ఒకడి మీద అటాక్ ప్లాన్ చేసినప్పుడు, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి.. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని స్టెప్ వెయ్యాలి.. ఇప్పుడు ఇరాన్ విషయంలో ఈ టాపిక్స్ ఏం లేకుండా, బలం ఉందని దాడి చేసి ప్రపంచాన్ని ముంచాయి అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు. చివరకు ఇరాన్ అటాక్స్ తో వాళ్ళల్లో వాళ్ళే తిట్టుకునే పరిస్థితి క్రియేట్ అయింది. ప్రపంచంలోనే అతిపెద్ద సహజ వాయువు ప్లాంట్ అయిన సౌత్ పార్స్ మీద ఇజ్రాయెల్ చేసిన దాడి ఎఫెక్ట్, కేవలం ఇరాన్‌ను మాత్రమే కాకుండా అమెరికా-ఇజ్రాయెల్ బంధాన్ని కూడా షేక్ చేస్తోంది.
ఈ దాడి రియాక్షన్స్ ఓ రేంజ్ లో ఉండటంతో.. డోనాల్డ్ ట్రంప్ ఆగ్రహంతో ఊగిపోతున్నట్టు టాక్. ఇరాన్ - ఖతార్ దేశాల మధ్య సముద్ర గర్భంలో విస్తరించి ఉన్న 'సౌత్ పార్స్' ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ నిల్వలున్న ప్రాంతం. దీనిపై ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడితో అంతర్జాతీయ ఇంధన మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. మార్చి 18, 2024న ఇజ్రాయెల్ వాయుసేన అత్యంత రహస్యంగా 'ఆపరేషన్ గ్యాస్ కట్'ను నిర్వహించింది. ఇరాన్ పరిధిలోని సౌత్ పార్స్ ప్లాంట్లు, ప్రాసెసింగ్ హబ్‌లను ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది. దీనివల్ల ఇరాన్ గ్యాస్ ఉత్పత్తిలో 12% నిలిచిపోయింది.
ఇరాన్ తన అణు కార్యక్రమాలకు, హిజ్బుల్లా, హమాస్ వంటి సంస్థలకు నిధులు సమకూర్చుకునే ప్రధాన వనరును దెబ్బతీయడం నెతన్యాహు వ్యూహం. కానీ ఇదే ఇప్పుడు ప్రపంచాన్ని తలకిందులు చేసేలా కనపడుతోంది. ఇక లేటెస్ట్ గా ఇరాన్ లో సౌత్ పార్స్ పై చేసిన దాడిని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఖండించడమే కాకుండా, ఇజ్రాయిల్ ప్రధానిపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ దాడి జరిగిన తీరుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వైట్‌హౌస్‌లో జరిగిన చర్చల్లో ఆయన నెతన్యాహుపై మండిపడ్డారు.
"ఈ దాడి గురించి నాకు ముందే ఎందుకు చెప్పలేదు? " అని ట్రంప్ నిలదీశారు. అమెరికా ప్రయోజనాలను దెబ్బతీసేలా ఇజ్రాయెల్ సొంతంగా నిర్ణయాలు తీసుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. చర్చల సందర్భంగా ట్రంప్.. జపాన్ ప్రధానితో కలిసి ఉన్నప్పుడు, "పర్ల్ హార్బర్ దాడి గురించి మీరు మాకు ఎందుకు చెప్పలేదు?" అని సరదాగా అన్నప్పటికీ, అది ఇజ్రాయెల్ ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంపై ట్రంప్ కు ఉన్న కోపం అలా బయటపెట్టినట్టు తెలుస్తోంది. ఇరాన్ గ్యాస్ క్షేత్రాలపై దాడులు చేస్తే ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకుతాయని, అది అమెరికాలో ద్రవ్యోల్బణాన్ని పెంచి తన రాజకీయ ప్రతిష్టను దెబ్బతీస్తుందని ట్రంప్ భయంగా కనపడుతోంది.
నెతన్యాహు వాదన ప్రకారం, ఇరాన్ ఇప్పటికే ఖతార్‌లోని రాస్ లఫాన్ ప్లాంట్‌ను దెబ్బతీసింది కాబట్టి, ప్రతీకారం తీర్చుకోకపోతే ఇజ్రాయెల్ బలహీనంగా కనిపిస్తుందట. అయితే, ట్రంప్ నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిడితో నెతన్యాహు కొంత వెనక్కి తగ్గారని తెలుస్తోంది. అధ్యక్షుడు ట్రంప్ కోరినందువల్ల, ఇరాన్ ఇంధన క్షేత్రాలపై ప్రస్తుతానికి మరిన్ని దాడులు చేయబోం అని నెతన్యాహు ప్రకటించారు. అంటే, సౌత్ పార్స్ తర్వాత జరగాల్సిన మరిన్ని దాడులను ట్రంప్ అడ్డుకోగలిగారని టాక్.
సౌత్ పార్స్, రాస్ లఫాన్ దాడుల వల్ల ప్రపంచానికి రాబోయే 5 ఏళ్ల పాటు గ్యాస్ కొరత తప్పదని ఖతార్ ఎనర్జీ స్పష్టం చేసింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఇప్పటికే 118 డాలర్లకు దాటేసింది. సప్లై చైన్ కూడా దెబ్బ తిన్న పరిస్థితి. ఖతార్ ఎగుమతుల్లో 17% కోత పడటంతో, భారత్ వంటి దేశాలు ఇప్పుడు ప్రత్యామ్నాయాల కోసం వెతుక్కుంటున్నాయి. చారిత్రాత్మకంగా అమెరికా, ఇజ్రాయెల్ మంచి మిత్రదేశాలు. కానీ, ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత "అమెరికా ఫస్ట్" విధానం వల్ల, ఇజ్రాయెల్ చేసే ప్రతి యుద్ధ చర్యను ఆయన గుడ్డిగా సమర్థించడం లేదు.
ముఖ్యంగా ఇంధన ధరలపై ప్రభావం చూపే దాడులను ఆయన సహించడం లేదు. ఇది ఇద్దరు అగ్రనేతల మధ్య నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. సౌత్ పార్స్ దాడి కేవలం ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పోరు మాత్రమే కాదు, అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే స్థాయికి చేరింది. ట్రంప్ ఒత్తిడితో నెతన్యాహు తాత్కాలికంగా ఆగినా, ఇరాన్ మళ్ళీ క్షిపణి దాడులు చేస్తే ఈ ఒప్పందం గాలిలో కలిసిపోవడం ఖాయం.