పశ్చిమ బెంగాల్ కొత్త సీఎం సువేందు అధికారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మమతా బెనర్జీ పదిహేనేళ్లలో చేయని పనిని ఆయన రెండే రోజుల్లో పూర్తి చేశారు. దేశ రక్షణ కోసం బీఎస్ఎఫ్కు ల్యాండ్ బదిలీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సువేందు నిర్ణయంతో దాదాపు 127 కిలోమీటర్ల మేర బీఎస్ఎఫ్ కోసం కేంద్ర హోంశాఖ ఫెన్సింగ్ వేయనుంది. రానున్న 45 రోజుల్లో బీఎస్ఎఫ్కు భూమిని అప్పగించనున్నట్టు సీఎం సువేందు తెలిపారు. గతంలో మమతా బెనర్జీ సర్కార్ బీఎస్ఎఫ్కు భూమి ఇవ్వడంలో నిర్లక్ష్యం చూపించిందని ఆరోపణలు ఉన్నాయి. 127 కిలోమీటర్లకు గాను కేవలం ఎనిమిది కిలోమీటర్లే మమత సర్కార్ కేటాయింపులు చేశారు. ఈ క్రమంలోనే తాము అధికారంలోకి వస్తే బంగ్లా బోర్డర్లో ఫెన్సింగ్‌కు భూమి కేటాయిస్తామని సువేందు హామీ ఇచ్చారు. చెప్పినట్టే ఆ దిశగా నిర్ణయం తీసుకున్నారు.
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు సుమారు 4వేల 96 కిలోమీటర్ల పొడవు ఉంటుంది, ఇందులో కేవలం పశ్చిమ బెంగాల్‌తోనే 2వేల 217 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఈ ప్రాంతంలో ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం భద్రతా పరంగా, పరిపాలనా పరంగా అత్యంత కీలకం. బంగ్లాదేశ్ నుండి పశ్చిమ బెంగాల్లోకి అక్రమ వలసలు దశాబ్దాలుగా పెద్ద సమస్యగా ఉన్నాయి. సరిహద్దు గ్రామాలు ఒకే రకమైన సంస్కృతి, భాషను కలిగి ఉండటం వల్ల చొరబాటుదారులను గుర్తించడం కష్టంగా మారింది. కంచె ఉండటం వల్ల ఈ అక్రమ రాకపోకలను భౌతికంగా అడ్డుకనే వీలుంటుంది. సరిహద్దులో ఫెన్సింగ్ లేని చోట అక్రమ రవాణా విపరీతంగా జరుగుతుంది. భారత్ నుండి బంగ్లాదేశ్‌కు పశువుల అక్రమ రవాణా ప్రధాన సమస్య. దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే నకిలీ నోట్లు ఈ సరిహద్దుల ద్వారానే ఎక్కువగా సరఫరా అవుతుంటాయి. ఫెన్సింగ్ లేని ప్రాంతాల ద్వారా డ్రగ్స్ రవాణా సులభం అవుతుంది. తీవ్రవాద శక్తులు సరిహద్దు దాటి దేశంలోకి ప్రవేశించి దాడులకు పాల్పడకుండా చూడటంలో ఈ కంచె కీలక పాత్ర పోషిస్తుంది. ఇది తెలిసి కూడా మమత సర్కార్ భూమి ఎందుకు కేటాయించలేదు?
కొన్నేళ్లుగా భూమిని బదిలీ చేయడానికి మమత ప్రభుత్వం మొగ్గు చూపకపోవడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ పరిధిని 15 కిలోమీటర్ల నుండి 50 కిలోమీటర్ల వరకు పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది రాష్ట్ర హక్కులను కాలరాయడమేనని ఆమె వాదించారు. రైతుల నుంచి భూమిని సేకరించడం వల్ల వారికి అన్యాయం జరుగుతుందని గతంలో అడ్డంకులు చెప్పారు. సరిహద్దు గ్రామాల్లో నివసించే ప్రజలకు ఫెన్సింగ్ వల్ల సాగుభూమి దూరం అవుతుందని, వారి జీవనోపాధి దెబ్బతింటుందని రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. అసలు విషయాలు ఇవేవీ కావు.. అక్రమ వలసలదారులను ఓటర్లుగా మలచు కోవడమే మమత ప్రభుత్వం లక్ష్యం అని బీజేపీ ఆరోపిస్తూ వచ్చింది. గతేడాది లోక్‌సభ సాక్షిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. మమత ప్రభుత్వం అక్రమ చొరబాట్లపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదనీ, కంచె ఏర్పాటుకు భూమిని కూడా ఇవ్వలేదని విమర్శించారు. అక్రమ వలసదారులకు టీఎంసీ ప్రభుత్వం ఆధార్ కార్డులు అందించి వివిధ ప్రాంతాల్లో వారికి సౌకర్యాలు కల్పిస్తోంది. దక్షిణ 24 పరగణాలలో అధిక సంఖ్యలో ఆధార్ కార్డులను గుర్తించాం. అని లోక్‌సభలో అమిత్ షా ప్రకటించారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏర్పడటంతో వారం రోజులు తిరక్కుండానే బీఎస్ఎఫ్కు ల్యాండ్ బదిలీ చేయడానికి అంగీకారం తెలిపింది.
అయితే.. బెంగాల్ సరిహద్దులో కంచె వేయడం అంత సులభం కాదు, ఎందుకంటే.గంగా, పద్మ వంటి నదులు సరిహద్దుగా ఉన్న చోట కంచె వేయడం సాధ్యం కాదు. దీనిని 'రివరైన్ బోర్డర్' అంటారు. కొన్ని చోట్ల సరిహద్దు రేఖ ఇళ్ల మధ్య నుండి వెళ్తుంది. అక్కడ నివసించే ప్రజల సాగు భూములు సరిహద్దుకు అటువైపు ఉండటం వల్ల కంచె నిర్మాణం సంక్లిష్టంగా మారే అవకాశముంది.భౌతిక కంచె వేయలేని చోట ప్రభుత్వం ప్రస్తుతం కాంప్రెహెన్సివ్ ఇంటిగ్రేటెడ్ బోర్డర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉపయోగిస్తోంది. ఇందులో థర్మల్ ఇమేజర్లు, ఇన్ఫ్రారెడ్ సెన్సార్లు, అండర్ వాటర్ సెన్సార్లు ఉంటాయి. ఇవి ఎటువంటి అడ్డంకులు వచ్చినా వెంటనే భద్రతా దళాలను అలర్ట్ చేస్తాయి. అలాగే, నదులు సరిహద్దుగా ఉన్న చోట్ల మొసళ్లు, పాములను విడిచిపెట్టాడు. అయితే, ల్యాండ్ బదిలీకి గ్రీన్ సిగ్నల్ పడటంతో వీలైనంత ఎక్కువ దూరం కంచె నిర్మించడానికి అడుగులు పడతాయి. అప్పుడు బంగ్లాదేశీ అక్రమ వలసదారుల ఆట ముగిసే అవకాశాలూ ఉంటాయి. ఏదేమైనా పదిహేనేళ్లపాటు అధికారంలో ఉండికూడా మమత ప్రభుత్వం చేయని పనిని సువేందుకు అధికారి చేసి చూపించారు.