తమిళనాడు రాజకీయాలకు, సినిమా రంగానికి ఎప్పటి నుంచో ఒక విడదీయరాని బంధం ఉంది. నాటి ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత కాలం నుంచి నేటి దళపతి విజయ్ వరకు.. కోలీవుడ్ స్టార్లు చాలా మంది రాజకీయాల్లోకి వచ్చి తమ సత్తా చాటుతున్నారు. విజయ్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ ఫుల్‌గా సీఎం అయిన ఈ తరుణంలో, కోలీవుడ్‌లో మరికొంతమంది స్టార్ల పేర్లు కూడా రాజకీయాల చుట్టూ తిరుగుతున్నాయి. రాఘవ లారెన్స్, విశాల్, జీవీ ప్రకాశ్, త్రిష లాంటి వాళ్ల పొలిటికల్ ఎంట్రీ గురించి ఊహాగానాలు వినిపిస్తున్న సమయంలో.. సడెన్‌గా స్టార్ హీరో సూర్య పేరు తెరపైకి రావడం పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. త్వరలోనే సూర్య కూడా ఖద్దరు చొక్కా వేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం మొదలైంది. దీంతో ఒక్కసారిగా పొలిటికల్ వైబ్రేషన్స్ మొదలయ్యాయి.
సూర్య కేవలం వెండితెరపై మాత్రమే కాదు, సమాజంలో కూడా ఎంతో మందికి రియల్ హీరోగా నిలుస్తున్నారు. ఆయన స్థాపించిన 'అగరం ఫౌండేషన్' ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను ఉచితంగా అందిస్తూ అండగా ఉంటున్నారు. ఈ సేవా కార్యక్రమాలు సూర్యకు ప్రజల్లో ఎనలేని గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. అయితే, ఇటీవల చెన్నైలో జరిగిన 'సూర్య ఆల్ ఇండియా ఫ్యాన్స్ వెల్ఫేర్ అసోసియేషన్' మీటింగ్‌లో ఆ సంఘం ప్రతినిధి ఆర్. వీరమణి చేసిన కొన్ని కామెంట్స్ ఈ పొలిటికల్ రూమర్స్‌కు ఆజ్యం పోశాయి. "భవిష్యత్తులో సూర్య కచ్చితంగా రాజకీయాల్లోకి రావడం ఖాయం" అని ఆయన అనడంతో.. సూర్య పొలిటికల్ ఎంట్రీ కన్ఫర్మ్ అంటూ తమిళ మీడియాతో పాటు సోషల్ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి.
సూర్య రాజకీయాల్లోకి వస్తున్నారంటూ రాజకీయ, సినీ వర్గాల్లో వార్తలు సెగలు పుట్టిస్తుండటంతో.. ఫైనల్‌గా సూర్య టీం దీనిపై స్పందించి అధికారికంగా ఫుల్ క్లారిటీ ఇచ్చింది. వస్తున్న రూమర్స్‌కు పుల్ స్టాప్ పెడుతూ క్లియర్‌గా ఒక ప్రకటన చేసింది. "ప్రస్తుతానికి సూర్యకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన అస్సలు లేదు. ఫ్యాన్స్ మీటింగ్‌లో వీరమణి మాట్లాడిన మాటలు కేవలం ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఆ వ్యాఖ్యలకు, సూర్యకు ఎలాంటి సంబంధం లేదు" అని టీమ్ తేల్చి చెప్పేసింది. అంతేకాకుండా, అగరం ఫౌండేషన్ ద్వారా సూర్య చేస్తున్న సేవా కార్యక్రమాలు కేవలం సమాజం పట్ల ఉన్న బాధ్యతతో
చేస్తున్నవే తప్ప.. వాటి వెనుక ఎలాంటి పొలిటికల్ అజెండా లేదని కూడా స్పష్టం చేసింది. ఆయన సేవా గుణాన్ని రాజకీయాలతో ముడిపెట్టొద్దని సూర్య ఆర్మీ సైతం అభిమానులను కోరుతోంది. ప్రస్తుతం సూర్య పూర్తిగా తన సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. తన లైనప్‌లో ఉన్న భారీ పాన్-ఇండియా సినిమాలను పూర్తి చేసే పనిలో ఆయన ఫుల్ బిజీగా ఉన్నారు. సూర్య బృందం ఇచ్చిన ఈ అధికారిక క్లారిటీతో.. ప్రస్తుతానికైతే ఆయన పొలిటికల్ ఎంట్రీ వార్తలకు పూర్తిగా ఎండ్ కార్డ్ పడినట్లే అని చెప్పొచ్చు.