అమెరికాలో పోలీసు నిర్లక్ష్యానికి బలైపోయిన తెలుగు విద్యార్థిని జాహ్నవి కేసులో.. అంతర్జాతీయ స్థాయిలో కీలక పరిణామం చోటుచేసుకుంది. 2023లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి జాహ్నవి కుటుంబానికి 29 మిలియన్ డాలర్లు.. అంటే మన కరెన్సీలో 262 కోట్లు పరిహారంగా చెల్లించేందుకు సియాటెల్ నగర యంత్రాంగం అంగీకరించింది. ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి.. 2021లో అమెరికా వెళ్లింది. సౌత్లేక్లోని నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీలో చేరారు. 2023 జనవరి 23 రాత్రి.. సియాటెల్ వీధుల్లో ఆమె రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగింది. కెవిన్ డవే అనే పోలీసు అధికారి.. తన పెట్రోలింగ్ వాహనాన్ని అత్యంత వేగంగా నడుపుతూ వచ్చి.. జాహ్నవిని ఢీకొట్టాడు.
ప్రమాద తీవ్రతకు ఆమె సుమారు 100 అడుగుల దూరంలో ఎగిరిపడి.. అక్కడికక్కడే చనిపోయింది. ఇంతకుమించిన ఘోరం.. బాడీ కెమెరాల్లో రికార్డయింది. అది ప్రపంచమంతా ఆగ్రహంతో ఊగిపోయేలా చేసింది. ఆమె చనిపోయింది.. అయినా పర్లేదు, ఆమె ఒక సామాన్య వ్యక్తే.. ఒక 11 వేల డాలర్ల చెక్కు రాసిస్తే సరిపోతుంది అంటూ అధికారి నవ్వుతూ అన్న మాటలు.. ప్రతీ ఒక్కరికి కోపం తెప్పించాయ్. అమెరికా బలుపుకు సాక్ష్యం ఇదే అనే అభిప్రాయాలు వినిపించాయ్. జాహ్నవి మరణంపై భారత్‌తోపాటు అమెరికాలోనూ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయ్. భారత ప్రభుత్వం ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ దృష్టికి తీసుకెళ్లి.. అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో అమెరికా పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకొని విచారణ జరిపారు.
ఈ ప్రాసెస్‌లో దారుణమైన విషయాలు వెలుగులోకి వచ్చాయ్. ప్రమాదం జరిగిన ప్రాంతంలో వాహనాల గరిష్ట వేగ పరిమితి గంటకు 40 కిలోమీటర్లు మాత్రమే. ఆ పోలీసు అధికారి కెవిన్ ఏకంగా 119 కిలోమీటర్ల వేగంతో వాహనాన్ని నడిపినట్లు తేలింది. దీంతో ఈ దారుణానికి బాధ్యుడైన కెవిన్‌ను విధుల నుంచి తొలగించారు. ఈ క్రమంలోనే జాహ్నవి కుటుంబం న్యాయ పోరాటం చేయగా.. విచారణ ఎదుర్కోవడం కంటే భారీ పరిహారం చెల్లించి రాజీ పడటమే ఉత్తమమని సియాటెల్ నగర యంత్రాంగం భావించింది. ఐతే ఇప్పుడు జాహ్నవి పరిహారం ప్రకటించిన తర్వాత కొత్త ప్రశ్నలు తెరమీదకు వస్తున్నాయ్. ఈ 262 కోట్లు ఒక ప్రాణానికి వెలనా? లేక ఒక అగ్రరాజ్యం తన అపరాధ భావాన్ని కప్పిపుచ్చుకోవడానికి విసిరిన డాలర్ల ముక్కలా అనే చర్చ జరుగుతోంది. ఒక ఆసియా మహిళ, అదీ ఒక వలస విద్యార్థిని ప్రాణం అంటే అక్కడి అధికారులకు ఎంత చులకన భావం ఉందో.. ఆ బాడీ క్యామ్ వీడియో నిరూపించింది.
ప్రమాదం జరిగిన తర్వాత పోలీసు నుంచి వచ్చిన మాటలు.. కేవలం ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్య కాదు, ఆ వ్యవస్థలో నూరిపోయబడిన భావజాలం. సియాటెల్ సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్ ప్రకటించిన 29 మిలియన్ డాలర్ల పరిహారం.. అమెరికా చరిత్రలోనే ఒక పౌర హక్కుల ఉల్లంఘన కేసులో అతిపెద్ద సెటిల్మెంట్లలో ఒకటి. పరిహారం చెల్లించడం ద్వారా.. సియాటెల్ నగరం తన బాధ్యత నుంచి తప్పుకుంది. ఐతే ఆ ప్రాణం తీసిన అధికారికి పడ్డ శిక్ష ఏంటి.. కేవలం విధుల్లో నుంచి తొలగించడమేనా.. ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్న వ్యక్తికి జైలు శిక్ష పడకపోవడం అమెరికా న్యాయవ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.
అమెరికాలో విదేశీ విద్యార్థులపై దాడులు, పోలీసుల మితిమీరిన ప్రవర్తన కొత్తేమీ కాదు. 2015లో సురేష్ భాయ్ పటేల్ మీద దాడి జరిగితే.. 2017లో శ్రీనివాస్ కూచిభొట్లను ఓ జాత్యాహంకారి కాల్చి చంపేశాడు. జాహ్నవి కేసులో కూడా అదే వివక్ష కనిపిస్తోంది. ఆమె మరణాన్ని పరిహారంతో సరిపెట్టవచ్చనే ఆలోచన.. ఆ జాత్యహంకార మూలాల నుంచే వచ్చినట్లే కనిపిస్తోంది. 262 కోట్లు.. వినడానికి చాలా పెద్ద మొత్తం. ఐతే జాహ్నవి మరణం వృధా కాకూడదు. ఈ 262 కోట్ల పరిహారం భవిష్యత్తులో ఏ అధికారి అయినా నిర్లక్ష్యంగా వాహనం నడపాలన్నా, లేదా ఒక మనిషి ప్రాణం గురించి చులకనగా మాట్లాడాలన్నా వణికేలా చేసే ఒక హెచ్చరికగా మిగలాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.