ఆంధ్రప్రదేశ్ లో కల్తీ లడ్డు వ్యవహారంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. వైసీపీపై టీడీపీ పెద్ద పోరాటమే చేస్తోంది. ఇలాంటి సమయంలో డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ చేసిన ఓ కామెంట్ కు ఇప్పుడు డబుల్ మీనింగ్ వస్తోంది అనే చర్చ మొదలైంది. డబుల్ మీనింగ్ అంటే మీరు అనుకునేది కాదు.. మరో రకం కామెంట్. అసలు ఏం జరిగిందో చూద్దాం. 2019 నుంచి 2024 వరకు నెయ్యిని కల్తీ చేశారు అనేది ఇక్కడ ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణలను ఋజువు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ కూడా ఏర్పాటు చేసింది.
ఆ తర్వాత వైసీపీ కోర్ట్ కు వెళ్ళడంతో.. రాష్ట్ర సర్కార్ ఏర్పాటు చేసిన సిట్ కాదని, సుప్రీం కోర్ట్.. సిబిఐతో కలిపి మరో సిట్ ఏర్పాటు చేసింది. ఆ సిట్ చేసిన విచారణలో బయటపడ్డ విషయాలు.. ఇప్పుడు శ్రీవారి భక్తుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. గత ఏడాది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశంలో చేసిన వ్యాఖ్యల తర్వాత దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. లడ్డు నాణ్యత తగ్గిందనే విమర్శలు.. అప్పట్లో పెద్ద ఎత్తున వచ్చాయి. ఆ చంద్రబాబు చేసిన వ్యాఖ్యల తర్వాత.. నాణ్యతపై ప్రజల్లో చర్చ జరిగింది.
అక్కడి వరకు బాగానే ఉంది.. కానీ ఈ విషయంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. అప్పుడు చేసిన దీక్షతో పాటుగా, జనసేన పార్టీ డిక్లరేషన్ ఇవన్నీ కూడా సంచలమయ్యాయి. అదే విధంగా కాలినడకన తిరుమల వెళ్ళిన పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత నుంచి ఈ విషయంలో కొంత ఘాటుగానే వైసిపి పై విమర్శలు కూడా చేస్తూ వచ్చారు. ఇక తాజాగా ఇది ఏపీ శాసనసభ సమావేశాల్లో.. అత్యంత కీలకంగా ఈ లడ్డు వ్యవహారం మారిన నేపధ్యంలో.. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం, షార్ట్ డిస్కషన్ పెట్టింది.
లడ్డు కల్తీ కి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో.. కల్తీ ఏ విధంగా జరిగిందో శాసనసభలో చర్చించారు. అయితే ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, ఒక్కసారిగా ఆశ్చర్యం కలిగించాయి. గత ప్రభుత్వం.. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ కి పాల్పడిందని ఆయన విమర్శించారు. తాను దీక్ష చేశానని గుర్తు చేశారు పవన్ కళ్యాణ్. తిరుమల లడ్డుకు వాడిన నెయ్యిలో అసలు నెయ్యి లేదని తేలిందన్నారు.
గత ప్రభుత్వంలో అరాచకానికి ఇన్నోవేషన్ చేశారంటూ.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే ఇక్కడ ఓ ఆశ్చర్యకరమైన కామెంట్ చేశారు. “గత ప్రభుత్వాధినేత వైఎస్ జగన్ తప్పు చేశారని తాను ఎక్కడా చెప్పలేదు” అంటూ పవన్ కొంత ఆశ్చర్యకర కామెంట్ చేశారు. గత టిటిడి బోర్డుదే తప్పని చెప్పానని.. కల్తీ జరిగిందని ఒప్పుకుంటే ఇంత చర్చ అవసరం ఉండేది కాదన్నారు. గత టీటీడీ బోర్డులోని వారిని ఎందుకు వెనకేసుకొస్తున్నారని..? పవన్ కళ్యాణ్ నిలదీశారు. శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసేందుకు కుట్ర జరిగిందని సిట్ తేల్చినట్లు పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు.
ఇక్కడ డబుల్ మీనింగ్ కామెంట్.. “గత ప్రభుత్వాధినేత వైఎస్ జగన్ తప్పు చేశారని తాను ఎక్కడా చెప్పలేదు” అనేది. ఈ కామెంట్ వెనుక మీనింగ్ చాలా మందికి క్లారిటీ రాలేదు. అప్పుడు జరిగిన పాపాలు జగన్ కు తెలియకుండా జరిగాయని, కాబట్టి ఇక్కడ జగన్ పై విమర్శలు చేయడం కరెక్ట్ కాదనే అర్ధం వచ్చేలా పవన్ మాట్లాడారా అంటూ ఇప్పుడు ఓ చర్చ మొదలైంది. ఈ విషయంలో ముందు నుంచి కూడా.. టిడిపి, వైయస్ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గా విమర్శలు చేస్తుంది.
ఆయన హయాంలో తిరుమలలో పాపాలు జరిగాయని కూడా.. టీడీపీ విమర్శిస్తుంది. ఇలా వైసీపీ టార్గెట్ గా విమర్శలు చేస్తున్న సమయంలో, తాను జగన్ పై విమర్శలు చేయలేదని.. పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేయడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం అవుతుంది. దీనిపై టిడిపి కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు కూడా ఒకరకంగా షాక్ అయ్యారు. 2024 ముందు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్.. తర్వాత జగన్ పై విమర్శలు చేసే విషయంలో వెనక్కి తగ్గుతూ వచ్చారు.
ఇప్పుడు కల్తీ లడ్డు వ్యవహారంలో కూడా జగన్ పై నేరుగా విమర్శలు చేయకుండా, తాను అసలు జగన్ ను ఏమీ అనలేదని కామెంట్ చేయడం విస్మయానికి గురిచేసింది. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ఇక వైసిపి కార్యకర్తలు.. పవన్ కామెంట్స్ తో ఒకరకంగా పండగ చేసుకునే పరిస్థితి కూడా క్రియేట్ అయింది. శాసనమండలిలో వైసిపి కల్తీ లడ్డు వ్యవహారాన్ని.. ప్రస్తావిస్తూ హెరిటేజ్ తో పాటుగా ఇందాపూర్ డైరీ పై కూడా విమర్శలు చేస్తుంది. బొత్స నేతృత్వంలో వైసీపీ మండలి ప్రతిపక్షం ఓ యుద్దమే చేస్తోంది.
దీని నుంచి బయటపడేందుకు టిడిపి నానా కష్టాలు పడుతున్న సమయంలో.. పవన్ కళ్యాణ్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడంతో.. సభలో ఉన్న టిడిపి నేతలు కూడా షాక్ అయ్యారు. అసలు జగన్ ఆదేశాలు లేకుండా.. లడ్డు కల్తీ ఎలా జరుగుతుందని..? టీటీడీ నుంచి మామూళ్ళు ఎవరికి వెళ్ళాయని, అటు టిడిపి కార్యకర్తలు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ముందు నుంచి పవన్ కళ్యాణ్ ను వ్యతిరేకిస్తున్న వారు కూడా ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ మరోసారి విమర్శలు చేస్తున్నారు.