ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో రౌస్ అవెన్యూ కోర్టు నిందితులకు క్లీన్ తీర్పు ఇచ్చింది. తాను అవినీతి పరుడిని కాదంటూ...న్యాయస్థానం తీర్పు తర్వాత మాజీ సీఎం కేజ్రీవాల్ కన్నీటి పర్యంతమయ్యారు. న్యాయ వ్యవస్థపై తాను పెట్టుకున్న నమ్మకం నిలబడిందని కవిత వెల్లడించారు. జైలులో గడిపిన సమయాన్ని ఎవరిస్తారని దర్యాప్తు సంస్థలను ప్రశ్నించారు. 23 మంది నిందితులకు క్లీన్‌చిట్ ఇస్తూనే...సీబీఐ తీరుపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. సరైన ఆధారాలు లేకుండానే ఈ కేసులో పేర్లు చేర్చారని విచారణ సందర్భంగా సీబీఐపై రౌస్ అవెన్యూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.లిక్కర్ కేసులో నిందితులందర్ని న్యాయస్థానం...నిర్దోషులుగా ప్రకటించింది. నిందితులు కుట్ర చేశారని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవంటూ...కేసును కొట్టేసింది న్యాయస్థానం. కోర్టు తీర్పు అనంతరం మాజీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్...కన్నీటిపర్యంతమయ్యారు.
ఆమ్ ఆద్మీ పార్టీకి సీఎం, డిప్యూటీ సీఎం సహా ఐదుగురిని జైలులో పెట్టారని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏనాడూ అవినీతికి పాల్పడలేదన్న ఆయన... అవినీతికి వ్యతిరేకంగా పోరాడినవాళ్లమని గుర్తు చేశారు. ప్రధాని మోడీ కేవలం విపక్షాలపైనే దృష్టి పెట్టారన్న కేజ్రీవాల్... ప్రజల సమస్యలను ప్రధాని ఏమాత్రం పట్టించుకోరని విమర్శించారు. నిరుద్యోగం, ఢిల్లీలో పొల్యూషన్ గురించి మోడీ ఎప్పుడు మాట్లాడరని ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్ష నేతలను రాజకీయంగా వేధించడం గురించి మోడీ ఆలోచిస్తారని ఆరోపించారు. తాను, మనీశ్ సిసోదియా ఇద్దరూ నిజాయితీపరులని కోర్టు చెప్పిందన్నారు. భారత న్యాయ వ్యవస్థపై మాకు పూర్తి నమ్మకం ఉందన్న కేజ్రీవాల్...నిజం గెలుస్తుందని మేం ఎప్పుడూ చెబుతుంటామన్నారు. మోడీ, అమిత్ షా కలిసి ఆప్‌ను అంతం చేయడానికి అతిపెద్ద రాజకీయ కుట్ర పన్నారని ఆప్ అధినేత...తమ పార్టీకి చెందిన ఐదుగురు పెద్ద నాయకులను జైలులో పెట్టడం దుర్మార్గమన్నారు. తాను అవినీతిపరుడు కాదని... జీవితంలో నిజాయితీని మాత్రమే సంపాదించుకున్నట్లు వెల్లడించారు. 153 రోజుల పాటు కేజ్రీవాల్ జైలులో ఉన్నారు. విపక్షాల ప్రచారంతో ఆప్...అధికారాన్ని కోల్పోయింది.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు తీర్పుపై కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. కుటుంబానికి దూరమై, 5 నెలలు జైలులో గడిపిన సమయాన్ని ఎవరు తిరిగిస్తారని ప్రశ్నించారు. కోర్టు తీర్పు రాకుండానే కొందరు అనుచితంగా మాట్లాడారని మండిపడ్డారు. ఈ కేసులో కడిగిన ముత్యంలా బయటకు వస్తానని తెలంగాణ ప్రజలకు...మొదటి నుంచీ చెబుతున్నానని అన్నారు. అందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు తీర్పును వెలువరించిందని గుర్తు చేశారు. న్యాయ వ్యవస్థపై తాను పెట్టుకున్న నమ్మకం నిలబడిందని కవిత వివరించారు. ఇది కేవలం రాజకీయ కక్షతో పెట్టిన కేసు అని తాను ఎన్నోసార్లు చెప్పానన్నారు.
కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంతో...ఇప్పుడు మరింత ఉత్సాహంతో ప్రజలకు సేవ చేస్తానని స్పష్టం చేశారు. సత్యమేవ జయతే అన్నారు మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా. ఈరోజు మరోసారి బాబా సాహెబ్ అంబేడ్కర్ దార్శనిక ఆలోచన, ఆయన రూపొందించిన రాజ్యాంగం పట్ల గర్వపడుతున్నట్లు తెలిపారు. మోడీ జీ మొత్తం పార్టీ, వారి అన్ని సంస్థలు మమ్మల్ని నిజాయితీ లేనివారని నిరూపించడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారని విమర్శించారు. అరవింద్ కేజ్రీవాల్ - తాను నిజాయితీపరులని నిరూపితమైందన్నారు. సిసోడియా 530 రోజులు జైలు జీవితం గడిపారు
విచారణ సందర్భంగా సరైన ఆధారాలు లేకుండానే ఈ కేసులో పేర్లు చేర్చారని విచారణ సందర్భంగా సీబీఐపై రౌస్ అవెన్యూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తిగా లోపభూయిష్టమైన దర్యాప్తు జరిగిందని మండిపడింది. నిందితులు తప్పు చేశారనటానికి సాక్ష్యాధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. తగిన ఆధారాలు లేకుండానే కేసులో ఇరికించారని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈ విషయంలో సీబీఐ అధికారులపైనే దర్యాప్తు జరగాలని అభిప్రాయపడ్డారు. కవిత ఆడిటర్ బుచ్చిబాబు సహా ఇతర నిందితులందరిపై సీబీఐ కేసులు కొట్టివేసింది. నిందితుల డిశ్చార్జ్ పిటిషన్లపై కోర్టులో 45 రోజుల పాటు వాదనలు సాగాయి. సీబీఐ 2022లో తన మొదటి ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది.
ఆ తర్వాత పలు ఛార్జిషీట్‌లను దాఖలు చేసింది. రద్దైన ఎక్సైజ్ పాలసీని తనకు అనుకూలంగా ప్రభావితం చేయడానికి రూ. 100 కోట్లు చెల్లించారని ఏజెన్సీ ఆరోపించింది. మొత్తం 23 మంది నిందితులపై చార్జిషీట్లు దాఖలవ్వగా, వారిలో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోదియా, కవిత, కుల్దీప్ సింగ్, నరేందర్ సింగ్, విజయ్ నాయర్, అభిషేక్ బోయిన్‌పల్లి, అరుణ్ రామచంద్ర పిళ్లై, మూత గౌతమ్, సమీర్ మహేంద్రు, అమన్‌దీప్ సింగ్ ధల్, అర్జున్ పాండే, రాకేశ్ జోషి, దామోదర్ ప్రసాద్ శర్మ, ప్రిన్స్ కుమార్, చాన్‌ప్రీత్ సింగ్ రాయత్, అరవింద్ కుమార్ సింగ్, దుర్గేష్ పాఠక్, అమిత్ అరోరా, వినోద్ చౌహాన్, ఆశిష్ మాథుర్, పి శరత్ చంద్ర రెడ్డి సహా పలువురు ఉన్నారు.