పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ఘన విజయం సాధించింది. 15 ఏళ్లపాటు ఏకఛత్రాధిపత్యంగా పాలించిన మమతా బెనర్ ఓటమి పాలయ్యారు. కాషాయ పార్టీ విజయానికి దోహదపడిన కారణాలు ఏంటి ? ప్రజల్లోకి ఏ యే అంశాలను తీసుకెళ్లింది ? తృణమూల్ కాంగ్రెస్ చేసిన తప్పులేంటి ? వాటిని బీజేపీ ఎలా సానుకూలంగా మలుచుకుంది. బీజేపీ గెలుపునకు పని చేసిన పది కారణాలు ఇవే.ఈ ఎన్నికల ప్రచార సమయంలో అక్రమ వలసదారులను దేశం నుంచి తరిమేస్తామని బీజేపీ స్పష్టంగా పేర్కొంది. అంతేకాదు మమత సర్కార్ అక్రమ వలసదారులకు అండగా నిలుస్తోందని ఆరోపించింది. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులు స్థానిక ప్రజల జీవనోపాధిని తీవ్రంగా దెబ్బతీస్తున్నారని పేర్కొంది. దీనికి బలం చేకూరుస్తూ ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ చేపట్టి సుమారు 89 లక్షల మంది పేర్లను ఓటర్ జాబితా నుంచి తొలగించింది. ఇందులో ఎక్కువ మంది టీఎంసీ మద్దతుదారులే. అందులోనూ ముస్లిం ఓట్లు 75 లక్షలు ఉన్నాయి. ఇది కూడా టీఎంసీకి గట్టి ఎదురుదెబ్బేనని చెప్పకతప్పదు. ఈ విధంగా పలు కారణాలు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీని తీవ్రంగా దెబ్బతీశాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
1. ప్రజా వ్యతిరేకత
మమతా బెనర్జీ 15 ఏళ్లపాటు బెంగాల్‌ను పరిపాలించారు. సుదీర్ఘ పాలన చేసే ఏ రాజకీయ పార్టీకైనా సహజంగా కొంత మేర ప్రజావ్యతిరేకత రావడం సహజం. కానీ ఈసారి తీవ్ర అసంతృప్తి నెలకొంది. 15 ఏళ్ల క్రితం మమత మా, మాటి, మనుష్ అనే నినాదంతో టీఎంసీని గెలిపించారు. వరుసగా మూడు సార్లు ఆమె బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడానికి ఈ నినాదమే మూలస్తంభంగా నిలిచింది. కానీ ఈసారి పరిస్థితి మొత్తం తారుమారు అయ్యింది. నిరుద్యోగం, స్థానిక నేతలపై ఆరోపణలు ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి కారణమయ్యాయి. పైగా కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐలు నిరంతరం టీఎంసీ నేతలపై దాడులు చేశాయి. దీనిని అవినీతిపై పోరాటంగా వర్ణిస్తూ బీజేపీ ఓటర్లను ఆకర్షించింది.
1. అవినీతి కుంభకోణాలపై విసుగు
ఇక మమత హయాంలో అనే అవినీతి ఆరోపణలు టీఎంసీ పార్టీ ప్రతిష్టను దెబ్బతీశాయి. ముఖ్యంగా ఉపాధ్యాయుల నియామకంలో జరిగిన అక్రమాలు ఆ పార్టీని ఇరకాటంలో పడేశాయి. మాజీ మంత్రి పార్థ ఛటర్జీ అనుచరుల ఇళ్లలో కోట్లాది రూపాయలు దొరకడం, ఆ విజువల్స్ నెట్టింట వైరల్ కావడంతో పార్టీకి నష్టం జరిగింది. శారద, నారద లాంటి పాత కుంభకోణాల గురించి కూడా విపక్షాలు ప్రస్తావిస్తూ టీఎంసీ అవినీతిలో కూరుకుపోయిందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాయి. ఇవన్నీ మమత సర్కార్‌ను తీవ్రంగా దెబ్బతీశాయని చెప్పకతప్పదు.
1. ఇంటింటా ఆర్ఎస్‌ఎస్ ప్రచారం
హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో అనుసరించిన ఫార్మూలానే...బెంగాల్‌లోనూ అమలు చేసింది బీజేపీ. ఆర్‌ఎస్‌ఎస్ కేడర్‌ను ఎన్నికలకు కొన్ని నెలల ముందే రంగంలోకి దించింది. బెంగాల్‌లోని ప్రతి ఇంటికి వెళ్లి...టీఎంసీ అవినీతి అక్రమాలను ఎలుగెత్తి ప్రజలకు చెప్పారు. అభివృద్ది, సంక్షేమ పథకాలను వివరించారు. వారికి భరోసా కల్పించారు. అంతేకాకుండా వాస్తవానికి బంగాల్లో టీఎంసీకి క్షేత్రస్థాయిలో బలమైన యంత్రాంగం, వీరవిధేయులైన కార్యకర్తలు ఉన్నారు. దీనిని ఓవర్ టేక్ చేస్తూ, ఈసారి బీజేపీ తన శాయశక్తులా బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తన కార్యకర్తలను ఇంటిఇంటికీ వెళ్లి ప్రచారం చేసేలా చేసింది. పైగా బీజేపీకి డిజిటల్ ప్రచారం కూడా బాగా కలిసొచ్చింది. ఇవన్నీ మమతా బెనర్జీకి నష్టం కలిగించాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
హిందూ ఓటర్లు
హిందువులను ఏకం చేయడంలో బీజేపీ సక్సెస్ అయింది. రాష్ట్ర జనాభాలో 17 శాతంగా ఉన్న షెడ్యూల్ కుల సమూహం మతువా. వీరిని ఆకట్టుకునేందుకు బీజేపీ ప్రత్యేక ప్రణాళిక వేసి, అనేక తాయిళాలు ప్రకటించింది. ప్రతిపక్ష కాంగ్రెస్ ఓటు బ్యాంక్‌తో పాటు వామపక్షాల ఓట్లు బీజేపీకి మళ్లాయి. వీరి మద్దతు బీజేపీ విజయానికి ప్రధాన కారణమైంది.
