Top stoty: దేశాలను శాసించారు దిక్కులేని చావు చచ్చారు…!

అమెరికా తన యుద్ధ నీతిని పూర్తిగా మార్చేసింది. కేవలం యుద్ధంలో గెలవడమే కాకుండా, తన మాట వినని దేశాధినేతలను గద్దె దించి, తమకు అనుకూలమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం అగ్రరాజ్యం ప్రధాన వ్యూహంగా మారింది. లిబియాలో గడాఫీ, ఇరాక్‌లో సద్దాం హుస్సేన్ లాంటి నేతల విషయంలో అమెరికా ఇదే చేసింది.

Post Published By: dialnews
Updated : 5 March 2026, 12:15 PM IST

అమెరికా తన యుద్ధ నీతిని పూర్తిగా మార్చేసింది. కేవలం యుద్ధంలో గెలవడమే కాకుండా, తన మాట వినని దేశాధినేతలను గద్దె దించి, తమకు అనుకూలమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం అగ్రరాజ్యం ప్రధాన వ్యూహంగా మారింది. లిబియాలో గడాఫీ, ఇరాక్‌లో సద్దాం హుస్సేన్ లాంటి నేతల విషయంలో అమెరికా ఇదే చేసింది. ఇప్పుడు వెనుజులా అధ్యక్షుడు మదురోను అరెస్ట్‌ చేసింది.. ఇరాన్‌లో ఆ దేశ సుప్రీం లీడర్‌ ఖమేనీని ఏకంగా చంపేసింది.ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అంతం అనేది అమెరికా అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. పశ్చిమాసియాలో తమ వ్యూహాలకు అడ్డుకట్ట వేస్తున్నారన్న అక్కసుతో చాలాకాలంగా అమెరికా ఈ పథక రచన చేసింది. అమెరికా వ్యతిరేకతతోనే ఖమేనీ ఇరాన్‌ను సైనికపరంగా అత్యంత శక్తివంతంగా మార్చడంతో పాటు, ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. ముల్లును ముల్లుతోనే తీయాలనే సిద్ధాంతంతో ప్రాక్సీ గ్రూపులను ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ప్రోత్సహించారు. ఇరాన్‌లో ఆయనకు ఏకపక్ష మద్దతు లేకపోయినా, సమాంతర సైన్యంగా 'ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్'.. IRGCని ఏర్పాటు చేసి వ్యవస్థలన్నింటినీ తన గుప్పిట్లో పెట్టుకున్నారు.

ప్రపంచ చమురు నిలయమైన పశ్చిమాసియాలో అమెరికా పెత్తనాన్ని ఖమేనీ మతం పేరుతో అడ్డుకోవడం, హార్ముజ్ జలసంధిపై పట్టు సాధించడం అగ్రరాజ్యానికి కంటగింపుగా మారింది. అందుకే అక్కడ తమకు అనుకూలమైన వ్యక్తిని పెట్టాలి అనుకుంది. సైనికంగా ఇరాన్‌ను తిరుగులేని శక్తిగా మార్చిన ఘనత ఖమేనీదే.. కానీ దేశంలో పౌరులపై ఆయన విధించిన కఠిన ఆంక్షలు, వ్యతిరేక స్వరాలపై ఉక్కుపాదం మోపడం ఆయనకు తీవ్ర వ్యతిరేకతను తెచ్చిపెట్టాయి. అందుకే ఖమేనీ చనిపోయిన సమయంలో చాలా మంది సంబరాలు చేసుకున్నారు. కానీ ప్రాణం పోయినా అమెరికాకు తలొగ్గకూడదన్న ఆయన తెగువ.. సొంత వర్గానికి ఆయనను హీరోని చేసింది.

