షితది మైసూర్ అయినప్పటికీ, ఆమె సినీ సంగీత ప్రయాణం మాత్రం ఒక తెలుగు పాటతోనే ప్రారంభం కావడం విశేషం.
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా.. రక్షితను గాయనిగా చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. 2015లో నాని నటించిన ‘ఎవడే సుబ్రమణ్యం’ చిత్రంలోని ‘చల్లగాలి తాకుతున్న మేఘమైనదీ మనసిలా’ అనే గీతం ద్వారా ఆమె తొలి ప్రయత్నంలోనే తెలుగు శ్రోతల హృదయాలను హత్తుకున్నారు. ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లవ్ స్టోరీ’ చిత్రంలో ‘ముత్యాల చెమ్మ చెక్క’ పాటతో తనలోని మరో వైవిధ్యాన్ని ఆవిష్కరించి మెప్పించారు. డబ్బింగ్ సినిమాల ద్వారా కూడా రక్షిత తెలుగు ఆడియన్స్‌కు బాగా దగ్గరయ్యారు.

షారుఖ్ ఖాన్ ‘జవాన్’ చిత్రంలోని ‘ రామయ్య వస్తావయ్యా’, అలాగే ‘ది లెజెండ్’ సినిమాలోని ‘తొలి తొలి ఆశల ఊసులే’ వంటి తెలుగు బ్లాక్ బస్టర్ వెర్షన్స్ రక్షిత ఖాతాలో ఉన్నవే. వీటితో పాటు హిప్‌హాప్ తమిళ, జీవీ ప్రకాష్ కుమార్, యువన్ శంకర్ రాజా వంటి అగ్ర సంగీత దర్శకులతో ఆమె ఎన్నో విభిన్నమైన ప్రాజెక్ట్స్ చేశారు. రక్షితా సురేష్ కెరీర్‌లో ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్‌తో ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకమైనది. ఆమె ఎక్కువగా రెహమాన్ సంగీత దర్శకత్వంలోనే పాటలు పాడారు. వీరి కాంబినేషన్ ‘మిమీ’ చిత్రంతో మొదలైంది. ఆ తర్వాత రెహమాన్ మ్యూజిక్ అందించిన ఎన్నో భారీ చిత్రాల్లో రక్షిత తన గాత్రాన్ని అందించారు. సినిమాల్లోనే కాకుండా దేశ విదేశాల్లో జరిగే రెహమాన్ లైవ్ మ్యూజికల్ కాన్సెర్ట్స్‌లో కూడా రక్షిత స్టేజ్ పైన సందడి చేస్తూ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంటారు.

ఇక ప్రస్తుత విషయానికి వస్తే, రామ్‌చరణ్ ‘పెద్ది’ సినిమాలోని ‘హల్లల్లల్లో’ పాట రక్షిత కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. సాధారణంగా ఆమె పాడే స్టైల్‌కు, ఈ ఉత్తరాంధ్ర మాస్ యాస పాటకూ అస్సలు సంబంధం లేదు. తన శైలికి పూర్తిగా భిన్నమైన పాట అయినప్పటికీ, రక్షిత ఎక్కడా తగ్గకుండా అదరగొట్టేశారు. ఈ పాట ఇప్పుడు యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో రీ-సౌండ్ చేస్తోంది.వైవిధ్యమైన గొంతుతో, క్లాస్ నుండి మాస్ వరకు అన్ని రకాల పాటలను అలవోకగా పాడగలనని రక్షితా సురేష్ మరోసారి నిరూపించుకున్నారు. భవిష్యత్తులో ఈ మైసూర్ బ్యూటీ తెలుగులో మరిన్ని క్రేజీ అవకాశాలు అందుకోవాలని, మనల్ని ఇలాగే అలరించాలని మెగా ఫ్యాన్స్ తో పాటు, సినీ అభిమానులు ‌సైతం విష్ చేస్తున్నారు.

Published : 
  • 28 May 2026, 11:50 AM IST