1. ఆర్జీ ఆసుపత్రి అత్యాచార ఘటన
ఆర్జీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ అత్యాచార ఘటనను బీజేపీ అనుకూలంగా మలచుకుంది. తృణమూల్ కాంగ్రెస్ పాలనలో మహిళలు, అమ్మాయిలకు రక్షణ లేదంటూ ప్రచారం చేసింది. అంతేకాకుండా
పానిహాటి నియోజకవర్గం నుంచి ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ఘటనలో బాధితురాలి తల్లి రత్నా దేవ్నాథ్ బరిలోకి దించింది. ఆమె కోసం ప్రచారం చేసి...ఎన్నికల్లో గెలిపించుకుంది బీజేపీ. ఇప్పటివరకు రాజకీయాలకు దూరంగా ఉన్న రత్నా దేవ్నాథ్, తన వ్యక్తిగత విషాదాన్ని ప్రజా ఉద్యమంగా మలుచుకుని ఎన్నికల రంగంలోకి దిగడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
1. ఇండి కూటమి కలవకపోవడం
ఇండియా కూటమి నేతలు కలిసి పోటీ చేయకపోవడం బీజేపీ కలిసి వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో జట్టు కట్టిన కాంగ్రెస్, టీఎంసీ, వామపక్ష పార్టీలు...అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం విడివిడిగా పోటీ చేసుకున్నారు. ఎన్నికల ప్రచారంలోనూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. జనం వీళ్లను చూసి నవ్వుకున్నారు. దీంతో ఓటర్లకు ఈ మూడు పార్టీలను కాదని బీజేపీ వైపు మళ్లారు. కాంగ్రెస్, టీఎంసీ, వామపక్షాలు కలిసి పోటీ చేసి ఉంటే...ఎన్నికలు మరోలా ఉండేవి. ఫైనల్ మూడు పార్టీల పుట్టి మునిగింది.
1. నార్త్ బెంగాలో పట్టు, ముస్లింల ఓట్లు
తనకు పట్టు ఉన్న నార్త్ బెంగాల్‌లో మరోసారి తనకు తిరుగులేదని నిరూపించుకుంది. అంతేకాకుండా బెంగాల్‌లో ముస్లిం జనాభా దాదాపు 27 శాతం మేర ఉంది. రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి రావాలో నిర్ణయించడంలో వీరిదే కీలక పాత్రగా ఉంది. ఇంతకు ముందు టీఎంసీ ఈ ముస్లిం సమాజం అధికంగా ఉన్న ప్రాంతాల్లో 75 స్థానాలను గెలుచుకుంది. కానీ ఈసారి సీన్ పూర్తిగా మారిపోయింది. రాజకీయంగా కీలకమైన మాల్దా, ముర్షిదాబాద్, ఉత్తర దినాజ్‌పుర్ జిల్లాల్లో స్పష్టంగా మార్పు కనిపించింది. ఈ ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుపడడం, ఓటర్ల జాబితాలో సమస్యలు, పాలనపై ఆందోళనలు పెరిగాయి. దీనిని అవకాశంగా తీసుకున్న కాంగ్రెస్ అక్కడ బలపడింది. పైగా ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) కూడా ఓట్లను చీల్చే శక్తివంతమైన పార్టీగా ఎదిగింది. ఇవన్నీ ఈ ఎన్నికల్లో టీఎంసీని తీవ్రంగా దెబ్బతీశాయి.
1. బెంగాల్ బోర్డర్ లో ఆందోళన
అధికారంలోకి వచ్చిన వెంటనే బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలు నివారించడానికి కంచె నిర్మిస్తామని హోం మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. అక్రమ వలసల వళ్లే స్థానికులు అన్యాయం జరుగుతోందని, గూండాయిజం పెరుగుతోందని ప్రజల్లోకి తీసుకెళ్లారు బీజేపీ నేతలు. శాంతిభద్రత, సరిహద్దుల రక్షణ విషయంలో తనదైన శైలిలో ప్రచారం చేశారు అమిత్ షా. పార్టీ అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోనే 100% కంచె నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటించారు.
1. ప్రత్యేక బలగాలతో అక్రమాలకు చెక్
పశ్చిమ బెంగాల్ పోలింగ్‌లో అక్రమాలు జరగకుండా ఈసీ పకడ్బందీగా వ్యవహరించింది. రెండున్నర లక్షలకుపైగా సీఏపీఎఫ్ బలంగాలను రంగంలోకి దించింది. అంతేకాకుండా ఉత్తర ప్రదేశ్ నుంచి కొందర్ని ప్రత్యేక అధికారులుగా నియమించింది. అజయ్ పాల్ శర్మ లాంటి అధికారులు రెచ్చిపోయి పని చేయడమే కాదు...ఏకంగా అభ్యర్థుల ఇళ్లకు వెళ్లి వార్నింగ్‌లు ఇచ్చారు. ప్రజలు స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. టీఎంసీ అరాచకాలు చేయకుండా ప్రత్యేక అధికారులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.