లిబియాను 42 ఏళ్ల పాటు పాలించిన ముయమ్మర్ గడాఫీ కూడా ఈ కోవకే చెందుతారు. అమెరికా, నాటో బలగాలు గడాఫీని లక్ష్యంగా చేసుకుని 2011లో అంతం చేశాయి. ఏ తిరుగుబాటుతో అధికారంలోకి వచ్చారో.. అదే తిరుగుబాటుకు గడాఫీ బలయ్యారు. ఆయన అమెరికా పెత్తనాన్ని ధిక్కరించడం ప్రతీ ఒక్కరినీ నచ్చినా.. సొంత దేశంలో ప్రజలను తీవ్రంగా అణచివేయడాన్ని ఎవరూ సహించలేకపోయారు. దేశ సంపదను ప్రజలకు పంచకుండా నియంతలా మారడంతో సొంత దేశ ప్రజల నుంచే గడాఫీకి వ్యతిరేకత ఎదురైంది. అయితే గడాఫీ కేవలం నియంత కావడం వల్లే అమెరికా ఆయనను చంపలేదు. ఆయన అమెరికా, బ్రిటీష్ స్థావరాలను మూసివేయించడంతో పాటు, ఆఫ్రికన్ సెంట్రల్ బ్యాంక్‌ను స్థాపించి డాలర్ శక్తిని సవాలు చేసే సొంత 'బంగారు-ఆధారిత కరెన్సీ'ని తీసుకురావాలని ప్రయత్నించారు. ఈ చర్య అమెరికా ప్రయోజనాలకు తీవ్ర ముప్పుగా మారింది. ఆ మార్పు గడాఫీని అమెరికాకు శతృవును చేసింది. అంతే.. గడాఫీ మీద ప్రజలకు ఉన్న వ్యతిరేకతను అమెరికా ఉపయోగించుకుంది. లిబియా ప్రజలకు స్వేచ్ఛనిస్తామన్న పేరుతో నాటో దళాలతో వైమానిక దాడుల చేయించి ఆయనను పరోక్షంగా అంతం చేయించింది.

ఇరాన్‌ విషయంలో కూడా అమెరికాది దాదాపు ఇలాంటి వ్యూహమే. అమెరికాకు అతిపెద్ద శత్రువుగా మారిన ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌ను గద్దె దించడానికి.. 2003లో అమెరికా ఇరాక్‌పై దండయాత్ర చేసింది. సామూహిక విధ్వంసక ఆయుధాలు తయారు చేస్తున్నారనే ఆరోపణలతో 'ఆపరేషన్ రెడ్ డాన్' ద్వారా ఆయనను బంధించింది. సుదీర్ఘ విచారణ తర్వాత 2006లో క్యాంప్ జస్టిస్‌లో ఉరితీసింది. సద్దాం అమెరికాను ధిక్కరించి నిలబడటం ఇరాకీలకు ఆయనను హీరోని చేసింది. కానీ షియాలు, కుర్దులపై ఆయన చూపిన ద్వేషం.. దేశంలో తీవ్ర వ్యతిరేకతను పెంచింది. ఈ వ్యతిరేకతను అమెరికా చాలా అద్భుతంగా ఉపయోగించుకుంది. కుర్దులకు సద్దాం హుస్సేన్‌ మీద ఉన్న ద్వేషాన్ని తనకు అనుకూలంగా వాడుకుంది. అయినప్పటికీ, ఉరికొయ్యను ముద్దాడే చివరి క్షణంలోనూ తలకు నల్లటి ముసుగు వేసుకోవడానికి నిరాకరించి, అమెరికా వ్యతిరేకత విషయంలో తన రాజీలేని ధిక్కార స్వరాన్ని సద్దాం హుస్సేన్‌ ప్రపంచానికి చాటారు.

