Top story:యుద్ధం ఇరాన్‌పై కాదు, ట్రంప్‌పైనే…! డొనాల్డ్ ట్రంప్‌పై తిరగబడ్డ సొంత నేతలు…ఈ 6 రోజుల్లో ఇరాన్ విధ్వంసం ఖాయం…!

ఆరు రోజులు.. కేవలం ఆరు రోజులే సమయం ఈలోగా ఇరాన్‌ను ఓడించడమో, ఒప్పందం చేసుకోవడమో ఈ రెండు ట్రంప్‌ ముందున్న ఆప్షన్స్. లేకపోతే అమెరికా అధ్యక్షుడిగా ఇజ్జత్ పోవడమే కాదు, అమెరికన్లలో ఉన్న కాస్త మద్దతు కూడా గంగలో కలిసిపోవడం ఖాయం.

Post Published By: dialnews
Updated : 25 April 2026, 4:30 PM IST

ఆరు రోజులు.. కేవలం ఆరు రోజులే సమయం ఈలోగా ఇరాన్‌ను ఓడించడమో, ఒప్పందం చేసుకోవడమో ఈ రెండు ట్రంప్‌ ముందున్న ఆప్షన్స్. లేకపోతే అమెరికా అధ్యక్షుడిగా ఇజ్జత్ పోవడమే కాదు, అమెరికన్లలో ఉన్న కాస్త మద్దతు కూడా గంగలో కలిసిపోవడం ఖాయం. ఇది తెలుసు కాబట్టే ట్రంప్ వార్‌జోన్‌లో ఎండ్ గేమ్ స్టార్ట్ చేశాడు. చర్చలకు తొందర లేదంటూనే ఇరాన్‌కు సమయంలేదని హెచ్చరిస్తున్నాడు. వీలైనంత త్వరగా తమతో ఒప్పందం చేసుకోవాలని అన్ని విధాలుగా ఒత్తిడితెచ్చే ప్రయత్నాలు షురూ చేశాడు. ఇరాన్ పోర్టులను దిగ్బంధిస్తున్నాడు. హార్ముజ్‌లో ఇరాన్‌కు చెందిన చిన్న బోటును కూడా కాల్చి పారేయమని ఆదేశాలిచ్చాడు. ఇప్పుడు ఏకంగా మూడో ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌ను రంగంలోకి దించాడు.

USS జార్జ్ హెచ్.డబ్ల్యూ. బుష్‌.. అమెరికా రంగంలోకి దించిన మూడో ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ఇదే. నిమిట్జ్ క్లాస్‌కు చెందిన భారీ అణు ఇంధన నౌక ఇది. ఏప్రిల్ 23 నాటికి హిందూ మహాసముద్రం మీదుగా అమెరికా సెంట్రల్ కమాండ్ పరిధిలోకి చేరుకుంది. దీనికంటే ముందే ఈ ప్రాంతంలో మరో రెండు విమాన వాహక నౌకలు ఉన్నాయి. మొదటిది USS అబ్రహం లింకన్. ఇది ప్రస్తుతం అరేబియా సముద్రంలో ఉంది. రెండోది USS గెరాల్డ్ ఆర్. ఫోర్డ్. ఇది ఎర్ర సముద్రం ప్రాంతంలో మోహరించి ఉంది. ఈ మూడో నౌకను పంపడానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 13 నుండి అమెరికా ఇరాన్‌పై నౌకాదళ దిగ్బంధనాన్ని అమలు చేస్తోంది. ఇరాన్ రేవుల నుండి వెళ్లే లేదా అక్కడికి వచ్చే ఓడలను అమెరికా బలగాలు అడ్డుకుంటున్నాయి. ఈ దిగ్బంధనాన్ని మరింత పటిష్టం చేయడానికి అదనపు బలం అవసరమైంది.

