Top story: 17 ఏళ్ల నిశ్శబ్ధ పోరాటం… విజయ్‌ పొలిటికల్‌ జర్నీలో ఇన్ని కష్టాలు పడ్డాడా… ?

దశాబ్దాల కాలంగా సాగుతున్న ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి తమిళనాడు ఓటర్లు చరమగీతం పాడారు. వెండితెరపై 'దళపతి'గా కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న విజయ్, ఇప్పుడు రాజకీయ యవనికపై 'జననాయకుడి'గా అవతరించారు.

Post Published By: dialnews
Updated : 6 May 2026, 1:06 PM IST

దశాబ్దాల కాలంగా సాగుతున్న ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి తమిళనాడు ఓటర్లు చరమగీతం పాడారు. వెండితెరపై 'దళపతి'గా కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న విజయ్, ఇప్పుడు రాజకీయ యవనికపై 'జననాయకుడి'గా అవతరించారు. కొత్తగా స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీతో తొలి ప్రయత్నంలోనే అద్భుత విజయాన్ని అందుకుని, ముఖ్యమంత్రి పీఠానికి చేరువయ్యారు. 1977లో ఎం.జి. రామచంద్రన్ సృష్టించిన చరిత్రను విజయ్ మళ్ళీ పునరావృతం చేస్తూ తమిళ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు.విజయ్ విజయం రాత్రికి రాత్రే వచ్చింది కాదు. దీనికి పునాది 17 ఏళ్ల క్రితమే పడింది. 2009లో స్థాపించిన 'విజయ్ మక్కల్ ఇయక్కం' అనే సేవా సంస్థ ద్వారా విజయ్ క్షేత్రస్థాయిలో బలమైన కేడర్‌ను నిర్మించుకున్నారు. చదువు, ఆరోగ్యం, ఆకలి తీర్చడం వంటి సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువయ్యారు. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు ఓటుకు నోటు పంచాయనే ఆరోపణలు వెల్లువెత్తిన వేళ, విజయ్ మాత్రం తన 'విజన్'ను నమ్ముకున్నారు. డబ్బు ప్రభావం లేకుండా కేవలం ఆత్మీయతతో, ఇంటింటి ప్రచారంతో టీవీకే అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకున్నారు. ఇతర పార్టీలు ఉచిత పథకాల హామీలతో హోరెత్తించగా, విజయ్ మాత్రం విద్య, ఉపాధి, అవినీతి రహిత పాలనపై హామీ ఇచ్చి యువతను, మహిళలను తనవైపు తిప్పుకున్నారు.

ఈ ఎన్నికల్లో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, డీఎంకే అగ్రనేతలు కూడా టీవీకే దెబ్బకు తలవంచాల్సి వచ్చింది. కోలత్తూర్ నియోజకవర్గం నుండి పోటీ చేసిన ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, టీవీకే అభ్యర్థి బి.ఎస్. బాబు చేతిలో 8 వేల 795 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇది తమిళ రాజకీయాల్లో ఒక పెద్ద కుదుపు. దీంతో పాటు చాలా మంది సామాన్యులు విజయ్‌ పార్టీ నుంచి MLA లుగా గెలిచారు. రాయపురం నియోజకవర్గంలో ఒక ఆటో డ్రైవర్ విజయ్ దాము, డీఎంకే దిగ్గజం అబుజర్ ఖాన్‌పై 14 వేల ఓట్ల మెజారిటీతో గెలిచాడు. తన కారు డ్రైవర్‌ కొడుకు శబరీనాథన్‌ను కూడా ఓ స్థానం నుంచి నిలబెట్టి ఎమ్మెల్యేగా గెలిపించాడు విజయ్‌. తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే ఏకంగా 108 స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118కి కేవలం 10 స్థానాల దూరంలో నిలిచింది. మరోవైపు, అధికారంలో ఉన్న DMK కేవలం 59 స్థానాలకే పరిమితమై ప్రతిపక్ష హోదాకు పడిపోయింది. అన్నాడీఎంకే 47 స్థానాలతో మూడవ స్థానానికి పడిపోగా, కాంగ్రెస్ 5, బీజేపీ 1 స్థానంలో మాత్రమే విజయం సాధించాయి. మిగిలిన స్థానాల్లో స్వతంత్రులు, ఇతర చిన్న పార్టీలు విజయం సాధించాయి.

ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ టీవీకే గెలవడానికి ప్రధాన కారణం 'నిశ్శబ్ద విప్లవం'. గతంలో ఎంజీఆర్, జయలలితలకు అండగా నిలిచిన మహిళా ఓటర్లు ఈసారి విజయ్‌కు బ్రహ్మరథం పట్టారు. అలాగే తొలిసారి ఓటు వేసిన యువత 85.15 శాతం మంది టీవీకేకే మొగ్గు చూపారు. డీఎంకే హయాంలో జరిగిన అవినీతి, శాంతిభద్రతల సమస్యలు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను నింపాయి.ఆ అసంతృప్తి విజయ్‌కి ప్లస్‌ అయ్యింది. ఈ గెలుపుతో ఎంజీఆర్, ఎన్టీఆర్ సరసన విజయ్ నిలిచారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దశాబ్దాల ద్రవిడ రాజకీయాలకు బ్రేక్ వేసి, ఒక సామాన్యుడిని సీఎం పీఠంపై కూర్చోబెట్టిన తమిళ ఓటరు తీర్పు భారత రాజకీయాల్లోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. 'జననాయకుడు'గా విజయ్ ఇకపై తమిళనాట ఎలాంటి మార్పులు తీసుకువస్తారోనని దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

 

Published : 
  • 6 May 2026, 1:06 PM IST