మిడిల్ ఈస్ట్ ఘర్షణ ముగియకముందే మరో యుద్ధానికి రంగం సిద్ధమవుతోందా? దక్షిణ కొరియాపై భీకర దాడికి కిమ్ రెడీ అవుతున్నారా? ఈ యుద్ధానికి కూడా ట్రంపే కారణం కాబోతున్నాడా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఔననే సమాధానమే వినిపిస్తోంది. పదేళ్ల క్రితం సియోల్‌కు రక్షణగా ఉంటానని హామీ ఇచ్చిన అమెరికా.. ఇప్పుడు యూటర్న్ తీసుకుంటోంది. ఇరాన్‌తో యుద్ధంలో తమతో కలిసి రాలేదన్న ఒకే ఒక్క కారణంతో.. సౌత్ కొరియాను టార్గెట్ చేశాడు ట్రంప్. సరిహద్దుల్లో కిమ్ అణు బటన్‌పై వేలు పెట్టి కూర్చున్న వేళ.. సియోల్‌తో సైనిక విన్యాసాలను కుదిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈ నిర్ణయానికి కారణం కేవలం ఇరాన్ యుద్ధం ఒక్కటే కాదు.. కిమ్, పుతిన్ మధ్య బలపడుతున్న బాండింగ్ కూడా.
మిత్ర దేశం సౌత్ కొరియాను బెదిరిస్తూ ట్రంప్ చేసిన సెన్సేషనల్ ట్వీట్ ఇదే. ఇటీవలే ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం కావాలని దక్షిణ కొరియాను ట్రంప్ స్వయంగా కోరాడు. అయితే, పశ్చిమాసియా సంక్షోభంలోకి అనవసరంగా తలదూర్చడం నచ్చని సియోల్.. ట్రంప్ ప్రతిపాదనకు చాలా స్పష్టంగా 'నో థాంక్స్' అని తిరస్కరించింది. ఈ తిరస్కరణ అగ్రరాజ్యాధినేత అహాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. దీంతో దక్షిణ కొరియా సహాయ నిరాకరణతో రగిలిపోయిన ట్రంప్, తన అసంతృప్తిని ట్రూత్ సోషల్‌లో బహిర్గతం చేశాడు. అమెరికా పిలుపునిచ్చినా కలిసిరాని దేశాలను తామెందుకు రక్షించాలని నేరుగా ప్రశ్నించాడు. తక్షణమే దక్షిణ కొరియాతో నిర్వహించే వార్షిక సంయుక్త సైనిక విన్యాసాలను భారీగా తగ్గించాలని పెంటగాన్‌ను ఆదేశించాడు. ఆగస్టు 17 నుంచి 27 వరకు షెడ్యూల్ అయిన 'ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్' మిలిటరీ డ్రిల్స్ అప్పటికే ఖరారు కావడంతో రద్దు చేయలేకపోయామని, లేదంటే వాటిని కూడా పూర్తిగా నిలిపివేసేవాళ్లమని ట్రంప్ స్పష్టం చేయడం ఇప్పుడు కొరియా ద్వీప కల్పాన్ని షేక్ చేస్తోంది.
