తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా ఫ్యామిలీ పెట్టిన మంటల వేడి కొనసాగుతూనే ఉంది. పార్టీలో అంతర్గత కలహాలు, అధిష్ఠానం వద్ద నడుస్తున్న పంచాయితీలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారవుతుండగా, మరోవైపు విమర్శలు ఎదుర్కొంటున్న మంత్రి కొండా సురేఖ పదవి ఊడటం దాదాపు ఖాయమనే ప్రచారం పొలిటికల్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఈ ఉత్కంఠ సమయాన, సురేఖను మంత్రివర్గం నుంచి తప్పిస్తే ఆమెను తమ వైపు తిప్పుకోవడానికి భారతీయ జనతా పార్టీ వేగంగా పాచికలు కదుపుతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త అలజడి సృష్టిస్తోంది.
సెప్టెంబరు 3న తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలతో అధిష్ఠానం ఢిల్లీలో సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అధిష్ఠానం పిలుపు మేరకు ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ఎఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌ఛార్జి కేసీ వేణుగోపాల్ సెప్టెంబరు 1న ఢిల్లీకి తిరిగి రానున్నారు. ఆయన రాకతో తెలంగాణ కేబినెట్ విస్తరణ, పార్టీలోని వివాదాలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం అత్యంత తీవ్రంగా పరిగణించింది.
పీసీసీ క్రమశిక్షణా కమిటీ ఇచ్చిన సమగ్ర నివేదిక ఇప్పటికే ఎఐసీసీ వేదికకు చేరింది. ఈ నివేదిక ఆధారంగా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించడం లేదా ఆమె శాఖను మార్చడంపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. సురేఖ ఎపిసోడ్‌పై క్లారిటీ వచ్చిన తర్వాతే కేబినెట్ ప్రక్షాళన చేపట్టనున్నట్లు తెలుస్తోంది. తన స్వంత ప్రభుత్వం, పార్టీలోని కొందరు నేతల వైఖరిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆవేదన, అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇటీవల తన్ను కలిసిన కొందరు సన్నిహిత నేతల వద్ద ఆయన మాట్లాడిన మాటలు కాంగ్రెస్‌లో సరికొత్త చర్చకు తెరతీశాయి. "ఎంతో కష్టపడి పార్టీని అధికారంలోకి తెచ్చి, నేతలకు పదవులిచ్చి గౌరవిస్తే.. ఇంట్లో ఉన్న పిల్లలతో ఇష్టం వచ్చినట్లు తిట్టిస్తారా ? దేనికైనా ఒక పరిమితి, హద్దు ఉంటుంది కదా ! సొంత నేతలే ప్రభుత్వాన్ని, పార్టీని పదే పదే విమర్శిస్తూ ఇష్టారాజ్యంగా మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామా ? అసలు ఇలాంటి ధోరణి వల్ల సమాజానికి, పార్టీకి ఎలాంటి సంకేతాలు వెళ్తాయి ?" అంటూ సీఎం మాట్లాడిన మాటలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
మరో పక్క ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తి కావొస్తున్న నేపథ్యంలో క్యాబినెట్లో మార్పులు, శీఘ్ర ప్రక్షాళన అవసరమని రేవంత్ రెడ్డి వర్గం భావిస్తోంది. కాంగ్రెస్‌లో జరుగుతున్న ఈ రాజకీయ పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి భారతీయ జనతా పార్టీ వేగంగా వ్యూహాలు రచిస్తోంది. ఒకవేళ కాంగ్రెస్ అధిష్ఠానం కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తే, కొండా ఫ్యామిలీ కాంగ్రెస్‌లో ఉండటం కష్టమేనని భావిస్తున్న కమలనాథులు.. ఆమెను తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు రహస్య సంప్రదింపులు మొదలుపెట్టారు. ఢిల్లీలో పార్టీ అధిష్టానంతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిన ఒక బీజేపీ ఎంపీ.. కొండా మురళితో నిరంతరం మాట్లాడటంతో పాటు రహస్య సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్ నడుస్తోంది. కొండా ఫ్యామిలీ బీజేపీలో చేరితే పార్టీలో లభించే ఆఫర్లు, ప్రాధాన్యత గురించి చర్చిస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా కుటుంబానికి సొంత క్యాడర్, బలం ఉండటంతో.. వాళ్లని చేర్చుకోవడం ద్వారా వరంగల్‌లో పార్టీని మరింత బలపరచవచ్చని బీజేపీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. బీజేపీలో కొండా చేరికపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు మరో చర్చకు దారి తీశాయి.
"కొండా సురేఖ రాజీనామా చేసి, ఆ తర్వాత బీజేపీలోకి వస్తానని చెప్తే.. అప్పుడు తాను మాట్లాడతానంటూ కామెంట్ చేశారు కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి కామెంట్స్‌కు ఇప్పుడు ఈ రహస్య సంప్రదింపులు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఈ వ్యవహారం తేలకముందే మంత్రి పదవి కోసం సంప్రదింపులు మొదలయ్యాయి. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్లో 18 బెర్త్‌లకు గాను 15 మందే ఉన్నారు. ఇప్పటికే 2 ఖాళీలు ఉండగా, సురేఖను కూడా తప్పిస్తే మొత్తం 3 ఖాళీలు ఏర్పడతాయి. కొండా సురేఖ బీసీ కేటగిరీకి చెందిన నేత కావడంతో, ఆమె స్థానంలో మరొక బిసి నేతను కేబినెట్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రేసులో పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనకు మంత్రి పదవి ఇస్తే పీసీసీ పోస్టును మరొకరికి అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్‌తో పాటు నల్గొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్లు కూడా కేబినెట్ రేసులో ఊహాగానాలుగా మారాయి. సెప్టెంబరు 3న ఢిల్లీలో జరగబోయే హైకమాండ్ భేటీతో ఈ పొలిటికల్ సస్పెన్స్‌కు తెరపడే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధిష్ఠానం సురేఖపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ? ఒకవేళ వేటు పడితే కొండా ఫ్యామిలీ నిజంగానే కాంగ్రెస్‌కు హ్యాండిచ్చి కమలం నీడకు చేరుతుందా ? అనేది రాబోయే కొద్ది రోజుల్లో తేలనుంది.