అమెరికాను వ్యతిరేకించిన కొందరు నేతలు ప్రాణాలు కోల్పోయినా, మరికొందరు మాత్రం జీవితాంతం అగ్రరాజ్యానికి సింహస్వప్నంగానే మిగిలిపోయారు. ఆ లిస్ట్‌లో వినిపించే మొదటి పేరు ఫిడెల్‌ క్యాస్ట్రో. దాదాపు ఐదు దశాబ్దాల పాటు క్యూబాను పాలించిన క్యాస్ట్రో, సీఐఏ చేసిన ఎన్నో హత్యాయత్నాలను విజయవంతంగా తిప్పికొట్టారు. లాటిన్ అమెరికా దేశాలకు పెద్దన్నగా ఉంటూ, ప్రపంచంలో అమెరికా వ్యతిరేక శిబిరానికి నాయకుడిగా నిలిచారు. వియత్నాం సామ్యవాద నాయకుడు హోచిమిన్‌ కూడా అమెరికాను వణికించిన నాయకుల్లో ఒకరు. ఆయన అసలు పేరు గుయెన్ టాట్ థన్.

ఒక చిన్న దేశమైన వియత్నాం ప్రజల్లో అమెరికా వ్యతిరేక స్ఫూర్తిని రగిలించి, అగ్రరాజ్య సైన్యాన్ని తరిమికొట్టిన ఘనత హోచిమిన్‌ది. ఈ సుదీర్ఘ యుద్ధం అమెరికాకు ఇప్పటికీ పీడకలగానే మిగిలిపోయింది. ఫిడెల్‌ స్పూర్తితో అగ్ర రాజ్యాన్ని వణికించిన మరో ధీరుడు హ్యూగో చావెజ్. ఇప్పుడు వెనుజులా అధ్యక్షుడు మధురోను సింపుల్‌గా అమెరికా ఎత్తుకెళ్లింది కానీ.. హ్యూగో చావెజ్‌ ఉన్నప్పుడు వెనుజులా పరిస్థితి వేరు. అమెరికా వ్యతిరేకతను ఆయుధంగా చేసుకున్నారు హ్యూగో. చమురు ఆదాయాన్ని ప్రజా సంక్షేమానికి ఖర్చు చేసి స్వదేశంలో హీరో ఇమేజ్ తెచ్చుకున్నారు. ఆయన ఉన్నంతవరకు వెనిజువెలాలో అమెరికా తోక జాడించలేదు. ఈ దిగ్గజాలను గద్దె దించేందుకు అమెరికా ఎన్నో కుట్రలు చేసినా, వారికున్న తిరుగులేని ప్రజాదరణ ముందు అగ్రరాజ్యం ఆటలు సాగలేదు. ప్రపంచం దృష్టిలో వీళ్లు కడదాకా పోరాట యోధులుగానే మిగిలిపోయారు.

అమెరికా ఎంత అగ్రరాజ్యమైనా.. దాన్ని దీటుగా ఎదిరించిన దేశాధినేతలు చరిత్రలో ఎందరో ఉన్నారు. అమెరికా తన శత్రువులను ఏరేయాలనే ఉద్దేశంతో ఎన్ని యుద్ధాలు చేసినా, ప్రపంచంలో అమెరికా వ్యతిరేక భావజాలాన్ని పూర్తిగా తుడిచిపెట్టడం అసాధ్యం. ఇరాక్, అఫ్గానిస్థాన్ పరిణామాలే దీనికి నిదర్శనం. యుద్ధాలు ఎప్పుడూ కొత్త సమస్యలను సృష్టిస్తాయే తప్ప పరిష్కారాన్ని చూపవు. ఖమేనీ లాంటి నాయకుడు చనిపోయినంత మాత్రాన అమెరికా వ్యతిరేకులు కనుమరుగవ్వరు. అమెరికా తన ప్రమాదకరమైన సామ్రాజ్యవాద వైఖరిని మార్చుకోకపోతే, ఎన్ని యుద్ధాలు చేసినా కొత్త శత్రువులు ఉద్భవిస్తూనే ఉంటారు.

Published : 
  • 5 March 2026, 12:15 PM IST