పాకిస్తాన్ పతనం మొదలైందా? దశాబ్దాలుగా పాకిస్తాన్ ఆక్రమణలో నలిగిపోతున్న మన 'పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్'.. అంటే PoK లో ఇప్పుడు ఇస్లామాబాద్ పాలన పునాదులు కదిలిపోతున్నాయి. అక్కడ జరుగుతున్న నిరసనలు ఇప్పుడు పాక్ సైన్యానికి చుక్కలు చూపిస్తున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, POK లోని అత్యంత ప్రభావవంతమైన ప్రజా ఉద్యమ నేత సర్దార్ అమన్ ఖాన్, పాకిస్తాన్ ఆర్మీ గుండెల్లో ఈటె లాంటి నిజాలను గుచ్చారు. 'మా చేతుల్లోకి తుపాకులు ఇచ్చి, మమ్మల్ని ఉగ్రవాదంలోకి నెట్టింది సాక్షాత్తూ మీ పాకిస్తాన్ ఆర్మీయే.. అలాంటిది ఈ రోజు హక్కుల కోసం పోరాడుతుంటే మమ్మల్ని ఉగ్రవాదులు అని పిలుస్తారా?' అంటూ 80 వేల మంది ప్రజల సాక్షిగా పాక్ మిలిటరీ ముసుగును లాగేశారు. అసలు POK లో పాకిస్తాన్‌కు ఎదురవుతున్న ఆ ఊహించని నరకం ఏంటి?
POK లో పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగుతున్న ప్రజా నిరసనలు ఇప్పుడు నెల రోజులకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో రావాలాకోట్ ఈద్గా మైదానంలో జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఒక చారిత్రాత్మక బహిరంగ సభ జరిగింది. ఈ సభకు దాదాపు 80,000 మందికి పైగా స్థానిక ప్రజలు హాజరయ్యారు. ఈ భారీ జనసందోహం ముందు నిలబడి మాట్లాడిన జేఏఏసీ నేత సర్దార్ అమన్ ఖాన్.. పాకిస్తాన్ ఆర్మీ చరిత్రలోనే అతిపెద్ద రహస్యాన్ని బహిరంగంగా పంచుకున్నారు. ఆయన ఏమన్నారంటే.. 'గతంలో కాశ్మీరీల చేతుల్లోకి తుపాకులు వచ్చింది మేం కొనుక్కుంటే కాదు, ప్రతీ ఒక్క కాశ్మీరీ చేతికి గన్స్ ఇచ్చింది సాక్షాత్తూ పాకిస్తాన్ ఆర్మీయే.
మొత్తం పాక్ సైన్యం కలిసి ఇక్కడ ఉగ్రవాదాన్ని పెంచింది. కానీ ఈ రోజు మా హక్కుల కోసం, మా పొట్టకూటి కోసం మేం రోడ్లెక్కితే మాపైనే ఉగ్రవాదులు అనే ముద్ర వేస్తారా? మీ కపట బుద్ధిని ఇకపై సాగనివ్వం' అంటూ గర్జించారు. అమన్ ఖాన్ మాట్లాడుతున్నంత సేపు అక్కడ ఉన్న 80 వేల మంది జనం చప్పట్లు, కేకలతో పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమన్ ఖాన్ కేవలం ఆర్మీని మాత్రమే కాదు, స్థానిక పాక్ సివిల్ అడ్మినిస్ట్రేషన్‌ను కూడా గట్టిగా నిలదీశారు. పాకిస్తాన్ అధికారులు తెరవెనుక ఉగ్రవాద సంస్థలతో ఎలాంటి డీలింగ్స్ నడుపుతున్నారో సాక్ష్యాలతో సహా బయటపెట్టారు. ఈ ఏడాది ప్రారంభంలో రావాలాకోట్ నగరంలో అంతర్జాతీయంగా నిషేధించబడిన 'జైషే మహ్మద్' ఉగ్రవాద సంస్థ ఒక బహిరంగ ఈవెంట్‌ను నిర్వహించింది.
