అమరావతి టార్గెట్గా వై సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి, కూటమి సర్కార్ పై బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తున్నారా? 2029 ఎన్నికల్లో వైసీపీని ఈ అస్త్రమే గెలిపిస్తుందని బలంగా నమ్ముతున్నారా? ఇంతకీ ఏమిటా బ్రహ్మాస్త్రం? అది ఏ రకంగా చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ ని , కూటమి సర్కారుని ఇబ్బంది పెట్టబోతోంది.? చంద్రబాబు ఇప్పుడే కళ్ళు తెరవకపోతే ... జగన్ ప్రయోగించబోయే ఆ బ్రహ్మాస్త్రం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి సర్కారుని ఇబ్బందులు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
చంద్రబాబు కేవలం అమరావతి పైనే దృష్టి సారిస్తున్నారని, రాజధాని పేరుతో అమరావతికి రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఏపీలో మిగిలిన ప్రాంతాలు అన్నిటిని నిర్లక్ష్యం చేస్తున్నారని, అమరావతికి లక్షల కోట్లు ఖర్చు పెట్టడం వల్ల మిగిలిన ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టలేకపోయారని.... ఇది చివరికి మరో ప్రత్యేక రాష్ట్రఉద్యమంగా మారే ప్రమాదం ఉందని వైసిపి ప్రచారం చేయబోతోంది. ఇప్పటికే నిదానంగా ఆ ప్రచారాన్ని జనంలో పెట్టింది. దీనిలో భాగంగానే వైసిపి నేతలు ఎక్కడ వీలైతే అక్కడ తమ ప్రాంతాలు వెనకబడిపోయాయని, అమరావతిపై మోజుతో.... కొన్ని వర్గాలకు, కులాలకు మాత్రమే మేలు చేయాలని లక్ష్యంతో అక్కడ లక్షల కోట్లు ఖర్చు చేస్తూ తమ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని నినాదాన్ని ఎత్తుకున్నారు. ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ నేతలు ఇదే విషయాన్ని జనంలోకి తీసుకెళ్తున్నారు.
అమరావతికి దోచిపెట్టి... రాజధాని నిర్మాణం పేరుతో వేలకోట్ల అవినీతి చేసి మిగిలిన ప్రాంతాలను నిర్లక్ష్యం చేశారు అనే ప్రచారాన్ని రాబోయే మూడేళ్లు జనంలోకి బాగా తీసుకొని వెళ్తారు. మావిగన్ నినాదంతో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో ప్రజల దృష్టిని వైసీపీ వైపు మళ్లిస్తూ, ఉత్తరాంధ్ర రాయలసీమ కోస్తాలో కొన్ని ప్రాంతాల వెనుకబాటుతనాన్ని మరోవైపు చూపిస్తూ .... ఈ బ్రహ్మాస్త్రాన్ని జనంలోకి బాగా తీసుకెళ్లాలన్నది జగన్ వ్యూహం. వెనుకబాటు తనం వల్లే తెలంగాణ ఉద్యమం వచ్చిందని, ఇప్పుడు అమరావతికి లక్షల కోట్లు దోచిపెట్టి మిగిలిన ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తే అక్కడ ఇలాంటి ప్రమాదమే వస్తుందని .... అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలు మినహా రాష్ట్రంలోని మిగిలిన వెనుకబడిన ప్రాంతాలు అన్నిటిలోనూ ప్రచారం చేయడం వైసిపి వ్యూహం.
మరోవైపు మావిగన ప్రచారాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్తారు. లక్షల కోట్ల రూపాయలు అమరావతి కోసం వృధా చేయడం కన్నా.... మావిగన్ ప్రాంతంలో తక్కువ ఖర్చుతో రాజధాని ఏర్పాటు చేయవచ్చని.... జనానికి ఒకటికి పది సార్లు చెప్పి మైండ్ లోకి ఎక్కిస్తారు. అమరావతి కోసం వెచ్చిస్తున్న డబ్బు వెనుకబడిన ప్రాంతాల్లో ఖర్చు పెట్టవచ్చు కదా అని ప్రశ్నిస్తారు.అమరావతి మాయలో పడి ఏపీలో మిగిలిన అన్ని ప్రాంతాలను చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం చేసిందని వైసిపి ప్రచారాన్ని రాబోయే రోజుల్లో కూటమి పార్టీలు దీటుగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అమరావతి రాజధానితో పాటు అన్ని ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టామని, ఆ కృషి కొనసాగుతూనే ఉందని రకరకాల సాధనాల ద్వారా టిడిపి జనసేన బిజెపి పార్టీలు జనంలోకి వాస్తవాలను తీసుకెళ్లాల్సిన అవసరం చాలా ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చిన తీరు టిడిపి కనుక చెప్పుకో లేకపోతే 2029లో భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుంది. ప్రధానంగా రోడ్లు, ఫ్లై ఓవర్లు, పెండింగ్ ప్రాజెక్టులు, రైతుల సమస్యలు తో పాటు స్థానిక సమస్యలు ఏ రకంగా ఐదేళ్లలో పరిష్కరించాము అన్నది కూటమి పార్టీలు జనంలోకి బలంగా తీసుకెళ్లి చెప్పుకోవలసిన అవసరం ఉంది.