భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న నటుడు రణబీర్ కపూర్. ప్రస్తుతం ఆయన ఖాతాలో మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం వచ్చి చేరింది. ప్రతిష్టాత్మక టైమ్ మ్యాగజైన్ తాజాగా విడుదల చేసిన 'ప్రపంచవ్యాప్త అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితా-2026'లో రణబీర్ కపూర్ చోటు దక్కించుకున్నారు. ఈ ఏడాది టైమ్స్ 100 జాబితాలో చోటు సంపాదించిన ఏకైక భారతీయ నటుడు రణబీర్ కావడం విశేషం. గ్లోబల్ స్థాయిలో భారతీయ సినిమా సత్తాను చాటుతూ ఆయన ఈ ఘనత సాధించారు. కేవలం నటనతోనే కాకుండా, తన ఎంపిక చేసుకునే పాత్రలతో సినిమా గమనాన్ని మార్చగల సత్తా ఆయనకు ఉందని ఈ గుర్తింపు నిరూపించింది. ఈ సందర్భంగా మరో ప్రముఖ నటుడు ఆయుష్మాన్ ఖురానా, రణబీర్ కపూర్ గురించి రాసిన ప్రొఫైల్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
సాధారణంగా ఇండస్ట్రీలో ఒక సినిమా విజయాన్ని బాక్సాఫీస్ వద్ద వచ్చే వసూళ్లను బట్టి అంచనా వేస్తారని, కానీ రణబీర్ ఆ లెక్కలకు అతీతమని ఆయుష్మాన్ పేర్కొన్నారు. రణబీర్ ఎప్పుడూ కేవలం నెంబర్ల కోసం పనిచేయడు. తను పోషించే పాత్రపై, ఇచ్చే పర్ఫార్మెన్స్‌పైనే పూర్తి దృష్టి సారిస్తాడు. ఆ అంకితభావమే అతడిని ఈ స్థాయిలో నిలబెట్టింది అని ఆయుష్మాన్ ఖురానా రాసుకొచ్చాడు. రణబీర్ కపూర్ కెరీర్‌లో 'యానిమల్' సినిమా ఒక సంచలనంగా నిలిచింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించడమే కాకుండా, రణబీర్‌లోని అసలైన నటుడిని మరోసారి ప్రపంచానికి పరిచయం చేసింది.
ప్రస్తుతం ఆయన ఇండియన్ సినిమాలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ రామాయణలో నటిస్తున్నారు.కేవలం రామాయణం మాత్రమే కాకుండా, లెజెండరీ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో 'లవ్ అండ్ వార్' అనే భారీ ప్రాజెక్టును కూడా రణబీర్ ప్రకటించారు. విభిన్నమైన కథాంశాలతో, అగ్ర దర్శకులతో వరుస సినిమాలు చేస్తూ రణబీర్ తన కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నారు. భారతీయ సినిమాను గ్లోబల్ ప్లాట్‌ఫారమ్ మీద నిలబెడుతూ, టైమ్ మ్యాగజైన్ వంటి వేదికలపై గుర్తింపు పొందడం రణబీర్ కపూర్ క్రేజ్‌కు నిదర్శనం. బాక్సాఫీస్ సక్సెస్ మాత్రమే కాకుండా, నటుడిగా నిరంతరం తనను తాను మలుచుకుంటూ ముందుకు సాగడం వల్లే ఈ అరుదైన గౌరవం ఆయనకు దక్కింది.