Top story: దెబ్బ అదుర్స్..! పాకిస్తాన్‌కు బిగ్ షాక్ ఇచ్చిన సింగపూర్ బిలహరి కాదు.. ఆయన మరో జైశంకర్..!

భారత్ వల్లే పాకిస్తాన్ అభివృద్ధి చెందడం లేదట, ఆఫ్ఘాన్‌తో వివాదాల వల్లే పాక్ వెనుక బడిపోతోందట.. ఈ రెండు దేశాలతో సరిహద్దులు లేకపోతే పాక్ ఎప్పుడో గ్లోబల్ పవర్‌గా నిలిచేదట. అంతర్జాతీయ వేదికలపై ఆ దేశం ఎప్పుడూ కార్చే మొసలి కన్నీరే ఇది.

Post Published By: dialnews
Updated : 7 July 2026, 1:29 PM IST

భారత్ వల్లే పాకిస్తాన్ అభివృద్ధి చెందడం లేదట, ఆఫ్ఘాన్‌తో వివాదాల వల్లే పాక్ వెనుక బడిపోతోందట.. ఈ రెండు దేశాలతో సరిహద్దులు లేకపోతే పాక్ ఎప్పుడో గ్లోబల్ పవర్‌గా నిలిచేదట. అంతర్జాతీయ వేదికలపై ఆ దేశం ఎప్పుడూ కార్చే మొసలి కన్నీరే ఇది. విచిత్రంగా పాశ్చాత్య దేశాలు ఈ ఏడుపును గుడ్డిగా నమ్మేస్తాయి. అదనంగా బిలియన్ల డాలర్ల ఆర్థిక సహాయం కూడా చేస్తాయి. అందుకే ఈ డర్టీ గేమ్స్‌ను పాకిస్తాన్ విడిచిపెట్టడం లేదు. తాజాగా మరోసారి ఆ గేమ్ ఆడి బొక్కబోర్లా పడిందా దేశం. అమెరికాకు చెందిన ప్రముఖ జర్నలిజం శిక్షణ సంస్థ 'నేషనల్ ప్రెస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక అంతర్జాతీయ సదస్సు జరిగింది. అందులో అంతర్జాతీయ దౌత్యం, భౌగోళిక రాజకీయాలపై చర్చ నిర్వహించారు. ఆ చర్చే పాకిస్తాన్ ఇజ్జత్ తీసిపారేసింది.

ఇదీ పాకిస్తాన్ జర్నలిస్ట్ క్వశ్చన్. "పాకిస్తాన్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న తీవ్రమైన అంతర్గత, ఆర్థిక, శాంతిభద్రతల సవాళ్లకు.. ఆ దేశమున్న భౌగోళిక స్థానమే ప్రధాన కారణం కాదా? భారత్, ఆఫ్ఘాన్ సరిహద్దుల్లో నెలకొన్న నిరంతర ఉద్రిక్తతల వల్లే పాకిస్తాన్ ఈ సంక్షోభంలో మునిగిపోయిందా? అని ప్రశ్నించాడు. అతడు తన ప్రశ్నలో పాక్ ఎదుర్కొంటున్న కొన్ని నిర్దిష్టమైన ఇబ్బందులను కూడా ప్రస్తావించాడు. దేశంలో విపరీతంగా పెరిగిపోయిన ద్రవ్యోల్బణం, ఇంధన ధరలు, కరాచీలోని అమెరికా రాయబార కార్యాలయంపై జరిగిన దాడులు, అంతర్జాతీయంగా పాకిస్తాన్ పాస్‌పోర్ట్ విలువ పడిపోవడం వంటి ఇబ్బందులను ప్రస్తావించాడు. ఈ పరిస్థితులకు కారణం పాలనా వైఫల్యం కాదనీ, అంతా పొరుగు దేశాలైన భారత్, ఆఫ్ఘనిస్తాన్‌ వల్లే జరుగుతోందని ప్రపంచ దేశాల ముందు విక్టిమ్ కార్డ్ ప్లే చేయడమే అతడి ఉద్దేశం. కానీ, ఇక్కడే పాక్ జర్నలిస్ట్ తప్పులో కాలేశాడు. ఎందుకో తెలియాలంటే, ఈ కౌంటర్ చూడాల్సిందే.

పాకిస్తాన్ జర్నలిస్టుకు నవ్వుతూనే నరకం చూపించింది ఎవరో కాదు.. సింగపూర్ మాజీ రాయబారి. పేరు బిలహరి కౌసికన్. ఈయన పాకిస్తాన్ తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి పొరుగు దేశాలపై నెపం నెట్టడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. పాక్ సమస్యలన్నీ ఆ దేశ రాజకీయ నాయకులు, మిలిటరీ తెచ్చిపెట్టిన స్వయంకృతాపరాధాలేనని ప్రపంచదేశాల జర్నలిస్టుల ముందే కుండబద్దలు కొట్టారు. "ప్రతిదానికీ మీ భౌగోళిక స్థానాన్ని బ్లేమ్ చేయడం ఆపండి. అది మీ చేతకానితనాన్ని దాచుకోవడానికి వెతుక్కుంటున్న వంక మాత్రమే. మీ సమస్యలన్నీ మీ పాలకుల, సైన్యం తాలూకు ఘోరమైన పరిపాలనా లోపాల వల్ల వచ్చినవే తప్ప సరిహద్దుల వల్ల కాదు అని చెప్పి పాకిస్తాన్ జర్నలిస్టు నోరు మూయించేశారు. అక్కడితో ఆగలేదు.. పాకిస్తాన్‌కు అంతర్జాతీయ సమాజంలో దక్కుతున్న ప్రాధాన్యత దాని సామర్థ్యం వల్ల కాదని, కేవలం దాని చేతిలో ఉన్న వినాశకరమైన ఆయుధాల భయం వల్లేనని కుండబద్దలు కొట్టారు.

ఇటీవల అమెరికా, ఇరాన్ మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందం కోసం పాక్ మధ్యవర్తిత్వం వహించింది. దీనిని చూపించి.. తాము అంతర్జాతీయంగా ఏదో పెద్ద వెలుగు వెలిగిపోతున్నామని విర్రవీగింది. దీనిపైనా కౌసికన్ వ్యంగ్యంగా స్పందించారు. "పాకిస్తాన్ దౌత్యపరమైన అవకాశాన్ని చూసి చాలా చురుగ్గా వాడుకుంది. అమెరికా దృష్టిలో పడటానికి బాగానే ప్లాన్ చేసింది. కానీ, ఆ తాత్కాలిక దౌత్య నాటకాలు పాకిస్తాన్ ప్రజల ఆకలి తీర్చలేవని ఎద్దేవా చేశారు. కౌసికన్ అన్న మాటలు అక్షర సత్యాలు. అంతర్జాతీయంగా ఎంత డ్రామా ఆడినా.. దేశంలో ఉన్న సామాన్యుడి పరిస్థితి మారలేదు. "అమెరికా మిమ్మల్ని మెచ్చుకుంటేనో, లేక ఇరాన్ పొగిడితేనో పాకిస్తాన్‌లో ఉన్న పేదవాడికి తిండి దొరకదు. మీ దేశంలో ప్రాథమిక సమస్యలు అలానే ఉన్నాయి. ముందు మీ ప్రజల కడుపు నింపడం నేర్చుకోండి" అంటూ సింగపూర్ మాజీ రాయబారి ఇచ్చిన చురకలకు పాకిస్తాన్ ప్రతినిధుల వద్ద సమాధానమే లేకుండా పోయింది. విమానం హైజాక్ అయిందని ఫోన్ చేస్తే మా పీఎం మేడం నిద్రపోతున్నారని చెప్పడాన్ని గుర్తుచేసి కడిగిపారేశారాయ.

ఒకప్పుడు పాశ్చాత్య దేశాల ముందు మొసలి కన్నీరు కారిస్తే కాసులు కురిసేవి. కానీ, పాకిస్తాన్ గురించి, ఆ దేశ ఉగ్రవాద కుట్రల గురించి పూర్తిగా తెలిసిన సింగపూర్ మాజీ రాయబారి ముందు ఆ పప్పులు ఉడకలేదు. మొత్తానికి.. అంతర్జాతీయ వేదికలపై ప్రతిసారీ విక్టిమ్ ముసుగు వేసుకుని సానుభూతి పొందే పాక్ డ్రామాలకు ఈసారి గ్లోబల్ స్టేజ్‌పైనే గట్టి బ్రేక్ పడింది. పొరుగు దేశాలపై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్న పాకిస్తాన్ ప్రతినిధులకు.. సింగపూర్ మాజీ రాయబారి బిలహరి కౌసికన్ ఇచ్చిన కౌంటర్ ఒక మైండ్ బ్లోయింగ్ లెసన్‌గా నిలుస్తుందనడంలో సందేహం లేదు. సొంత దేశంలో ఉగ్రవాదాన్ని పోషిస్తూ, ఆర్థిక వ్యవస్థను నట్టేట ముంచి, ప్రజలను ఆకలితో అలమటించేలా చేసిన పాలకులు.. ఇంకా భౌగోళిక స్థానాన్ని వంక పెట్టడం ఎంత హాస్యాస్పదమో ప్రపంచ దేశాల ముందే రుజువైంది. ఇప్పటికైనా అంతర్జాతీయ వేదికలపై దౌత్య నాటకాలు, విక్టిమ్ కార్డ్ కుట్రలు ఆపి.. సొంత దేశాన్ని బాగుచేసుకోవడంపై దృష్టి పెట్టకపోతే పాక్ పతనాన్ని ఎవరూ ఆపలేరు.

 

Published : 
  • 7 July 2026, 1:29 PM IST