పాకిస్థాన్‌ కు రాజ్‌నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్…!

భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్థాన్‌ పై నిప్పులు చెరిగారు. భారత్‌ పై దాడులు చేస్తామంటూ కవ్వింపులకు పాల్పడుతున్న పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలకు ఆయన ఘాటుగా బదులిచ్చారు.

Post Published By: dialnews
Updated : 8 April 2026, 10:30 AM IST

భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్థాన్‌ పై నిప్పులు చెరిగారు. భారత్‌ పై దాడులు చేస్తామంటూ కవ్వింపులకు పాల్పడుతున్న పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలకు ఆయన ఘాటుగా బదులిచ్చారు. పశ్చిమ బెంగాల్‌ లోని బారక్‌ పూర్‌ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాజ్నాథ్, పాక్ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో భారత్ ఏదైనా దాడులకు పాల్పడితే, తాము కలకత్తాను లక్ష్యంగా చేసుకుంటామని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా కలకలం రేపాయి. దీనిపై స్పందించిన రాజ్నాథ్ సింగ్, ఇలాంటి రెచ్చగొట్టే మాటలు మానుకోవాలని పాకిస్థాన్‌ ను హెచ్చరించారు. 55 ఏళ్ల క్రితం 1971లో పాకిస్థాన్ రెండు ముక్కలైన విషయాన్ని వాళ్లు మర్చిపోకూడదు అని రాజ్‌నాథ్ గుర్తు చేశారు. ఆనాడు తూర్పు పాకిస్థాన్‌ ను కోల్పోయి బంగ్లాదేశ్ ఏర్పడిన పరాభవాన్ని ప్రస్తావిస్తూ.. ఇప్పుడు మళ్లీ బెంగాల్ వైపు కన్నెత్తి చూస్తే ఈసారి పాకిస్థాన్ ఎన్ని ముక్కలవుతుందో ఆ దేవుడికే తెలియాలని తీవ్రంగా హెచ్చరించారు.

పాక్ కవ్వింపులకు భారత్ ఎప్పుడూ భయపడదని రాజ్నాథ్ స్పష్టం చేశారు. గత ఏడాది ఏప్రిల్‌ లో పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ఏ స్థాయిలో ప్రభావం చూపిందో పాకిస్థాన్‌ కు తెలుసని ఆయన పేర్కొన్నారు. కేవలం 22 నిమిషాల్లోనే పాకిస్థాన్‌ ను భారత్ మోకాళ్లపైకి తెచ్చిందని, ఇప్పుడు కూడా మన సైన్యం ఏ క్షణమైనా దీటుగా సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. పాక్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శలు చేయగా, రాజ్నాథ్ వాటిని తిప్పికొట్టారు. సరిహద్దు భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ రాజీపడదని, బెంగాల్ ప్రజల రక్షణ కోసం తాము దేనికైనా సిద్ధమని రాజ్నాథ్ సింగ్ హామీ ఇచ్చారు.

Published : 
  • 8 April 2026, 10:30 AM IST