Top Story: దుబాయ్ సేఫ్ కాదా..? భారత్ పై ఈ రేంజ్ లో ఎఫెక్ట్ ఉంటుందా..? దుబాయ్ లో ఇండియన్స్ లెక్క ఇదే.

దుబాయ్” ఇప్పటి వరకు భూతల స్వర్గం. హాలిడే ఎంజాయ్ చేయాలన్నా, న్యూఇయర్ వేడుకలు అయినా, సినిమా షూటింగ్ లు అయినా, టూరిస్ట్ స్పాట్స్ కు అయినా.. ఏ రకంగా చూసుకున్నా దుబాయ్ రేంజ్ వేరు.

Post Published By: dialnews
Updated : 3 March 2026, 8:01 PM IST

దుబాయ్” ఇప్పటి వరకు భూతల స్వర్గం. హాలిడే ఎంజాయ్ చేయాలన్నా, న్యూఇయర్ వేడుకలు అయినా, సినిమా షూటింగ్ లు అయినా, టూరిస్ట్ స్పాట్స్ కు అయినా.. ఏ రకంగా చూసుకున్నా దుబాయ్ రేంజ్ వేరు. రియల్ ఎస్టేట్ రంగంలో కింగ్ సిటీ. మన దేశంలో మిడిల్ క్లాస్ వాళ్లకు చిన్న ఇల్లు కట్టుకోవడం కల.. డబ్బున్న వాడికి దుబాయ్ లో ఓ ఫ్లాట్ కల. రియల్ ఎస్టేట్ డాన్ లు.. మాఫియా కింగ్ లకు దుబాయ్ సేఫ్ ప్లేస్. కానీ కానీ సీన్ రివర్స్ అయింది. సెలెబ్రేషన్స్ తో ఊగిపోయే జనాలు.. బతుకు జీవుడా అంటూ పరుగులు తీస్తున్నారు.

దశాబ్దాలుగా, దుబాయ్ ప్రాంతీయ సంక్షోభాలకు దూరంగా ఉంది. మిత్ర దేశాలే ఎక్కువ. అందుకే అన్ని రంగాల్లో.. దుబాయ్ అభివృద్ధి సాధించింది. తనను తాను సేఫ్ ప్లేస్ గా మార్కెట్ చేసుకుంది దుబాయ్. అయినప్పటికీ తాజా దాడులతో దుబాయ్ ఉలిక్కిపడితే.. దుబాయ్ లో పెట్టుబడులు పెట్టిన వారికి చెమటలు పడుతున్నాయి. అక్కడ బ్రతికే వారికి చావు భయం వెంటాడుతుంది. ఇరాన్ తో అమెరికా, ఇజ్రాయిల్ గోక్కుంటే.. ఆ ప్రభావం దుబాయ్ కు తీరని నష్టాన్ని మిగిల్చింది. దీనితో దుబాయ్ ఇమేజ్ పై తీవ్ర ప్రభావం పడింది.

అమెరికా – ఇజ్రాయెల్.. ఇరాన్‌ పై భీకర దాడులు చేసి.. సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీతో సహా సీనియర్ నాయకులను హతమార్చింది. దీనితో ప్రతీకారంతో రగిలిపోయిన ఇరాన్ తీవ్రంగా రియాక్ట్ అయింది. ప్రతీకారం ఇజ్రాయెల్ లేదా యుఎస్ స్థావరాలకే పరిమితం కాలేదు. బదులుగా, క్షిపణులు, డ్రోన్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో సహా పలు కీలక గల్ఫ్ దేశాలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ దాడుల ప్రభావంతో దుబాయ్ వణికిపోయింది. ఫిబ్రవరి చివరిలో మొదలైన ఈ యుద్ధం ఇరాన్ అణు కేంద్రాలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటే ఇరాన్ కూడా అదే రేంజ్ లో రియాక్ట్ అవుతోంది.

