భారత్ లక్ష్యంగా పాకిస్తాన్, టర్కీ మరింత దగ్గరవుతున్నాయా? భారీ వాణిజ్య ఒప్పందం పేరుతో నెక్స్ట్ లెవెల్ డిఫెన్స్ డీల్స్ చేసుకుంటున్నాయా? 5 బిలియన్ డాలర్ల వాణిజ్య ఒప్పందం కేవలం పైకి కనిపించే ముసుగు మాత్రమేనా? ఈ డీల్ వెనుక అసలు లక్ష్యంగా భారతేనా? అవుననే అంటున్నాయి అంతర్జాతీయ నివేదికలు. ప్రస్తుతం కేవలం 1.3 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్య ఒప్పందాన్ని ఏకంగా 5 బిలియన్ డాలర్లకు చేర్చాలనుకోవడంవెనుక.. భారత్‌ను లక్ష్యంగా చేసుకునే ప్లాన్ ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఇంతకూ, భారత్ లక్ష్యంగా పాక్, టర్కీ అసలేం ప్లాన్ చేస్తున్నాయి? వాణిజ్య ఒప్పందం పెంపు పేరుతో మిలిటరీ సహకారానికి సిద్ధమవుతున్నాయా?
పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ టర్కీ పర్యటన కేవలం రొటీన్ దౌత్య పర్యటన కాదు. దీని వెనుక భారత్‌ను లక్ష్యం చేసుకునే కుట్రలున్నాయి. అందుకు ఆ దేశాల మధ్య జరిగిన ఒప్పందాలే ఒక ఉదాహరణ. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ప్రస్తుతం ఉన్న 1.3 బిలియన్ డాలర్ల వాణిజ్యాన్ని ఏకంగా 5 బిలియన్ డాలర్లకి పెంచాలన్న నిర్ణయం తీసుకున్నారు. ఈ పెంపు వెనుక అసలు టార్గెట్ రక్షణ రంగమే. ఇరు దేశాల చర్చల అనంతరం ఎర్డోగాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. "మా ఆర్థిక బంధానికి సైనిక, సాంకేతిక సహకారమే పునాది అని ఆయన ప్రకటించారు. టర్కీ దగ్గర సూసైడ్ డ్రోన్ టెక్నాలజీ ఉంది. టర్కీకి చెందిన బైరక్టార్ డ్రోన్లు ఉక్రెయిన్ యుద్ధంలో ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ఈ కిల్లర్ డ్రోన్ల సాంకేతికతను పాకిస్తాన్‌కు ధారాదత్తం చేసేందుకు ఈ ఒప్పందం ద్వారా రహస్య రోడ్‌మ్యాప్ సిద్ధమైందని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ డీల్ అంతటితో ఆగడం లేదు.
కరాచీలో ఒక ప్రత్యేక డిఫెన్స్ ఎకనామిక్ జోన్ ఏర్పాటుకు ప్రణాళికలు జరుగుతున్నాయి. అంటే.. టర్కీ సాంకేతికతతో పాకిస్తాన్ గడ్డపైనే క్షిపణులు, నౌకలు, డ్రోన్లను ఉమ్మడిగా తయారు చేస్తారు. దీనివల్ల పాకిస్తాన్ సైన్యానికి అత్యాధునిక ఆయుధాలు అతి తక్కువ ధరకే, నేరుగా అందుబాటులోకి వస్తాయి.భారత అంతర్గత విషయాల్లో వేలు పెట్టడం టర్కీకి ఒక అలవాటుగా మారింది. 2019లో భారత్ ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుండి, ఐక్యరాజ్యసమితి వేదికపై పాకిస్తాన్ కంటే ఎక్కువగా మొరుగుతోంది టర్కీనే. ముస్లిం ప్రపంచానికి తానే సరికొత్త ఖలీఫా కావాలనే ఎర్డోగాన్ పిచ్చితో.. కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయంగా వివాదాస్పదం చేసేందుకు పాకిస్తాన్‌కు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు.
ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ వేదికపై సౌదీ అరేబియా, యూఏఈ లాంటి దేశాలు భారత్‌తో సత్సంబంధాల కోసం కాశ్మీర్ విషయంలో మౌనంగా ఉంటుంటే.. టర్కీ మాత్రం పాకిస్తాన్‌తో కలిసి భారత్‌కు వ్యతిరేకంగా తీర్మానాలు చేయిస్తోంది. పాకిస్తాన్ అజెండాను తన భుజాలపై వేసుకుని గ్లోబల్ లాబీయింగ్ చేస్తోంది టర్కీ. ఇది కేవలం మాటలకే పరిమితం కాలేదు. గతేడాది ఆపరేషన్ సిందూర్ సమయంలో, భారత సరిహద్దు పోస్టులపై నిఘా పెట్టేందుకు పాకిస్తాన్ ఆర్మీ టర్కీ డ్రోన్లను వాడినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు నిర్ధారించాయి. పంజాబ్, కశ్మీర్ సరిహద్దుల్లోకి డ్రగ్స్, ఆయుధాల సరఫరాకు కూడా టర్కీ డ్రోన్ల సహాయం తీసుకుంటున్నారనేది ఓపెన్ సీక్రెట్. అయితే, ఈ కుట్రలను భారత్ ఎప్పుడో పసిగట్టింది. టర్కీకి చెక్ పెట్టే వ్యూహాలనూ తెరపైకి తెచ్చింది.
టర్కీ-పాక్ కూటమికి కౌంటర్‌గా ఢిల్లీ నెక్స్ట్ యాక్షన్ షురూ చేసింది. భారత్ శత్రువులతో చేతులు కలుపుతున్న అంకారాకు దాని శత్రువులతోనే చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే టర్కీ శత్రు దేశం గ్రీస్‌తో భారత్ ఊహించని రీతిలో రక్షణ సంబంధాలను బలోపేతం చేసుకుంది. టర్కీ ఆధిపత్యాన్ని సవాల్ చేస్తూ మెడిటరేనియన్ సముద్రంలో భారత నావికాదళం, గ్రీస్ దళాలతో కలిసి భారీ యుద్ధ విన్యాసాలు నిర్వహించింది. టర్కీ కంటికి నలుసులా మారిన గ్రీస్‌కు భారత్ రక్షణ కవచంగా మారుతోంది. శత్రువుకు శత్రువు మిత్రుడు అనే సూత్రంతో టర్కీ సరిహద్దుల్లోనే భారత్ తన జెండాను పాతేసింది. గ్రీస్ మాత్రమే కాదు.. టర్కీ ఆక్రమించుకున్న సైప్రస్‌తో కూడా భారత్ చేతులు కలిపింది. అంతర్జాతీయ వేదికలపై సైప్రస్ సార్వభౌమాధికారానికి భారత్ పూర్తి మద్దతు ప్రకటించింది. టర్కీ ఎప్పుడైనా కశ్మీర్ ప్రస్తావన తెస్తే.. భారత్ వెంటనే సైప్రస్ అంశాన్ని లేవనెత్తి టర్కీ నోరు మూయిస్తోంది.
ఈ వ్యూహంలో అత్యంత కీలకమైన ఘట్టం అర్మేనియా. టర్కీ, పాకిస్తాన్ కలిసి అజర్‌బైజాన్‌కు మద్దతు ఇస్తూ అర్మేనియాపై దాడులు చేయించాయి. అక్కడ టర్కీ డ్రోన్లు అర్మేనియా సైన్యాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ తరుణంలో అర్మేనియా భారత్‌ను సహాయం కోరింది. భారత్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్వదేశీ సాంకేతికతతో తయారైన పినాక మల్టీ-బారెల్ రాకెట్ లాంచర్లు, యాంటీ-డ్రోన్ వ్యవస్థలు, అత్యాధునిక రాడార్లను వందల మిలియన్ డాలర్ల ఒప్పందంతో అర్మేనియాకు సరఫరా చేసింది. సీన్ కట్‌చేస్తే అర్మేనియా సరిహద్దుల్లో భారత ఆయుధాలు గర్జిస్తూ, టర్కీ-పాక్ కూటమి ఆయుధాలను ముక్కలు ముక్కలు చేస్తున్నాయి. ఇది టర్కీ సైనిక అహంకారానికి భారత్ ఇచ్చిన చెంపదెబ్బ. భారత్ లక్ష్యంగా టర్కీ ఏమాత్రం తోక జాడించినా ఇదే రిపీట్ అవుతుంది.