పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలుపు తర్వాత బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు సరిహద్దులు దాటి స్వదేశానికి పారిపోతున్నారా? బీజేపీ ప్రభుత్వం తమను మెడబట్టి గెంటేస్తోందన్న ఆందోళన వారితో పాటు బంగ్లా పాలకులనూ ఉక్కిరిబిక్కిరి చేస్తోందా? ప్రస్తుత పరిణామాలు ఔననే అంటున్నాయి. సరిహద్దుల్లో పెద్దఎత్తున బంగ్లాదేశీ అక్రమ వలసదారులు కనిపిస్తున్నారు. ఇదే విషయమై ఢిల్లీ, ఢాకా మధ్య మాటల మంటలూ మొదలయ్యాయి. ఈ పరిణామాలే భారత్-బంగ్లా మధ్య మరో దౌత్య వివాదం ఖాయమంటున్నాయి. ఆ వివరాలు టాప్ స్టోరీలో చూద్దాం..
.బెంగాల్లో బీజేపీ గెలుపు తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోనే ఇది. కానీ, ఈ వీడియో పాతది. అయితే, త్వరలో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఇలాంటి పరిస్థితులే వచ్చే అవకాశం ఉంది.
ఈ నిజం తారిఖ్ సర్కార్‌కు కూడా తెలుసు. అందుకే బెంగాల్లో బీజేపీ ఘన విజయం సాధించిన తర్వాత నోరు పారేసుకుంది. బంగ్లాదేశ్ హోం మంత్రి సలావుద్దీన్ అహ్మద్ అక్రమ వలసల విషయంపై స్పందిస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్ నుండి అనుమానిత వలసదారులని బలవంతంగా వెనక్కి పంపే చర్యలు జరగవని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఒకవేళ భారత్ అటువంటి ప్రయత్నం చేస్తే, దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని బెదిరింపులకు దిగాడు. సరిహద్దుల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటానికి బార్డర్ గార్డ్ బంగ్లాదేశ్‌ను హై అలర్ట్‌లో ఉంచినట్లు పేర్కొన్నాడు. ఆ తర్వాతే భారత్ రంగంలోకి దిగింది.
అక్రమ వలసలపై ఢాకాకు ఫుల్ క్లారిటీ ఇచ్చింది.బంగ్లాదేశ్ వాడుతున్న 'పుష్ బ్యాక్' అంటే బలవంతంగా తోసేయడం అనే పదాన్ని భారత్ ఖండిస్తోంది. "మేము ఎవరినీ బలవంతంగా తోసేయడం లేదు. ఇది అక్రమంగా వచ్చిన వారిని చట్ట బద్ధంగా వారి సొంత దేశానికి పంపించే ప్రక్రియ. దీనికి మీ సహకారం కావాలి అని రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ఒక వ్యక్తిని బంగ్లాదేశ్‌కు పంపాలంటే, ఆ వ్యక్తి తమ దేశస్థుడేనని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఒప్పుకోవాలి. సుమారు 2వేల 860 మంది బంగ్లాదేశీయులు పట్టుబడ్డారు. వీరు తమ దేశస్థులేనని ధృవీకరించమని భారత్ ఎప్పటి నుంచో అడుగుతోంది. బంగ్లాదేశ్ ఈ ధృవీకరణను ఐదేళ్లుగా ఆలస్యం చేస్తోంది. వారు ధృవీకరించకపోతే భారత్ వారిని అధికారికంగా పంపలేదు. ఈ క్రమంలోనే త్వరగా ఢాకా ఆ పనిలో ఉండాలనీ, లేకపోతే ఎలా ముందుకెళ్లాలో తమకు తెలుసని రణ్‌ధీర్ జైస్వాల్ స్పష్టంచేశారు. దీనర్థం అక్రమ వలసదారుల విషయంలో ఢాకా సహకరించకపోతే నిజంగానే మెడబట్టి గెంటేయాల్సి వస్తుందని హెచ్చరించడమే.
బంగ్లాదేశీ అక్రమవలసదారుల గురించి భారత్ దగ్గరున్న 2వేల 860 మంది అన్న లెక్క చాలా చిన్నది. వీరంత పట్టుబడినవారు, పట్టుబడని వారి సంఖ్య లక్షల్లో ఉంటుందని బీజేపీ నేతలు ఎప్పటి నుండో ఆరోపిస్తున్నారు. అందుకు తగ్గట్టే గతేడాది బెంగాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ స్టార్ట్ అయిన తర్వాత పెద్ద ఎత్తున బంగ్లాదేశీ పౌరులు సరిహద్దులు దాటేందుకు ప్రయత్నించారు. S.I.Rలో దొరికిపోతే తమను అరెస్టు చేసి డిటెన్షన్ కేంద్రాల్లో పెడతారనీ, తమ జీవితాలను పూర్తిగా ప్రమాదంలో పడేసుకోవడం కన్నా స్వదేశానికి వెళ్లిపోవడమే మంచిదని భావిస్తున్నట్లు వలస దారులు చెప్పారు. అక్రమంగా వలస వచ్చినవారిలో చాలా మంది కోల్‌కతా, బిరాటీ, ఘుసురీతో పాటు చాలా ప్రాంతాల్లో రిక్షా నడుపుకోవడం నుంచి, షాప్స్, హోటళ్లు, ఇళ్లలో పనిచేయడం వంటి అనేక పనుల్లో కుదిరారు.
వీరిలో పదేళ్లకుపైగా భారత్‌లో నివసించిన వారు కూడా ఉన్నారు. ఔట్‌పోస్ట్ నుంచి రోజూ 150 నుంచి 200 మంది బంగ్లాకు తరలిపోయినట్లు అప్పట్లో బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. సో.. వారందరినీ ఏరివేయాల్సిన సమయం వచ్చింది.నిజానికి.. బంగ్లాదేశ్ భయం కూడా అదే. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వేళ భారత్ నుంచి ఒకేసారి పెద్ద ఎత్తున ప్రజలు స్వదేశానికి వస్తే ఢాకా మరిన్ని చిక్కుల్లో పడే అవకాశం ఉంది. ఆ ముప్పు రావొద్దనే ఈ విషయంలో భారత్‌తో కయ్యానికి దిగే ప్రయత్నం చేస్తోంది. ఈ విషయంలో ఢాకా సహకరించకపోతే భారత్-బంగ్లాదేశ్ మధ్య దౌత్య వివాదాలు ముదిరే అవకాశాలు లేకపోలేదు. ఏదేమైనా అక్రమ వలసల విషయంలో భారత్ కూడా వెనక్కి తగ్గదు. సో.. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో అసలు సిసలు ఆట ఇప్పుడే మొదలైందనుకోవచ్చు.