రీల్ లైఫ్ లోనే కాదు, రియల్ లైఫ్ లో కూడా తాను ఒక 'అర్జున్ రెడ్డి' అని నిరూపించుకున్నారు మన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. ఇటీవల రష్మిక మందన్నతో వివాహం తర్వాత తన సొంత ఊరు వెళ్లిన విజయ్, అక్కడ విద్యార్థుల కోసం ఒక అద్భుతమైన స్కాలర్షిప్ పథకాన్ని ప్రకటించాడు. విషయమేమిటంటే, విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న పెళ్లి తర్వాత నాగర్ కర్నూల్ జిల్లా, బల్మూర్ మండలం, తుమ్మన్ పేటలోని తమ సొంత ఇంటికి వెళ్లారు. అక్కడ గృహప్రవేశం మరియు సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. ఈ వేడుకకు తన కుటుంబ సభ్యులు ఆనంద్ దేవరకొండ, తల్లి మాధవితో పాటు ఊరి ప్రజలందరూ హాజరయ్యారు. ఆ సంతోష సమయంలోనే ఈ స్కాలర్షిప్ ప్రకటన చేశాడు.
అచ్చంపేట డివిజన్ పరిధిలోని 44 ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 9వ తరగతి మరియు 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ అందనుంది. ప్రతి స్కూల్లో 9వ మరియు 10వ తరగతుల్లో మొదటి మరియు రెండవ స్థానాల్లో నిలిచిన మెరిట్ విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ అందుతుంది. ఇది 'దేవరకొండ ఛారిటబుల్ ట్రస్ట్' ద్వారా అందించబడుతుంది. విజయ్ మాట్లాడుతూ.. "మా నాన్నకు ఊర్లో ఇల్లు కట్టుకోవాలని కోరిక ఉండేది, అది ఇప్పుడు నెరవేరింది. ఇకపై నేను తరచుగా మా ఊరికి వస్తూనే ఉంటాను. నా వంతుగా మా ప్రాంత విద్యార్థులకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాను.
డబ్బు లేక చదువు ఆగకూడదు అన్నదే నా లక్ష్యం" అని ఎమోషనల్ గా చెప్పాడు. గతంలో కూడా విజయ్ 'మిడిల్ క్లాస్ ఫండ్' ద్వారా కరోనా సమయంలో వేల కుటుంబాలను అందుకున్నాడు. ఇప్పుడు నేరుగా విద్యార్థుల విద్యపై దృష్టి పెట్టడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని టాలెంటెడ్ స్టూడెంట్స్ కు గొప్ప ప్రోత్సాహం లభిస్తుంది అని విజయ్ ఫ్యాన్స్ గర్వపడుతున్నారు. పుట్టిన ఊరి కోసం ఇంత మంచి నిర్ణయం తీసుకున్న విజయ్ దేవరకొండను నెటిజన్లు 'రియల్ హీరో' అని కొనియాడుతున్నారు. రష్మిక మందన్న కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను ఉత్సాహపరిచారు.