రెండో రీజన్.. హార్ముజ్‌లో ఇరాన్ కొత్తగా సముద్రపు మైన్లను అమర్చుతోంది. హార్ముజ్‌లో ఇరాన్‌ భారీగా చిన్న బోట్లను మోహరించినట్లు తాజాగా తీసిన శాటిలైట్ ఫొటోల్లో బయటపడింది. నౌకా విధ్వంసక ఆయుధాలు, స్వల్ప శ్రేణి క్షిపణులు అమర్చిన స్పీడ్‌ బోట్లను ఇరాన్‌ నేవీ హార్ముజ్‌‌లోని ఉత్తర భాగంలో రహస్యంగా మోహరించినట్లు ఓపెన్‌ సోర్స్‌ పరిశోధకుడు మెహదీ తెలిపారు. దాదాపు 33 బోట్లు దాడులకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. సెంటినెల్‌-2 ఉపగ్రహం ద్వారా తీసిన చిత్రాల ఆధారంగా ఈ విషయాన్ని తెలిపారు. ఈ బోట్లను మోహరించేందుకు పెద్దపెద్ద నౌకాశ్రయాలు అవసరం ఉండదు. సముద్రంలో ఇవి శత్రువుపై మెరుపు వేగంతో దాడులు చేసి మాయమైపోతాయి. ఇలాంటి బోట్లు ఇరాన్‌ వద్ద భారీగా ఉన్నట్లు భావిస్తున్నారు. సో.. ఇరాన్ చర్యలను అడ్డుకోవడానికి అమెరికా ఈ భారీ నౌకను రప్పించింది. మూడోది యుద్ధ సన్నద్ధత. ఒకవేళ ఇరాన్ ప్రతిఘటిస్తే, ముప్పేట దాడి చేయడానికి వీలుగా అమెరికా తన గగనతల, నావికా శక్తిని అక్కడ కేంద్రీకరిస్తోంది. ఎందుకంటే, ఇరాన్‌తో యుద్ధం ఇప్పుడు ట్రంప్‌ మెడపై కత్తిలా మారింది.

ఇరాన్‌ను తేలిగ్గా ఓడించి కాళ్ల బేరానికి తెచ్చుకుంటానని చెప్పి యుద్ధంలోకి దిగిన ట్రంప్‌.. ఇప్పుడు అందులోంచి బయటపడటం ఎలాగో తెలియక తలపట్టుకుంటున్నాడు. అమెరికా రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు ఏ దేశంపై అయినా యుద్ధం ప్రకటించే ముందు ఆ దేశ చట్టసభ అయిన కాంగ్రెస్‌ అనుమతి తీసుకోవాలి. ఒకవేళ అనుమతి తీసుకోకుండా యుద్ధం ప్రకటిస్తే.. దాడి మొదలుపెట్టిన రోజు నుంచి 60 రోజుల్లోగా అనుమతి తీసుకోవాలి. డొనాల్డ్ ట్రంప్‌ ఎవరినీ సంప్రదించకుండానే ఫిబ్రవరి 28న ఇరాన్‌పై యుద్ధం మొదలుపెట్టాడు. మే 1వ తేదీతో యుద్ధం మొదలై 60 రోజులు పూర్తవుతుంది. దీంతో ప్రస్తుతం ట్రంప్‌కు కాంగ్రెస్‌ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. యుద్ధాన్ని 30 రోజుల వరకు పొడిగించేందుకు అధ్యక్షుడు కాంగ్రెస్‌ అనుమతి కోరవచ్చు. అయితే, బలగాల ఉపసంహరణకు మాత్రమే అది వర్తిస్తుంది. లేదా తన విచక్షణ అధికారాలను ఉపయోగించి యుద్ధాన్ని కొనసాగించొచ్చు. కానీ, ట్రంప్‌ నియంతలా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహంతో ఉన్న ప్రతిపక్ష డెమోక్రాట్లు.. యుద్ధానికి ఆమోదముద్ర పడకుండా చూడాలని పట్టుదలగా ఉన్నారు.

పలువురు అధికార రిపబ్లికన్లు కూడా అధ్యక్షుడిపై మండిపడుతున్నారు. యుద్ధం పొడిగింపునకు తాను ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వబోనని రిపబ్లికన్‌ సెనేటర్‌ జాన్‌ కర్టిస్‌ స్పష్టంచేశారు. మే 1వ తేదీ తర్వాత యుద్ధం కొనసాగటానికి తాను మద్దతు ఇవ్వబోనని ఫ్లోరిడాకు చెందిన రిపబ్లికన్‌ రిప్రజెంటేటివ్‌ బ్రయాన్‌ మాస్ట్‌ తెగేసి చెప్పారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌ రాజకీయంగా ఇబ్బందులను తప్పించుకోవాలంటే ఏకపక్షంగా వ్యవహరించకుండా కాంగ్రెస్‌ ముందుకు వెళ్లటమే మార్గమని నిపుణులు పేర్కొంటున్నారు. ట్రంప్ ముందున్న మరో ఆప్షన్. మే 1వ తేదీ లోగా ఇరాన్‌ను తన దారికి తెచ్చుకోవడం. రాజకీయ ప్రత్యర్థుల ముందు అనుమతుల కోసం వేచి చూసేకంటే ఇరాన్‌తో నయానో, భయానో దారికితెచ్చుకోవడమే బెటర్ అని ట్రంప్ భావిస్తున్నట్టు తాజా పరిణామాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా మూడు ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లను మోహరించడంతో పాటు, హార్ముజ్‌ను దిగ్బంధించి ఆర్థికంగా ఇరాన్‌పై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ, ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. సో.. ఈ వారం రోజుల్లో పశ్చిమాసియాలో మారణహోమం తప్పేలా లేదు.

 

Published : 
  • 25 April 2026, 4:30 PM IST