సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నన్న శాటిలైట్ ఇమేజ్ ఇది. ఇది ఇరాన్ న్యూక్లియర్ సైట్‌కు సంబంధించిన శాటిలైట్ ఫొటో. ఈ ఫొటోనే మిడిల్ ఈస్ట్‌లో ఎనీటైం వార్ ఖాయమంటోంది. పశ్చిమాసియాలో అమెరికా సైనిక బలాన్ని మోహరిస్తున్న నేపథ్యంలో.. ఇరాన్ తన అణుస్థావరాలను రక్షించుకొనేందుకు చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా ఒకవేళ యూఎస్ దాడులకు పాల్పడినా.. ఆ దాడులను తట్టుకుని నిలబడేలా అణుస్థావరాలపై గట్టి బంకర్‌లను ఏర్పాటు చేస్తోంది. అందుకు సంబంధించినదే ఈ శాటిలైట్ ఫొటో. ఈ ఫొటోలను వాషింగ్టన్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ బయటపెట్టింది. గత రెండు వారాల్లో ఇరాన్ మిలిటరీ కాంప్లెక్స్‌లోని 'న్యూ తలేఘాన్-2' కేంద్రంపై బలమైన కాంక్రీటు పొరను ఏర్పాటుచేసిందని ఇన్‌స్టిట్యూట్ పేర్కొంది. ఈ తలేఘాన్-2 టెహ్రాన్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఫిబ్రవరి 13 నాటి శాటిలైట్ ఫొటోల ప్రకారం.. అణుస్థావరం మొత్తాన్ని పూర్తిగా కాంక్రీట్‌తో కప్పేశారు. ఇప్పుడు దానిపై మట్టి పోస్తున్నారు. ఇది త్వరలోనే పూర్తి బంకర్‌గా మారిపోతుందని, వైమానిక దాడుల నుంచి దీనికి రక్షణ లభిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.
మరోవైపు.. కోలాంగ్-గాజ్‌లా పర్వతం కింద సొరంగ మార్గాలను తవ్వినట్లు ఫిబ్రవరి 10 నాటి శాటిలైట్ ఇమేజెస్ చెబుతున్నాయి. నటాంజ్ అణుశుద్ధి కేంద్రం నుంచి ఇది దాదాపు 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఈ ప్రయత్నాలన్నీ సొరంగంపై జరిగే వైమానిక దాడుల నుంచి రక్షణ కల్పించడా నికే అని ఆ సంస్థ పేర్కొంది. అంతేకాదు, ఈ ప్రాంతంలో కొన్ని వాహనాల కదలికలనూ గుర్తించారు. దీంతో లోపల ఇరాన్ ఏవో పనులు చేపడుతున్నట్లు ఇన్‌స్టిట్యూట్ ఫర్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ సంస్థ అనుమానిస్తోంది. ఇస్ఫహాన్ అణుకేంద్రం వద్ద కూడా రక్షణ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈనెల 8 నాటి శాటిలైట్ ఫొటోలు వెల్లడిస్తున్నాయి. సో.. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నుంచి తమ న్యూక్లియర్ ఫెసిలిటీస్‌ను కాపాడుకోడానికి టెహ్రాన్ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు అమెరికా ఏం చేస్తుందో చూద్దాం.. జెనీవాలో చర్చలు మొదలవ్వక ముందే పశ్చిమాసియాలో కొత్త గేమ్ స్టార్ట్ చేసింది అమెరికా. భారీ ఎత్తున మిలిటరీ మోహరింపులు చేసింది. ప్రస్తుతం ఇరాన్ చుట్టూ 12 యుద్ధ నౌకలు, వందలాది ఫైటర్‌జెట్లు రెడీగా ఉన్నాయి. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు ఇరాన్‌పై దాడికి డేట్, టైం ఫిక్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అటు ఇజ్రాయెల్ కూడా అలర్ట్ అయింది. తమ సైనిక సన్నాహాలను ముమ్మరం చేసింది.