ట్రంప్ ఆదేశాలు అమెరికా దశాబ్దాలుగా అవలంబిస్తున్న 'యూజ్ అండ్ త్రో' విధానానికి అద్దం పడుతున్నాయి. గతంలో కుర్దులు మొదలుకొని ఆఫ్ఘనిస్తాన్ వరకు.. తమ స్వార్థ ప్రయోజనాలు తీరిపోగానే మిత్రులను గాలికొదిలేసిన చరిత్ర అమెరికాది. ఇప్పుడు ఆసియాలో చిరకాల మిత్రదేశం, సరిహద్దుల్లో కిమ్ నుంచి అణు బాంబుల ముప్పును నిరంతరం ఎదుర్కొంటున్న సౌత్ కొరియాను కూడా ట్రంప్ అదే రీతిలో ఒంటరిని చేస్తున్నారు. తమ యుద్ధాలకు సహకరించడం లేదన్న ఒకే ఒక్క కారణంతో రక్షణ హామీలను వెనక్కి తీసుకోవడం సియోల్ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో పైకి ఇరాన్ అంశంలో సహకరించలేదనే సాకు చూపిస్తున్నా.. అసలు భయం వేరే ఉంది. అది మరేదో కాదు కిమ్, పుతిన్ మధ్య కుదిరిన చారిత్రక రక్షణ ఒప్పందం. ప్రచ్ఛన్న యుద్ధ కాలం నాటి బంధాన్ని పునరుద్ధరిస్తూ మాస్కో-ప్యాంగ్యాంగ్ పరస్పరం రక్షణ ఒప్పందంపై సంతకాలు చేయడం అంతర్జాతీయ సమీకరణాలను తలకిందులు చేసింది. ఇద్దరు అణ్వాయుధ దేశాధినేతలు ఏకమై అమెరికా ఆధిపత్యానికే నేరుగా సవాలు విసురుతుండటం ట్రంప్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
ఉక్రెయిన్ యుద్ధంలో నార్త్ కొరియా కీలక పాత్ర పోషిస్తోంది. అమెరికా, నాటో దేశాలు ఉక్రెయిన్‌కు భారీగా ఆయుధాలు కుమ్మరిస్తుంటే.. అటు రష్యాకు అవసరమైన లక్షలాది ఆర్టిలరీ షెల్స్, అత్యాధునిక kn-23 బాలిస్టిక్ క్షిపణులను కిమ్ నిరాటంకంగా సరఫరా చేస్తున్నాడు. అంతేకాకుండా, వేలాది మంది ఇంజనీర్లు, సైనిక సిబ్బందిని సైతం సహాయంగా పంపడం ద్వారా రష్యా పోరాటం ఆగకుండా కిమ్ సహకరిస్తున్నాడు. ఇది అమెరికా వేసిన ఆంక్షలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ, ఉక్రెయిన్‌లో వాషింగ్టన్ ఆధిపత్యాన్ని దెబ్బతీస్తోంది. ఉక్రెయిన్ యుద్ధంలో చేస్తున్న ఈ సహాయానికి ప్రతిఫలంగా.. రష్యా నుంచి ఉత్తర కొరియా ప్రమాదకరమైన సాంకేతికతను అందుకుంటోంది. అణ్వస్త్ర జలాంతర్గాములు, అత్యాధునిక గూఢచార ఉపగ్రహాలు, అణు వార్హెడ్లను సురక్షితంగా మోసుకెళ్లే రీ-ఎంట్రీ వెహికల్ టెక్నాలజీని పుతిన్.. కిమ్‌కు బదిలీ చేస్తున్నారనే నిఘా నివేదికలు వాషింగ్టన్‌ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే వాషింగ్టన్, న్యూయార్క్ వంటి నగరాలను ధ్వంసం చేసే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను సిద్ధం చేసుకున్న కిమ్.. పుతిన్ టెక్నాలజీతో మరింత బలపడితే, అమెరికా భూభాగంపై ఎప్పుడైనా విరుచుకుపడే ప్రమాదముందని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అమె, సౌత్ కొరియాతో సంయుక్త సైనిక విన్యాసాలను తగ్గించడం ద్వారా కిమ్‌కు ఒక పరోక్ష సంకేతాన్ని పంపుతున్నాడు. ఈ డ్రిల్స్ చాలా ఖర్చుతో కూడుకున్నవని, అవి ఉత్తర కొరియాను అనవసరంగా రెచ్చగొట్టేలా ఉన్నాయని ట్రంప్ వ్యాఖ్యానించడం వెనుక ఆంతర్యం ఇదే. పైగా తన ట్రూత్ సోషల్ పోస్ట్‌లో కిమ్‌తో తనకు చాలామంచి సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నాడు. గతంలో సింగపూర్, హనోయ్ భేటీల్లో కిమ్‌తో కుదిరిన వ్యక్తిగత స్నేహాన్ని గుర్తుచేస్తూ.. కిమ్‌ను రష్యా శిబిరం నుంచి వేరు చేసేందుకు ట్రంప్ వెంపర్లాడుతున్నాడు. అమెరికా-దక్షిణ కొరియా విన్యాసాలు తగ్గుముఖం పడితే సియోల్ రక్షణ పూర్తిగా గాల్లో దీపంలా మారే ప్రమాదం ఉంది. కిమ్ నిరంతరం క్షిపణి పరీక్షలు, సరిహద్దు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్న వేళ.. అమెరికా తన సైనిక విన్యాసాల తీవ్రతను తగ్గించడం కిమ్‌కు మరింత స్వేచ్ఛ ఇచ్చినట్లే అవుతుంది. మరి ఈ వ్యవహారం రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.