ఇరాన్ ప్రతీకారంగా ఇజ్రాయెల్ నగరాలు, అమెరికా ఆర్మీ బేసులపై క్షిపణులు ప్రయోగించింది. దుబాయ్‌కు 500 కి.మీ. దూరంలో ఉన్న ఇరాన్ నుంచి వచ్చిన డ్రోన్లు, క్షిపణులు యూఏఈ మొత్తాన్ని వణికించాయి. అలాగే ఇరానియన్ క్షిపణులు, డ్రోన్లు గల్ఫ్ దేశాలలోని కీలక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నాయి. హోటళ్ళు, ఓడరేవులు, విమానాశ్రయాలు సహా పౌరులు ఉండే ప్రాంతాల్లో కూడా దాడులు చేసింది ఇరాన్. విలాసవంతమైన బీచ్ క్లబ్‌లు, మెరిసే మాల్స్‌కు అలవాటు పడిన ఈ నగరంలో, తొలిసారి ఎమర్జెన్సీ సైరన్ లు మోగాయి.

పేలుళ్లను బాణా సంచా అనుకుని చాలా మంది కంగారు పడలేదు. క్రమంగా సినిమా అర్ధమయ్యే సరికి పరుగులు తీసారు. హోటల్స్ లో ఉండే వారు, దుబాయ్ పౌరులు కూడా వణికిపోయారు. గల్ఫ్ వైమానిక ప్రాంతం మూసివేయడంతో దుబాయ్‌లోని ప్రధాన విమానాశ్రయాలలో విమానాలు నిలిపివేసారు. షార్జా విమానాశ్రయం కూడా మూసివేయడంతో మరింత ప్రభావం పడింది. దీని వలన వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఆసియా, యూరప్, ఉత్తర అమెరికా సహా చాలా దేశాలకు కనెక్టివిటి కష్టంగా మారింది.

ఇక ఈ ప్రభావం మన తెలుగు వారిపై కూడా తీవ్రంగా పడింది. దుబాయ్ లో మన వాళ్ళు ఎందరో ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. వ్యాపారాలు, పర్యటనలు, అక్కడ స్థిరపడిన వారు.. ఎందరో ఉన్నారు. దాదాపు దుబాయ్ లో 20 లక్షల మంది భారతీయులు ఉంటారని అంచనా. దుబాయ్‌లో భారతీయుల సంఖ్య 2024-25 డేటా ప్రకారం సుమారు 22-25 లక్షల మంది. ఇక కేరళ, తమిళనాడు, ఆంధ్ర-తెలంగాణ నుంచి ఎక్కువ మంది ఇక్కడ సెటిల్ అయ్యారు. హైదరాబాద్, విజయవాడ నుంచి వెళ్లిన తెలుగు యువకులు "రాత్రంతా సైరెన్ సౌండ్, పిల్లలు భయపడుతున్నారు" అంటూ చేసిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఒక కన్‌స్ట్రక్షన్ వర్కర్.. ఇక్కడ వచ్చే జీతమే తనకు ఆధారం అని.. ఇప్పుడు ఉద్యోగం పోతుంది అంటూ ఆవేదన వ్యక్తం చేసాడు. ప్రధాని మోదీ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ‌తో మాట్లాడి, భారతీయుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. అలాగే భారత ప్రభుత్వం ప్రత్యేక విమానాలు కూడా నడిపే ప్రయత్నం చేస్తోంది. ఇక యుద్ధం మరిన్ని వారాలు కొనసాగితే, దుబాయ్ లోని భారతీయులు భారీ నష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కన్‌స్ట్రక్షన్ ప్రాజెక్టులు ఆగిపోయి, రోజువారీ కార్మికులు జీతం కోల్పోయే అవకాశం ఉంది.

చమురు ధరలు పెరగడంతో ఆభరణాలు, టెక్స్‌టైల్స్ ఎగుమతులు ఆగిపోయాయి. దుబాయ్‌లో భారతీయ వ్యాపారులు లక్షల కోట్ల నష్టపోయే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. హార్ముజ్ జలసంధి మూసివేతతో ప్రపంచ చమురు సరఫరా 20% ఆగిపోయింది. ఆ ప్రభావం కొనసాగితే భారత్ లో ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రభావం ప్రతీ రంగంపై పడటం ఖాయం. ఇక గగనతలం మూసివేయడంతో అమెరికా లేదా యూరప్ దేశాలకు వెళ్ళే విమానాలు రూట్ మార్చుకుని వెళ్ళాల్సిన పరిస్థితి. దీనితో విమాన రంగంపై ఆధారపడిన ఎగుమతులు, దిగుమతులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.

Published : 
  • 3 March 2026, 8:01 PM IST