అమెరికా వార్తా సంస్థ ఆక్సియోస్ నివేదిక.. యుఎస్-ఇరాన్ యుద్ధం ఆసన్నమైందని, అది కొన్ని వారాల పాటు కొనసాగే పూర్తి స్థాయి సంఘర్షణగా మారవచ్చని పేర్కొంది. ఇజ్రాయెల్ కూడా సిద్ధమవుతోందని తెలిపింది. గతేడాది జూన్‌లో జరిగిన యుద్ధం కంటే ఎక్కువ స్థాయిలో ఉండొచ్చని తన నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం అమెరికా మధ్యప్రాచ్యంలో తన సైనిక బలాన్ని పెంచుకుంది. రెండు విమాన వాహక నౌకలు, 12 యుద్ధనౌకలు, వందలాది యుద్ధ విమానాలు, అనేక వైమానిక రక్షణ వ్యవస్థలు మిడిల్‌ఈస్ట్‌లో మోహరించారు. కొన్ని రోజులుగా 150కిపైగా అమెరికా సైనిక కార్గో విమానాలు మధ్యప్రాచ్యానికి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని తరలించాయి. 50కి పైగా యుద్ధ విమానాలు మధ్యప్రాచ్యంలోనే తిరుగుతున్నాయి. వాటిలో పవర్‌ఫుల్ F-35, F-22, F-16 ఫైటర్ జెట్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఒకేసారి యాక్షన్‌లోకి దిగితే ఇరాన్ నామరూపాలు లేకుండాపోవడం ఖాయం. ఇక మరో మీడియా సంస్థ CBS న్యూస్ ప్రకారం.. వీకెండ్‌లోనే ఈ దాడి జరగబోతోంది. డొనాల్డ్ ట్రంప్‌కు అత్యున్నత జాతీయ భద్రతా సలహాదారుడు ఈ మేరకు సమాచారం ఇచ్చినట్టు ఆ సంస్థ చెప్పింది. అన్నింటికీమించి 2003 ఇరాక్ యుద్ధం తర్వాత మిడిల్ ఈస్ట్‌లో అమెరికా అతిపెద్ద ఎయిర్‌పవర్‌ను మోహరించినట్టు నివేదికలు కన్ఫమ్ చేశాయి. అంటే ట్రంప్ ఏ రేంజ్‌లో దాడికి సిద్ధం చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. కానీ, ఇప్పుడే ఈ స్థాయిలో దాడికి ఎందుకు ప్లాన్ చేశారు?
అమెరికా ఇరాన్‌పై దాడులు చేయడానికి ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. 2018లో అణు ఒప్పందం నుంచి అమెరికా తప్పుకున్న తర్వాత కొత్త ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నా ఫలితం రాకపోవడం లేదు. ఇక ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్భణం కారణంగా ఇరాన్ ప్రజలు ప్రభుత్వంపై భారీ ఎత్తున నిరసనలు చేస్తున్నారు. వారిని ఇరాన్ ప్రభుత్వం పొట్టన బెట్టుకోవడాన్ని ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. ఈక్రమంలోనే అక్కడి ప్రజలకు సహాయం అందుతుంది అంటూ హామీ కూడా ఇచ్చాడు. మరోవైపు ఇరాన్ అణు స్థావరాలపై దాడులు చేయాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా అమెరికాపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రస్తుతం చమురు ధరలు తక్కువగా ఉండటం వల్ల యుద్ధం జరిగినా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం తక్కువగా ఉంటుందని ట్రంప్ టీమ్ అంచనా వేస్తోంది. పైగా ఇరాన్‌లో ఖమేనీ ప్రభుత్వాన్ని గద్దె దించి తమకు అనుకూల ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇదే రైట్ అని ట్రంప్ భావిస్తున్నారు. దేశీయంగా వస్తున్న నిరసనలు, గత ఏడాది జరిగిన దాడులతో ఇరాన్ పాలక వర్గం ప్రస్తుతం బలహీనంగా ఉందని ట్రంప్ భావిస్తున్నారు. అందుకే, ఈసారి భీకరంగా దాడులు చేయాలనుకుంటున్నాడు.