ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు కేంద్రం పాత్ర ఎక్కువ. కేంద్రంలో ఉన్న బిజెపికి రాష్ట్రంలో ఉన్న టిడిపి, జనసేన సంపూర్ణ మద్దతు ఇస్తుండగా.. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి నుంచి కూడా అదే స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు లభిస్తుంది. దీనితో ఏ విధంగా చూసుకున్నా ఏపీ ప్రభుత్వం కంఫర్ట్ జోన్ లోనే ఉంది. ఇప్పుడు ఇదే వైసీపీని ఇబ్బంది పెడుతున్న విషయం. రాజకీయంగా.. వైసీపీ బలపడాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి టిడిపి, జనసేన దూరం కావాలి. 2019లో వైసీపీ అధికారంలోకి రావడానికి ఇదే సహకరించిన విషయం. కానీ 2019 తర్వాత జనసేన ద్వారా టిడిపి బిజెపికి దగ్గర అయింది. ఇక అక్కడి నుంచి వైయస్ జగన్ కు కష్టాలు మొదలయ్యాయి.
2024 నుంచి జగన్ రాష్ట్రంలో స్వేచ్ఛగా రాజకీయం చేయలేకపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి నాయకత్వం నుంచి కూడా, సహకారం లేక వైసిపి అధిష్టానం ఇబ్బంది పడుతోంది. క్షేత్రస్థాయిలో కేసులు నాయకులను మరింత కంగారు పెడుతున్నాయి. గట్టిగా మాట్లాడిన వారిపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. చార్జిషీట్ తో సహా కేసుల విచారణ పూర్తవుతుంది. అందుకే చాలామంది తమకు ఇబ్బందులు వద్దనే ఉద్దేశంతో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో కల్తీ లడ్డు వ్యవహారంతో పాటుగా, పలు అంశాలు వైసీపీని ఇబ్బంది పెట్టాయి. వైసీపీ సోషల్ మీడియా కూడా స్వేచ్ఛగా పోరాడలేని పరిస్థితి కనపడుతుంది.
అందుకే ఇప్పుడు కేంద్రం మద్దతు కోసం జగన్ మళ్ళీ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు ఏపీ రాజకీయ వర్గాలు అంటున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలను కేంద్రానికి ఫిర్యాదు చేసే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు. 2019కి ముందు విజయసాయిరెడ్డి రూపంలో ఢిల్లీలో జగన్ కు మద్దతు ఎక్కువగా ఉండేది. కానీ విజయసాయిరెడ్డి.. జగన్మోహన్ రెడ్డికి దూరమైన తర్వాత.. ఢిల్లీ స్థాయిలో జగన్ రాజకీయాలకు సహకారం అందించే నాధుడు కనపడటం లేదు. వైసిపి ఎంపీ మిధున్ రెడ్డి ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేసినా.. అది తనను.. తన తండ్రిని కాపాడుకోవడానికి మాత్రమే వాడుతున్నారు.
వై వి సుబ్బారెడ్డి సహా పలువురికి ఢిల్లీ రాజకీయాలపై అవగాహన తక్కువ. భాషతో కూడా వైసిపి నేతలకు కొన్ని సమస్యలు ఉన్నాయి. అవినాష్ రెడ్డి ఉన్నప్పటికీ లాబీయింగ్ చేసే పరిస్థితి లేదు. అందుకే ఇప్పుడు నేరుగా ఢిల్లీ వెళ్ళేందుకు జగన్ రంగంలోకి దిగుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. కల్తీ లడ్డు వ్యవహారం పై పరిణామాలు, కొన్ని పరిశ్రమలకు భూ కేటాయింపులు, వైసీపీ నేతలు పై నమోదు చేస్తున్న కేసులు, అమరావతి రైతుల అంశం సహా, పలు అంశాలపై కేంద్రానికి ఫిర్యాదు చేసే ఆలోచనలో జగన్ ఉన్నట్లు సమాచారం. ఇదే సమయంలో రాష్ట్రపతిని కూడా కలిసి ఫిర్యాదు చేసేందుకు.. జగన్ రెడీ అవుతున్నట్లు వైసిపి వర్గాలు అంటున్నాయి.
ఏదో ఒక రూపంలో బిజెపికి దగ్గర కాకపోతే తన రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బందికర పరిణామాలు ఉంటాయనే ఆందోళన జగన్ లో ఎక్కువగా ఉంది. అందుకే ఇప్పుడు తనకున్న మార్గాల ద్వారా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు జగన్. కూటమి నుంచి ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేసే నాయకత్వం బలంగా ఉంది. సుజనా చౌదరి, సీఎం రమేష్, సానా సతీష్ బాబు, సహా పలువురు నేతలు ఢిల్లీలో కూటమి తరఫున అండగా నిలబడే పరిస్థితి ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కూడా అటువంటి నాయకత్వం ఢిల్లీలో అవసరం. ఆ నాయకత్వాన్ని తయారు చేసుకునే విషయంలో జగన్ ముందు నుంచి విఫలమవుతూనే ఉన్నారు. విజయసాయిరెడ్డి రూపంలో జగన్మోహన్ రెడ్డికి అండగా నమ్మకమైన నాయకత్వం హస్తినలో ఉన్నప్పటికీ.. ఊహించని పరిణామాలతో ఆయన రాజకీయాలకు, పార్టీకి గుడ్ బై చెప్పారు.
వైసీపీ తరఫున ఢిల్లీలో లాబీయింగ్ చేసేందుకు కూడా విజయసాయిరెడ్డి ముందుకు రాని పరిస్థితి. తనని తాను కాపాడుకోవడమే విజయ్ సాయి రెడ్డికి ప్రధానంగా ఉన్న ప్రాధాన్యత. ఇలాంటి సమయంలో జగన్ రంగంలోకి దిగకపోతే పార్టీ మరిన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. న్యాయపరంగా కూడా పార్టీ నేతలకు వైసీపీ పూర్తిస్థాయిలో.. మద్దతు ఇవ్వలేకపోతుందనే మాట కూడా వినపడుతోంది. అందుకే ఇప్పుడు నేరుగా కేంద్ర హోం మంత్రిని కలిసి పరిస్థితిని వివరించాలని.. ఏదో ఒక రూపంలో కేంద్రానికి దగ్గర కావాలని జగన్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అవసరమైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా కలిసేందుకు జగన్ వెనకడుగు వేయడం లేదని సమాచారం.