అమెరికా, ఇజ్రాయిల్ వర్సెస్ ఇరాన్ మధ్య యుద్ధ పీక్స్ కు చేరిన టైంలో.. అమెరికా ఈ యుద్దాన్ని మరింత తీవ్రంగా మార్చే ఛాన్స్ కనపడుతోంది. ఉద్రిక్తతలను మరింత పెంచుతూ అమెరికా ఒక మోస్ట్ పవర్ ఫుల్ వార్ షిప్ ను రంగంలోకి దించింది. దాదాపు 2,000 మంది మెరైన్ సైనికులతో కూడిన 'యూఎస్ఎస్ ట్రిపోలి' అరేబియా సముద్రంలోకి ఎంటర్ అయ్యేందుకు రెడీ అయింది. హోర్ముజ్ జలసంధి, రాస్ లఫాన్ ఘటనల తర్వాత అమెరికా తన సైనిక వ్యూహాన్ని వేగవంతం చేసింది.గల్ఫ్ ప్రాంతంలో తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికి, తన మిత్రదేశాల ప్రయోజనాలను కాపాడటానికి అమెరికా ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. యూఎస్ఎస్ ట్రిపోలి ప్రత్యేకతలు ఒక్కసారి చూస్తే.. అది ఏ రేంజ్ లో పవర్ ఫుల్ నౌకనో అర్ధమవుతుంది. ఈ భారీ యుద్ధనౌకలో దాదాపు 2,000 మందికి పైగా సుశిక్షితులైన అమెరికన్ మెరైన్ సైనికులు ఉన్నారు. వీరు సముద్రం నుండి నేరుగా శత్రువుల నేలపైకి దాడి చేయడంలో ఆరితేరిన సైనికులుగా చెప్తూ ఉంటారు. దీనిపై ఎఫ్-35బి వంటి అత్యాధునిక యుద్ధ విమానాలు, భారీ హెలికాప్టర్లు ఉన్నాయి.
ఇవి నిమిషాల వ్యవధిలో ఇరాన్ తీరప్రాంత లక్ష్యాలపై విరుచుకుపడగలవు. ఇది కేవలం ఒక యుద్ధనౌక మాత్రమే కాదు, ఒక కదిలే సైనిక స్థావరం. దీనివల్ల ఇరాన్‌పై ఒత్తిడి పెంచడం అమెరికాకు సులభమవుతుంది. అసలు అరేబియా సముద్రంలోకి ఎందుకు అనేది ఒకసారి చూస్తే.. హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లే వాణిజ్య నౌకలకు రక్షణ కల్పించడం అమెరికా ప్రధాన లక్ష్యం. ఇరాన్ దాడుల భయం లేకుండా నౌకలు ప్రయాణించేలా 'యూఎస్ఎస్ ట్రిపోలి' కాపలా కాయనుంది. ఒకవేళ ఇరాన్ మళ్ళీ క్షిపణి దాడులకు దిగితే, తక్షణమే తిప్పికొట్టేందుకు అమెరికా ఈ 'ఫ్లోటింగ్ ఫోర్స్'ను సిద్ధం చేసింది.గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా స్థావరాలపై దాడులు జరిగితే, సముద్రం నుంచే భారీ ఆపరేషన్ నిర్వహించేందుకు ఈ నౌక ఉపయోగపడుతుంది.
నిపుణుల విశ్లేషణ ప్రకారం, యూఎస్ఎస్ ట్రిపోలి రాకతో యుద్ధం రెండవ దశ లోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఇప్పటివరకు క్షిపణి దాడులు మరియు డ్రోన్ దాడులు మాత్రమే జరిగాయి. ఇప్పుడు మెరైన్ సైనికులతో కూడిన నౌక రావడం అంటే, అవసరమైతే ఇరాన్ తీర ప్రాంతాల్లోని వ్యూహాత్మక ప్రాంతాలను ఆక్రమించుకునే అవకాశం కూడా ఉందనే సిగ్నల్స్ వస్తున్నాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఇరాన్‌కు బుద్ధి చెబుతాం అని ప్రకటించారు. నాటో దేశాలు సహకరించకపోయినా, అమెరికా తన ఒంటరి పోరాటాన్ని కొనసాగిస్తుందని చెప్పడానికి ఈ నౌక పంపడమే నిదర్శనం. జపాన్‌తో కలిసి ఈ ప్రాంతంలో పట్టు సాధించాలని ట్రంప్ గట్టి పట్టుదలతో ఉన్నారు. అయితే అరేబియా సముద్రంలో అమెరికా యుద్ధనౌకల మోహరింపు ఇరాన్‌ను ఆత్మరక్షణలో పడేస్తోంది. ఒకవేళ ఏ చిన్న పొరపాటు జరిగినా, ఇది పూర్తిస్థాయి ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉంది.