Top story: దేశద్రోహం సెక్షన్ల ఉచ్చులో ప్రశ్న రావణ్.. ఏళ్ల తరబడి జైల్లోనే ఆ ప్రముఖులు రావణ్‌పై మోపిన చట్టం ఎంత డేంజర్ అంటే..!

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యవహారంలో.. యూట్యూబర్ ప్రశ్న రావణ్ చుట్టూ ఉచ్చు పూర్తిగా బిగిసిపోయింది

Post Published By: dialnews
Updated : 7 July 2026, 9:01 AM IST

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యవహారంలో.. యూట్యూబర్ ప్రశ్న రావణ్ చుట్టూ ఉచ్చు పూర్తిగా బిగిసిపోయింది. నాలుగు కేసుల్లో కోర్టుల నుండి బెయిల్స్ తెచ్చుకున్నప్పటికీ.. ఐదోసారి గన్నవరం పోలీసులు ఆయనపై ప్రయోగించిన అస్త్రం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అదే.. అత్యంత కఠినమైన చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం.. అంటే UAPA లేదా 'ఉపా' చట్టం. ఈ చట్టం కింద ఒక్కసారి కేసు నమోదైతే.. ఇక ఇప్పట్లో బయటకు రావడం అనేది దాదాపు అసాధ్యం అని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అసలు ఈ ఉపా చట్టం ఎందుకు అంత భయంకరమైనది? గతంలో ఈ చట్టం కింద జైలుకు వెళ్లి ఇప్పటికీ బయటకు రాలేని ఆ ప్రముఖులు ఎవరు? ఈ వీడియోలో క్లియర్ కట్‌గా చూద్దాం.

ప్రశ్న రావణ్ కేవలం రాజకీయ నాయకులను విమర్శించడమే కాకుండా.. నిషేధిత నక్సలైట్ భావజాలం ఉన్న శక్తులతో సంబంధాలు కలిగి ఉన్నారనేది పోలీసుల ప్రధాన ఆరోపణ. నటుడు ప్రకాష్ రాజ్‌తో మాట్లాడిన ఆడియో, వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడం.. రాష్ట్రాన్ని అస్థిరపరిచే పెద్ద కుట్ర కోణంలో దర్యాప్తుకు దారితీసింది. నిఘా వర్గాల సమాచారంతో గన్నవరం పోలీసులు ఆయనపై ఉపా చట్టంలోని సెక్షన్ 39 కింద కేసు నమోదు చేశారు. ఈ చట్టం కింద కేసు నమోదైతే సాధారణ బెయిల్ రూల్స్ అస్సలు వర్తించవు. పోలీసులు కోర్టుకు సమర్పించే సాక్ష్యాల తీవ్రతను బట్టి.. నిందితుడు నిర్దోషి అని నిరూపించుకునే వరకు బెయిల్ రావడం దాదాపు అసాధ్యం.

ఉపా’ చట్టం ఎంత కఠినమైనదో అర్థం కావాలంటే.. గతంలో ఈ చట్టం కింద అరెస్ట్ అయి ఏళ్ల తరబడి జైల్లోనే ఉండిపోయిన వారి చరిత్ర చూడాలి.

1. ఉమర్ ఖాలిద్: ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాజీ విద్యార్థి నేత ఉమర్ ఖాలిద్‌ను 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో 'ఉపా' చట్టం కింద అరెస్ట్ చేశారు. ఇప్పటికి దాదాపు ఐదు సంవత్సరాలు గడుస్తున్నా.. ఆయనకు ఇప్పటికీ రెగ్యులర్ బెయిల్ రాలేదు. ఇప్పటికీ ఆయన తిహార్ జైల్లోనే విచారణ ఎదుర్కొంటున్నారు.

2. భీమా కోరెగావ్ కేసు నిందితులు: మహారాష్ట్రలోని భీమా కోరెగావ్ హింసాత్మక ఘటనలు, ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో.. 2018లో ఎంతోమంది మేధావులు, హక్కుల కార్యకర్తలపై ఈ ఉపా చట్టాన్ని ప్రయోగించారు. అందులో ప్రముఖ కవి వరవరరావు, ప్రొఫెసర్ సాయిబాబా లాంటి వారు బెయిల్ లేదా విడుదల కోసం ఏళ్ల తరబడి జైల్లో నరకం అనుభవించాల్సి వచ్చింది. అలాగే హక్కుల కార్యకర్త జ్యోతి జగతాప్, మరికొందరు నేతలు ఇప్పటికీ జైలులోనే విచారణ ఖైదీలుగా మగ్గుతున్నారు.

ఈ ఉపా చట్టం ప్రకారం.. పోలీసులు నిందితుడిని ఛార్జ్‌షీట్ దాఖలు చేయకుండానే ఏకంగా 180 రోజుల పాటు అంటే 6 నెలల పాటు జైల్లో ఉంచి విచారించవచ్చు. సాధారణ కేసుల్లో లాగా 14 రోజుల్లో బెయిల్ పిటిషన్ వేసి బయటకు వచ్చే ఛాన్సే ఉండదు. ఒకవేళ బెయిల్ కావాలంటే సుప్రీంకోర్టు స్థాయి వరకు వెళ్లాలి, అక్కడ కూడా నేరం చేయలేదని ప్రాథమికంగా రుజువైతేనే బెయిల్ ఇస్తారు. రావణ్ కేసులో వరుసగా పోలీసులు పాత కేసులను తిరగదోడుతుండటం, దేశద్రోహం లాంటి తీవ్రమైన సెక్షన్లను చేర్చడంతో.. ఆయనకు కనీసం వచ్చే 6 నెలల నుండి ఏడాది పాటు బెయిల్ రావడం చాలా కష్టమనేది న్యాయ నిపుణుల ఖచ్చితమైన అభిప్రాయం. భావప్రకటన స్వేచ్ఛకు రాజ్యాంగ పరిరక్షణ ఉన్నప్పటికీ.. అది చట్టవ్యతిరేక చర్యలకు వర్తించదని పోలీసులు చెబుతుంటే.. ప్రతిపక్షాలు మాత్రం ఇది కక్షసాధింపు చర్య అని మండిపడుతున్నాయి.

Published : 
  • 7 July 2026, 9:01 AM IST