ఇజ్రాయిల్, అమెరికా వర్సెస్ ఇరాన్ గా సాగుతున్న మధ్యప్రాచ్య యుద్దంలో తీవ్ర పరిణామాలు కనపడుతున్నాయి. సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీని అమెరికా - ఇజ్రాయెల్ టార్గెట్ చేసి లేపేయడంతో ఇప్పుడు ఇరాన్ లో మిడిల్ ఈస్ట్ లో వాతావరణం ఆందోళన కలిగిస్తోంది. ఫిబ్రవరి 28 ఉదయం అమెరికా, ఇజ్రాయెల్ దళాలు సమన్వయంతో దాడులు ప్రారంభించాయి. "ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ" అని అమెరికా.. "రోరింగ్ లయన్" అని ఇజ్రాయిల్ పిలుస్తూ ఇరాన్ పై దాడులకు దిగాయి.
ఇరాన్ నాయకత్వం, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. అయితే, ఆయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత కూడా, ఇరాన్ లొంగిపోయే సంకేతాలు ఇవ్వలేదు. ప్రతిదాడులు చేసే విషయంలో ఇరాన్ ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. గల్ఫ్ దేశాలను టార్గెట్ చేస్తూ చుక్కలు చూపిస్తోంది. బహ్రెయిన్, టర్కీ, కువైట్, దుబాయ్, అబుదాబి వంటి దేశాలపై ఇరాన్ దాడులకు దిగింది. దుబాయ్ లోని ఆయిల్ రిఫైనరీలను టార్గెట్ చేసి ఇరాన్ దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో అమెరికా కూడా తీవ్రంగా నష్టపోయిందనే సంకేతాలు వస్తున్నాయి.
ఇక ఇప్పుడు ఇరాన్ తమ వ్యూహం మార్చింది. అమెరికా.. ఇజ్రాయిల్ ఏ రేంజ్ లో అటాక్ చేసినా తలవంచకుండా.. తమ సత్తా ఏంటో చూపిస్తున్న ఇరాన్.. ఇజ్రాయెల్, అమెరికాకు మద్దతు ఇచ్చే దేశాల ప్రజలను టార్గెట్ చేస్తూ దాడులకు దిగింది. బహ్రెయిన్, అబుదాబీ, దుబాయ్, షార్జా, ఖతార్, కువైట్‌లో ఉన్న ఇరానేతరుల నివాసాలే టార్గెట్‌గా ఇరాన్ దాడులు చేయడం మొదలుపెట్టింది. దీనితో హై-రైజ్డ్ బిల్డింగ్స్, అపార్ట్‌మెంట్స్ ఖాళీ చేసి జనం పారిపోతున్నారు. బహ్రెయిన్, ఖతార్, దుబాయ్‌లలో ట్రాన్సిట్ వీసా ద్వారా ప్రయాణిస్తూ చిక్కుకుపోయిన వారి పరిస్థితి కూడా దారుణంగా మారింది.
పరిస్థితి తీవ్రమవుతున్నా సరే.. ఇరాన్ కీలక ప్రకటనలు చేస్తూనే ఉంది. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ మాట్లాడుతూ, ఇజ్రాయెల్, అమెరికా దాడులకు ప్రతీకారం తీర్చుకోవడం తమ చట్టబద్ధమైన హక్కు, విధిగా భావిస్తున్నట్లు తెలిపారు. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని చంపడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. చాలా ప్రమాదకరమైన రెడ్ లైన్ దాటారని హెచ్చరించారు. అమెరికా మరియు ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడులలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) అగ్ర కమాండర్లు, ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అబ్దుల్ రహీమ్ మౌసావి మరియు రక్షణ మంత్రి అజీజ్ నాసిర్జాదే మరణించారు, అంతేకాకుండా అనుమానిత అణు కేంద్రాలపై కూడా దాడి జరిగినట్లు సమాచారం.
ఇజ్రాయెల్, అమెరికా రెండింటికీ కఠినమైన శిక్ష విధిస్తామని ఇరాన్ ప్రతిజ్ఞ చేసింది. ఇజ్రాయెల్ నగరాలు, గల్ఫ్ ప్రాంతంలోని 14 అమెరికా స్థావరాలపై క్షిపణి దాడులకు దిగింది ఇరాన్. ఇరాన్‌పై ఒత్తిడి తీసుకురావడానికి, దాని ఆర్థిక వ్యవస్థను కుంగదీయడానికి.. అంతర్జాతీయంగా ఇరాన్ ను ఒంటరి చేసేందుకు అమెరికా చాలా కాలంగా ఆంక్షలు, రహస్య కార్యకలాపాలు, పరిమిత దాడులు కూడా చేస్తూ వచ్చినా.. ఇరాన్ మాత్రం తలవంచడం లేదు. ఇక ఇప్పుడు ఏకంగా అమెరికాకు సహకరించే దేశాల ప్రజలను కూడా టార్గెట్ చేసింది. తాము చర్చలు జరిపే ప్రశ్నే లేదని, యుద్ధం చేస్తామని ఇరాన్ అధ్యక్షుడు స్పష్టం చేసాడు.