Top story:వంట గదిలో ఇరాన్ యుద్ధం… వంట గ్యాస్ కొరత, హోటల్స్ బంద్, 25 రోజుల తర్వాతే సిలెండర్…!

ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఇండియన్ కిచెన్ మీద పడింది. అనుకున్నట్టుగానే ఎల్‌పీజీ గ్యాస్ చైన్‌ దెబ్బతిన్నది. బ్యాక్ టు బ్యాక్ సిలిండర్ బుక్ చేసుకుంటామంటే కుదరదని కేంద్రం చెప్పేసింది.

Post Published By: dialnews
Updated : 11 March 2026, 10:20 AM IST

ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఇండియన్ కిచెన్ మీద పడింది. అనుకున్నట్టుగానే ఎల్‌పీజీ గ్యాస్ చైన్‌ దెబ్బతిన్నది. బ్యాక్ టు బ్యాక్ సిలిండర్ బుక్ చేసుకుంటామంటే కుదరదని కేంద్రం చెప్పేసింది. గ్యాస్ బండ కోసం 25 రోజులు వెయిట్ చేయాల్సిందే. కమర్శియల్ సిలిండర్ల పరిస్థితి మరీ ఘోరం. సప్లయ్ లేకపోవడంతో బెంగళూరులో హోటళ్లు బంద్‌ అవుతున్నాయి. చెన్నయ్‌లో కూడా సేమ్ పరిస్థితి. హైదరాబాద్ లోను ఈ పరిస్థితి కనిపించబోతుంది. మిడిల్‌ ఈస్ట్‌ యుద్ధ ప్రభావం భారతీయుల వంటింటిపై పడింది. అంతర్జాతీయంగా చమురు సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తమైంది.

ఎల్‌పీజీ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫలితంగా దేశంలోని పలు నగరాల్లో వంటగ్యాస్ కొరత భయపెట్టిస్తోంది. గ్యాస్ రీఫిల్ బుక్ చేసిన వారు మునుపటిలా వెంటనే సిలిండర్ పొందే పరిస్థితి లేదు. సిలిండర్‌కు సిలిండర్‌కు మధ్య బుకింగ్ 25 రోజులు వెయిటింగ్ పీరియడ్ పెట్టారు. గతంలో ఇది 15 రోజులు ఉండేది. ఇప్పుడు మారింది. బుకింగ్ చేసిన తర్వాత డెలివరీ కోసం వారం పదిరోజుల వరకు వేచి ఉండాల్సి వస్తోంది. ముఖ్యంగా రెండు సిలిండర్లు ఉన్న కుటుంబాలు, స్టాక్ అయిపోతుందనే భయంతో అవుట్‌లెట్ల దగ్గర క్యూ కడుతున్నారు.

విజయవాడలో గతంకంటే 30 శాతం పైగా బుకింగ్స్ పెరిగాయి. సిలిండర్ డెలివరీకి గతంలో 2 రోజులు సమయం పట్టేది.. ఇప్పుడు వారం పైమాటే. గృహ అవసరాలకు వాడే గ్యాస్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు చెపుతున్నా, భయాందోళనల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా గ్యాస్ బండల్ని వీపరీతంగా బుక్ చేస్తున్నారు. మరోవైపు హోటళ్లు, రెస్టారెంట్ల పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. కొన్ని నగరాల్లో కమర్షియల్ సిలిండర్ల సరఫరాను నిలిపివేశారు. దాని ఎఫెక్ట్ హోటళ్లపై పడింది.

ముఖ్యంగా బెంగళూరు హోటళ్లు సంక్షోభంలో పడ్డాయి. కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్ల సరఫరా నిలిచిపోతుండడంతో అక్కడ హోటళ్లు నడిచే పరిస్థితి లేదు. అదే జరిగితే దీని ప్రభావం కొన్ని లక్షలమందిపై పడుతుంది. కొందరు బ్లాక్ మార్కెట్‌లో డొమెస్టిక్ సిలిండర్లను కొనుగోలు చేస్తున్నారు. అది చట్టవిరుద్ధమే కాకుండా అత్యంత ప్రమాదకరం. ఇక బెంగుళూరు బాటలో చెన్నై హోటల్స్‌ అసోషియేషన్.. కీలకమైన నిర్ణయం తీసుకుంది. కమర్షియల్ గ్యాస్ నిలిపివేయడంతో హోటళ్లను మూసివేయాలని అసోషియేషన్ పిలుపునిచ్చింది.

చెన్నైలో సూమారు 45 వేలకు పైనే హోటళ్లున్నాయి. వాటిలో చాలావరకు గ్యాస్ సప్లయ్ ఆగిపోయింది. ఇదే కొనసాగితే రెస్టారెంట్ పరిశ్రమ రోజుకు దాదాపు రూ. 1,200–1,300 కోట్ల నష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ సంక్షోభం చాలదన్నట్లు ధరల పెరుగుదలతో వినియోగదారుడిపై మరింత భారం పడింది. కమర్షియల్ సిలిండర్ ధర రూ.115, డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.60 చొప్పున పెరిగింది. మొత్తంగా యుద్ధం ఎటు దారితీస్తుందో, గ్యాస్ సరఫరా ఎప్పుడు ఆగుతుందో తెలియని అయోమయం నెలకొంది.

అంతర్జాతీయంగా ఎల్‌పీజీ చైన్ డిస్ట్రబ్ కావడంతో కేంద్రం రిఫైనరీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. సరఫరాకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటంకం కలగకుండా చూడాలని, ఉత్పత్తిని పెంచాలని కోరింది. గ్యాస్‌ సిలిండర్ల సరఫరాలో ముందుగా గృహ అవసరాలకే ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. ఇక గ్యాస్ కొరతను కంట్రోల్ చేయడానికి కేంద్రం ఎస్మాను కూడా ప్రయోగిస్తుంది. ప్రస్తుతం గ్యాస్ రవాణా మార్గాలపై కేంద్రం దృష్టి పెట్టింది. ఇతర రవాణా మార్గాల నుంచి 55 శాతం గ్యాస్ మన దేశానికి వస్తుంది.

ఇప్పుడు దాన్ని 70 శాతానికి పెంచామని కేంద్రం అంటుంది. ఇక ఎల్ పీ జీ సిలెండర్ లకే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి అనేది కేంద్రం మాట. అలాగే ఎరువుల కొరత రాకుండా చూడాల్సి ఉంది. అందుకే ఆయా పరిశ్రమలకు గ్యాస్ ఆగకూడదు అని కేంద్రం స్పష్టం చేసింది. అలాగే సమస్యల పరిష్కారానికి ఓ కమిటీ కూడా వేసింది. అటు హార్మోజ్ నుంచి గ్యాస్ రాకపోతే రష్యా నుంచి దిగుమతి చేసుకునే ప్లాన్ కూడా చేస్తోంది. ఇప్పుడు దాదాపు 40 దేశాల నుండి సరఫరా కోసం ప్లాన్ చేసింది కేంద్రం.

Published : 
  • 11 March 2026, 10:20 AM IST