Top story: ద్రావిడ కోటపై దళపతి దండయాత్ర రజనీ వల్ల కాలేదు…పవన్ సాధించలేదు మోస్ట్ పవర్‌ఫుల్ స్టార్టప్…!

తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఇద్దరు వ్యక్తుల చుట్టూనే తిరిగాయి. కరుణానిధి వర్సెస్ ఎంజీఆర్.. ఆ తర్వాత కరుణానిధి వర్సెస్ జయలలిత. కానీ ఇప్పుడు ఆ దిగ్గజాలు లేరు. ఇన్నాళ్ళు అధికారంలో ఉన్న డీఎంకేలో వారసత్వ రాజకీయం పీక్స్‌లో ఉంది

Post Published By: dialnews
Updated : 5 May 2026, 12:28 PM IST

తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఇద్దరు వ్యక్తుల చుట్టూనే తిరిగాయి. కరుణానిధి వర్సెస్ ఎంజీఆర్.. ఆ తర్వాత కరుణానిధి వర్సెస్ జయలలిత. కానీ ఇప్పుడు ఆ దిగ్గజాలు లేరు. ఇన్నాళ్ళు అధికారంలో ఉన్న డీఎంకేలో వారసత్వ రాజకీయం పీక్స్‌లో ఉంది. స్టాలిన్ తర్వాత ఉదయనిధి.. ఇది సామాన్య కార్యకర్తకు మింగుడు పడటం లేదు. జయలలిత మరణం తర్వాత అన్నాడిఎంకే ఆ పార్టీ పది ముక్కలైంది. సరైన నాయకత్వం లేక క్యాడర్ అంతా అయోమయంలో ఉంది. ఈ రాజకీయ శూన్యాన్ని భర్తీ చేసే దమ్మున్న మొనగాడు దళపతి విజయ్ అని తమిళ తంబీలు నమ్మారా..? ఎస్ నేడు వచ్చిన రిజల్ట్ చూస్తే అది నిజమే అనక మానరు.విజయ్ కేవలం ఒక పార్టీని పెట్టలేదు.. ఒక ఆశను కల్పించారు. అందుకే దీన్ని మనం 'మోస్ట్ పవర్‌ఫుల్ స్టార్టప్' అంటున్నాం. విజయ్ రాజకీయాల్లోకి రావడానికి ముందు పదేళ్ల పాటు హోం వర్క్ చేశారు. ఆయన రాజకీయం మూడు కోణాల్లో సాగుతోంది. ఎంజీఆర్ ఛరిష్మా విజయ్ లో ఉందనే మాట బలంగా వినపడుతోంది. పేద ప్రజలకు చేరువవ్వడం, అన్నదానాలు, విద్యార్థులకు ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా 'మక్కల్ తిలగం' ఇమేజ్‌ని విజయ్ సొంతం చేసుకున్నారు. పెరియార్ 'సామాజిక న్యాయాన్ని' తీసుకుంటూనే, ఆయన నాస్తికవాదాన్ని పక్కన పెట్టి, 'ఒక్కడే దేవుడు - అందరూ సమానం' అనే అన్నాదురై నినాదాన్ని ఎత్తుకున్నారు.

కళైంజర్ వాక్చాతుర్యం కూడా విజయ్ సొంతం. విక్రవిండి సభలో విజయ్ మాట్లాడిన తీరు చూస్తే.. ప్రత్యర్థులను విమర్శిస్తూనే, తన సిద్ధాంతాన్ని బలంగా వినిపించే కళైంజర్ శైలి కనిపించింది. ఇక విజయ్ లో జయలలిత మొండితనం కూడా ఉందంటున్నాయి రాజకీయ వర్గాలు. ఎవరికీ భయపడకుండా, ఒంటరి పోరాటం చేస్తానని ప్రకటించడం ద్వారా అమ్మ గారి ఆత్మవిశ్వాసాన్ని గుర్తు చేశారు. విజయ్ తన పార్టీ జెండాపై పెరియార్, కామరాజ్, అంబేద్కర్ ఫోటోలు పెట్టడం ద్వారా.. అటు ద్రావిడ వాదాన్ని, ఇటు అభివృద్ధిని, అటు దళిత ఓటు బ్యాంకును ఒకే తాటిపైకి తెచ్చారు.విజయ్ దగ్గర ఉన్నది 'యువ సైన్యం'. తమిళనాడులో 1.5 కోట్ల మంది కొత్త ఓటర్లు ఉన్నారు. ఈ యూత్ అంతా విజయ్ వెంటే నిలబడింది. తాజా అంతర్గత సర్వేల ప్రకారం.. విజయ్ కి ఒక్క పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా, గ్రామీణ మహిళల్లో కూడా విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఇది 'సైలెంట్ ఓటింగ్'కు దారి తీసింది. తమిళ రాజకీయాల్లో రజనీకాంత్ వంటి దిగ్గజాలు చివరి నిమిషంలో వెనకడుగు వేయగా, కమల్ హాసన్ క్షేత్రస్థాయిలో బలమైన ఓటు బ్యాంకును సృష్టించలేక కేవలం నామమాత్రపు ప్రభావానికే పరిమితమయ్యారు.

అటు ఏపీలో చిరంజీవి తన పార్టీని విలీనం చేసి అధికారం కోసం వేచి చూడగా, పవన్ కళ్యాణ్ అంచెలంచెలుగా ఎదుగుతూ కింగ్ మేకర్ పాత్రకే పరిమితమయ్యారు. కానీ, దళపతి విజయ్ మాత్రం తన తమిళగ వెట్రి కళగం పార్టీతో తొలి ప్రయత్నంలోనే సంచలనం సృష్టించారు. సోమవారం జరుగుతున్న కౌంటింగ్‌లో విజయ్ నేతృత్వంలోని టీవీకే, ఎటువంటి పొత్తులు లేకుండా ఒంటరిగా పోటీ చేసి ఏకంగా 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ, దశాబ్దాల ద్రవిడ కోటలను బద్ధలు కొట్టి, నేరుగా అధికార పీఠం వైపు దూసుకెళ్తున్నారు. స్టార్ పవర్‌ను పక్కా పొలిటికల్ స్ట్రాటజీగా మార్చి, వారసత్వ రాజకీయాలకు చరమగీతం పాడుతూ విజయ్ సాధించిన ఈ విజయం భారత రాజకీయ చరిత్రలోనే అపూర్వం.చరిత్ర ఎప్పుడూ ఒకేలా ఉండదు. 1967లో కాంగ్రెస్‌ని గద్దె దించినప్పుడు ఎవరూ నమ్మలేదు. 1977లో ఎంజీఆర్ కొత్త పార్టీ పెట్టి గెలుస్తాడని ఎవరూ ఊహించలేదు. ఇప్పుడు 2026లో కూడా అదే జరిగింది. విజయ్ సీఎం కావడం అనేది కేవలం ఒక వ్యక్తి గెలుపు కాదు.. ఒక వ్యవస్థపై ప్రజలు చేస్తున్న తిరుగుబాటు. సెయింట్ జార్జ్ కోటపై దళపతి జెండా ఎగిరే రోజు దగ్గర్లోనే ఉంది. దశాబ్దాల ద్రావిడ రాజకీయాల ముద్రను చెరిపివేసి, ఒక బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా విజయ్ అవతరించడం ఖాయమైంది.

Published : 
  • 5 May 2026, 12:28 PM IST