బయట పడ్డ కానిస్టేబుల్‌ జయశాంతి అసలు బాగోతం

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 24, 2026 | 04:19 PMLast Updated on: Jan 24, 2026 | 4:59 PM

The Case Involving Jayashanthi A Woman Constable From Rangampet Has Now Become A Major Controversy

రంగంపేట మహిళా కానిస్టేబుల్ జయశాంతి వ్యవహారం ఇప్పుడు తీవ్ర వివాదంగా మారింది.. చంటి బిడ్డను ఎత్తుకుని.. ట్రాఫిక్‌ క్లియర్‌ చేసిన ఓ వీడియో బయటకు రావడంతో ఆమె వైరల్‌గా మారిపోయింది. ఆమెకు మద్దతుగా ఎంతోమంది పోస్టులు పెట్టారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా ఆమెను అభినందించారు. హోం మంత్రి అనిత స్వయంగా ఆమెను ఇంటికి పిలిచి భోజనం పెట్టి మరి సన్మానించారు. కానీ, ఇప్పుడు అసలు కథ బయటకు రావడంతో పెద్ద దుమారమే రేగుతోంది. అయితే, గత ఏడాది జరిగిన డీఎస్సీలో తప్పుడు సర్టిఫికెట్‌తో ఉద్యోగం పొందింది జయశాంతి.

కానిస్టేబుల్‌గా ఉన్న భర్త తాతారావు సంపాదన దాచి.. తండ్రిని సంరక్షకుడిగా ప్రస్తావిస్తూ EWS సర్టిఫికెట్ పొందినట్లు నిర్ధారణ అయింది. విచారణ చేసి డీఎస్సీ ఉద్యోగం రద్దు చేశారు విద్యాశాఖ అధికారులు. జయశాంతి ప్రభుత్వాన్ని మోసం చేసిందని.. చర్యలు తీసుకోవాలని తూర్పుగోదావరి ఎస్పీకి రిఫర్ చేశారు. ఇక, నకిలీ ఐడీ కార్డుతో ఎస్సైగా చలామణి అవుతున్న కామేశ్వరరావు అనే హెడ్ కానిస్టేబుల్‌కి సహకారం అందించింది జయశాంతి. రీసెంట్‌గా బిడ్డను ఎత్తుకుని ట్రాఫిక్‌ క్లియర్‌ చేసిన విషయం కూడా ప్లాన్‌ ప్రకారం చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ నుంచి పల్నాడు SPF కి జయశాంతి భర్త తాతారావు గతంలో బదిలీ అయ్యాడు. జయశాంతి కూడా ఇదే క్రమశిక్షణా చర్యల్లో భాగంగా రైల్వే నుంచి లా అండ్‌ ఆర్డర్‌కు బదిలీ అయ్యింది.

భార్యాభర్తలపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా చర్యలు తీసుకోవడం, DSCలో తప్పుడు సర్టిఫికేట్‌తో ఉద్యోగం సంపాదించడంతో ఆమె మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో చంటి బిడ్డను ఎత్తుకుని ట్రాఫిక్ క్లియర్ చేసినట్లు హడావిడి చేసి మంచి పేరు కొట్టేసేందుకు ప్రయత్నించిందని విమర్శలు వస్తున్నాయి. తన పరిధి కాకపోయినా చంటి బిడ్డను ఎత్తుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారని ఇంటికి ఆహ్వానించి కానిస్టేబుల్ జయశాంతి దంపతులను సన్మానించారు హోంమంత్రి అనిత. ఇప్పుడు వివాదం బయటకు రావడంతో ఆమె ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.