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆ ఉగ్రవాద ఈవెంట్‌కు రావాలాకోట్ డిప్యూటీ కమిషనర్ స్వయంగా అధికారిక అనుమతులు ఇవ్వడమే కాకుండా, ఉగ్రవాదుల రక్షణ కోసం పాక్ పోలీసులతో భారీ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేయించారు! ఆధునిక అసాల్ట్ రైఫిళ్లు, కత్తులు పట్టుకుని ఉగ్రవాదులు నగరం నడిబొడ్డున ర్యాలీలు తీస్తుంటే పాక్ అడ్మినిస్ట్రేషన్ వారికి వందనాలు కొట్టింది. 'శాంతియుతంగా నిరసన తెలిపే మాకు జైళ్లు.. సమాజాన్ని నాశనం చేసే ఉగ్రవాదులకు వీఐపీ ప్రోటోకాలా?' అంటూ అమన్ ఖాన్ ప్రశ్నించడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఈ తిరుగుబాటు కేవలం ఉపన్యాసాలకే పరిమితం కాలేదు, పాకిస్తాన్ ప్రభుత్వానికి జేఏఏసీ నాయకత్వం ఒక తీవ్రమైన అల్టిమేటం జారీ చేసింది.
తాము ప్రతిపాదించిన 38 అంశాల డిమాండ్ చార్టర్‌ను పాక్ ప్రభుత్వం వెంటనే టేబుల్ పైకి వచ్చి, చర్చల ద్వారా అంగీకరించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఇస్లామాబాద్ ప్రభుత్వం గనుక మొండికేస్తే.. POK రాజధాని అయిన ముజఫరాబాద్ వైపు 'మిలియన్ మార్చ్' నిర్వహిస్తామని హెచ్చరించారు. అంతేకాదు.. 'ఒకవేళ మేం గనుక ముజఫరాబాద్ మార్చ్ ప్రారంభించాల్సి వస్తే, అప్పుడు మా డిమాండ్లు కేవలం సబ్సిడీలకే పరిమితం కావు.. పాకిస్తాన్ ఆర్మీ, పాక్ పరిపాలన మొత్తం మా POK భూభాగాన్ని వదిలి శాశ్వతంగా వెళ్ళిపోవాలనే ఏకైక డిమాండ్‌తో ముగిస్తాం' అంటూ పాకిస్తాన్‌కు కోలుకోలేని షాక్ ఇచ్చారు.
అసలు కాశ్మీరీ ప్రజలు ఇంతలా రోడ్లపైకి రావడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? దానికి కారణం పాకిస్తాన్ చేస్తున్న దోపిడీ. POK లో తయారయ్యే కరెంట్, వనరులను పాకిస్తాన్ దోచుకుంటూ.. తిరిగి అక్కడి ప్రజలపైనే ఆకాశాన్ని తాకే కరెంట్ బిల్లులను మోపుతోంది. దానికి తోడు తీవ్రమైన ద్రవ్యోల్బణం, కనీసం తినడానికి గోధుమ పిండి, నిత్యావసర వస్తువులు దొరకని దారుణమైన కొరత ఏర్పడింది. దీంతో సామాన్య కుటుంబాలు, మహిళలు, కాలేజీ విద్యార్థులు అంతా కలిసి స్వచ్ఛందంగా ఈ ఉద్యమంలోకి వచ్చారు. కానీ పాకిస్తాన్ సైన్యం ఎప్పటిలాగే బుల్లెట్లతో ఈ ఉద్యమాన్ని అణచివేయాలని చూసింది. రావాలాకోట్, ముజఫరాబాద్ నగరాల్లో నిరసనకారులపై పోలీసులు జరిపిన లాఠీఛార్జ్, కాల్పుల్లో ఇప్పటికే పలువురు స్థానికులు ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది హాస్పిటల్ పాలయ్యారు. ఈ రక్తపాతమే ఇప్పుడు ప్రజల్లో నరనరాన పాకిస్తాన్ పట్ల ద్వేషాన్ని పెంచేసింది." ఒకప్పుడు పాకిస్తాన్ మాటలు నమ్మి మోసపోయిన POK ప్రజలకు.. ఇప్పుడు అసలు నిజం అర్థమైంది. అందుకే తమను నరకంలోకి నెట్టిన పాకిస్తాన్ నుండి విముక్తి కోరుకుంటున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే రాబోయే రోజుల్లో POK మళ్లీ భారతదేశంలో కలిసిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.