94 ఏళ్ళ వయసులో సాహసం.. మెగాఫోన్ పట్టిన సింగీతం… నాగ్ అశ్విన్ పర్యవేక్షణలో క్రేజీ ప్రాజెక్ట్..!

వయసు కేవలం ఒక అంకె మాత్రమే.. ఇండస్ట్రీలో ఒక పెద్ద దర్శకుడిని చూసిన తర్వాత ఇప్పుడు ఇదే అనిపిస్తుంది. మామూలుగా అయితే 94 ఏళ్ళ వయసులో ఏం చేస్తాం.

Post Published By: dialnews
Updated : 2 February 2026, 10:45 AM IST

వయసు కేవలం ఒక అంకె మాత్రమే.. ఇండస్ట్రీలో ఒక పెద్ద దర్శకుడిని చూసిన తర్వాత ఇప్పుడు ఇదే అనిపిస్తుంది. మామూలుగా అయితే 94 ఏళ్ళ వయసులో ఏం చేస్తాం.. పైకి లేవడం పక్కన పెట్టండి కనీసం పక్కకి చూడడానికి కూడా ఇంకొకరి సాయం కావాలి. కానీ ఇక్కడ ఒక దర్శకుడు మాత్రం ఏకంగా 94 వయసులో కొత్త సినిమా మొదలు పెట్టాడు. అయినా కళామతల్లి ముద్దుబిడ్డకు వయసుతో పనేముంది..? సృజనాత్మకతకు కాలం అడ్డుపడుతుందా? ఈ ప్రశ్నలకు లేదు అని గట్టిగా సమాధానం చెబుతున్నారు దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. 94 ఏళ్ళ వయసులో, సాధారణంగా విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో, ఆయన మళ్ళీ మెగాఫోన్ పట్టి తెలుగు చలనచిత్ర పరిశ్రమను ఆశ్చర్యపరిచారు. వయోభారం రీత్యా గత కొన్నేళ్లుగా దర్శకత్వానికి దూరంగా ఉన్నప్పటికీ, సినిమాపై ఆయనకున్న ప్రేమ ఏమాత్రం తగ్గలేదు.

ఇప్పుడు అదే ఉత్సాహంతో, కుర్రకారుకు ఏమాత్రం తీసిపోని ఎనర్జీతో సరికొత్త సినిమాను ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన వైజయంతి మూవీస్ నిర్మిస్తుండటం విశేషం. మహానటి, కల్కి 2898 AD వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్.. ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. ఒక పక్క తొంభై ఏళ్లు దాటిన అనుభవం ఉన్న లెజెండ్, మరోపక్క ఆధునిక సాంకేతికతతో సినిమాలు తీసే యువ దర్శకుడు... ఇలా రెండు తరాల సృజనాత్మకత కలుస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా పెరిగాయి. గురువు లాంటి సింగీతం గారికి, శిష్యుడి స్థానంలో ఉండి నాగ్ అశ్విన్ సహకారం అందించడం నిజంగా ఒక అరుదైన దృశ్యం. ఈ సినిమా ద్వారా సింగీతం పూర్తిగా కొత్త నటీనటులను వెండితెరకు పరిచయం చేయబోతున్నారు. కథలో ఉన్న తాజాదనాన్ని ప్రతిబింబించడానికి కొత్తవారే సరైన న్యాయం చేస్తారని ఆయన భావించినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండటం మరో పెద్ద ఆకర్షణ.

తన సంగీతంతో ఎలాంటి సినిమానైనా మరో స్థాయికి తీసుకెళ్లగల దేవిశ్రీ.. సింగీతం క్లాసిక్ టేకింగ్‌కు ఎలాంటి బీట్స్ ఇస్తారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. తెలుగు సినిమా చరిత్రలో ప్రయోగాలకు పెద్దపీట వేసిన దర్శకుల్లో సింగీతం శ్రీనివాసరావు అగ్రగణ్యులు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో ఆదిత్య 369.. మాటలే లేని పుష్పక విమానం.. జానపద చిత్రరాజం భైరవ ద్వీపం.. విభిన్నమైన కథతో విచిత్ర సోదరులు... ఇలా ప్రతి సినిమాలోనూ వైవిధ్యాన్ని చూపించారు.

ఇప్పుడు 94 ఏళ్ళ వయసులో ఆయన చేస్తున్న ఈ ప్రయత్నం కూడా కచ్చితంగా మరో ప్రయోగమే అవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వయసులో కూడా ఆయన ఆలోచనలు ఎంత ఆధునికంగా ఉంటాయో చూడటానికి ఈ సినిమా ఒక వేదిక కానుంది.మొత్తానికి భారతీయ చలనచిత్ర చరిత్రలోనే ఇదొక అద్భుత ఘట్టంగా చెప్పుకోవచ్చు. ఒక దర్శకుడు 94 ఏళ్ళ వయసులో సెట్స్ పైకి వెళ్లడం అనేది అరుదైన విషయం. నాగ్ అశ్విన్ ఆధ్వర్యంలో.. వైజయంతి మూవీస్ నిర్మాణంలో, దేవిశ్రీ ప్రసాద్ సంగీతంతో, కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు చేయబోయే ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుందనడంలో సందేహం లేదు. ఈ సినిమా విజయం సాధించి.. కళకు వయసుతో సంబంధం లేదని మరోసారి నిరూపించాలని కోరుకుందాం.

Published : 
  • 2 February 2026, 10:45 AM IST