కవల పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత గ్రాటిట్యూడ్ వీడియో విడుదల చేశారు ఉపాసన. ఈ వీడియోను చూసిన ప్రతిసారీ నా హృదయం ఏదో తెలియని ఆనందంతో, సంతృప్తితో నిండిపోతోంది. మా చుట్టూ ఇంత మంది మంచి మనుషులు, ఇంతటి ప్రేమ, ధైర్యం, సానుకూల దృక్పథం ఉండటం నిజంగా మా పూర్వజన్మ సుకృతం. మా కుటుంబంపై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలు చూస్తుంటే మేం ఎంత అదృష్టవంతులమో అర్థమవుతోంది. అందుకే రెండు చేతులు జోడించి ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు చెబుతున్నాను. మా కుటుంబం నిజంగా బ్లెస్డ్. ఈ ప్రయాణంలో మాకు వెన్నంటి నిలిచిన వైద్య బృందానికి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా డాక్టర్ తేజస్వి రావు గారికి మరియు మొత్తం అపోలో హాస్పిటల్స్ టీమ్‌కి నా ప్రత్యేక కృతజ్ఞతలు. మీరు మా పట్ల చూపించిన శ్రద్ధ, తీసుకున్న కేర్, మీ అంకితభావం మాకు ఎంతో విలువైనవి.
మాకు అవసరమైన సమయంలో మీరు అందించిన సేవలు మా కుటుంబానికి ఎంతో ఊరటను ఇచ్చాయి. ఇక మా రామ్ చరణ్ అభిమానులు, శ్రేయోభిలాషుల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. మీ ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో, ఎంత గొప్పదో నాకు బాగా తెలుసు. అది కేవలం అభిమానం మాత్రమే కాదు, మంచి మనసుతో కూడిన బంధం. మీ నుంచి వచ్చే ఆదరణ ఎప్పుడూ స్వచ్ఛమైన మంచితనం నుంచే వస్తుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. అయితే ఒక తల్లిగా మీకు చిన్న విన్నపం.
మా పిల్లల భద్రత విషయంలో, వారి ప్రైవసీ విషయంలో మీరు ఎప్పుడూ బాధ్యతగా ఉంటారని నేను నమ్ముతున్నాను. వారిని మీ సొంత ఇంటి పిల్లల్లా భావించి, వారి రక్షణకు, భద్రతకు మీరు కూడా ప్రాధాన్యత ఇస్తారని ఆశిస్తున్నాను. మీ ప్రేమ మా పిల్లలకు రక్షణ కవచంలా ఉంటుందని, వారి సేఫ్టీని మీరు గౌరవిస్తారని నా నమ్మకం.చివరగా.. మా క్షేమం కోరుతూ ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ప్రార్థనలు చేశారు. వారందరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీరు పంపిన ఆశీర్వాదాలు, చేసిన ప్రార్థనలు మా హృదయాల్లో ఎప్పటికీ పదిలంగా ఉంటాయి. మీ అందరి ప్రేమే మా బలం.. అంటూ తన ఎమోషనల్ మెసేజ్ పంపారు ఉపాసన.