ఎన్నికల్లో గెలవడం ఒక యుద్ధమైతే ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం మరో యుద్ధం. ఇప్పుడు తమిళనాడు కొత్త సీఎం విజయ్ ముందున్న పెద్ద సవాలు ఇదే. ఎన్నికల ప్రచారంలో విజయ్ ఇచ్చిన హామీల విలువ లక్ష కోట్ల పైమాటే. ఇప్పటికే ఆర్థిక లోటుతో సతమతమవుతున్న రాష్ట్రానికి, ఈ కొత్త హామీలు పెను సవాలుగా మారుబోతున్నాయా ? ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ అందుకున్న విజయ్ ఈ సవాలును ఎలా అధిగమిస్తారు అనేదే ఇప్పుడు తమిళ పాలిటిక్స్‌లో మిలియన్ డాలర్ క్వశ్చన్.విజయ్ ప్రకటించిన ప్రధాన హామీలలో మహిళలకు ఇచ్చే నెలవారీ సాయం పెంపు ఒకటి. ప్రస్తుతం అందుతున్న మొత్తాన్ని 1,000 నుంచి 2,500లకు పెంచుతామని ఆయన హామీ ఇచ్చారు. దీనివల్ల వార్షిక వ్యయం 14 వేల 411 కోట్ల నుండి ఏకంగా 36 వేల 29 కోట్లకు పెరుగుతుంది. అంటే కేవలం ఈ ఒక్క పథకం ద్వారానే ఖజానాపై అదనంగా 21 వేల 618 కోట్ల భారం పడనుంది. ఇక విద్యుత్ రంగానికి సంబంధించి కూడా విజయ్ భారీ హామీలే ఇచ్చారు.
ప్రస్తుతం ఉన్న 100 యూనిట్ల ఉచిత విద్యుత్తుకు పెంచి 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తామన్నారు. దీనివల్ల వార్షిక వ్యయం 7 వేల 752 కోట్ల నుంచి 12 వేల కోట్లు దాటుతుంది. అంటే 4 వేల 248 కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా.వృద్ధులు, మహిళలపై హామీల జల్లు కురిపించారు విజయ్. వృద్ధాప్య మరియు ఇతర సామాజిక పెన్షన్లు పెంచుతామని ప్రకటించారు. వృద్ధాప్య పింఛన్లు ప్రస్తుతం ఇస్తున్న 1,200ను 3,000లకు పెంచడం వల్ల వ్యయం 4 వేల 366 కోట్ల నుంచి 6 వేల 549 కోట్లకు పెరుగుతుంది. వితంతు పింఛన్ల వల్ల అదనంగా 1,829 కోట్ల భారం పడనుంది. దివ్యాంగుల పింఛన్లపై అదనంగా 504 కోట్ల వ్యయం పెరుగుతుంది. సామాన్య గృహిణుల కోసం ఏడాదికి 6 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామన్న హామీతో 7 వేల 74 కోట్ల భారం పడనుంది. రైతులకు ఏడాదికి 15 వేలు పంపిణీ పథకం ద్వారా 1,941 కోట్లు, ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా కల్పించడం వల్ల అదనంగా 382 కోట్ల ఖర్చు అవుతుంది.
పేద యువతుల వివాహానికి 8 గ్రాముల బంగారం ఇచ్చే పథకానికి మరో 600 కోట్లకు పైగా ఖర్చవుతుంది.యువతను ఆకట్టుకునేందుకు భారీ హామీలు ప్రకటించారు. నిరుద్యోగ యువతకు నెలకు 4,000 భృతి, ఇంటర్న్‌షిప్ చేసే వారికి స్టైపండ్ 5,000 నుంచి 8,000 వరకు ఇవ్వాలని నిర్ణయించారు. 5 లక్షల కొత్త ఉద్యోగాల సృష్టితో పాటు, ప్రభుత్వ కార్యాలయాల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న నర్సులను మరియు ఇతర సిబ్బందిని రెగ్యులర్ చేస్తామని ప్రకటించారు. పాత పెన్షన్ విధానం "ఓపీఎస్" అమలును కూడా పరిశీలిస్తామని టీవీకే హామీ ఇచ్చింది. ఇక మత్స్యకార మరియు కార్మిక వర్గాలకు ఇచ్చిన హామీలు కూడా ఖజానాపై భారం పెంచేస్తున్నాయి. మత్స్యకారుల వేట నిషేధ సమయంలో ఇచ్చే మొత్తాన్ని నెలకు 27,000లకు పెంచడం, పడవలకు రాయితీతో కూడిన డీజిల్ సరఫరా వంటివి ఇందులో ఉన్నాయి.
అంగన్‌వాడీ కార్యకర్తలకు నెలకు 18,000, పారిశుధ్య కార్మికులకు 10,000 కనీస వేతనం వంటి హామీలు కూడా ఖజానాపై మరింత భారాన్ని పెంచనున్నాయి.ఈ భారీ హామీల అమలకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. రాష్ట్రంలో ఇప్పటికే లక్షా 22 వేల కోట్ల ఆర్థిక లోటు ఉందని, ప్రతి ఏటా బడ్జెట్ లోటు పెరుగుతూనే ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అదనంగా లక్ష కోట్ల రూపాయల వ్యయాన్ని తట్టుకోవడం సాధ్యమేనా అన్నది ఆర్థిక నిపుణుల సందేహం. విజయ్ తన రాజకీయ రంగ ప్రవేశంతోనే ఇలాంటి భారీ హామీలను ప్రకటించి సంచలనం సృష్టించినా, వీటిని ఆచరణలో పెట్టేందుకు అవసరమైన ఆర్థిక వ్యూహాలు ఏమిటన్నది రానున్న రోజుల్లో చూడాల్సి ఉంది.