అభిషేక్ శర్మను పీకేయండి… నంబర్ వన్ బ్యాటర్ పై ఫ్యాన్స్ ఫైర్…!

సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా.. పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత యువ ఆటగాళ్లకు ఎక్కువగా అవకాశాలు లభించాయి.

Post Published By: dialnews
Updated : 2 March 2026, 8:00 PM IST

సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా.. పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత యువ ఆటగాళ్లకు ఎక్కువగా అవకాశాలు లభించాయి. అందివచ్చిన అవకాశాలను కుర్రాళ్లు రెండు చేతులా అందిపుచ్చుకున్నారు. దీంతో టీ20 క్రికెట్‌లో భారత జట్టుకు తిరుగులేకుండా పోయింది. జట్టు ఏదైనా విజయమే లక్ష్యంగా బరిలోకి దిగింది. ముఖ్యంగా టీమిండియా విజయాల్లో ఓపెనింగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ .. కీలక పాత్ర పోషించాడు. తన మెరుపు బ్యాటింగ్‌తో జట్టుకు శుభారంభాలు అందించాడు. టీ20 ప్రపంచకప్ 2026లోనూ అతడు సత్తాచాటుతాడని అంతా భావించారు.కానీ ప్రస్తుతం.. సీన్ రివర్స్ అయింది.

ఎన్నో అంచనాలతో తొలిసారి టీ20 ప్రపంచకప్ బరిలోకి దిగిన అభిషేక్.. దారుణ ప్రదర్శన చేస్తున్నాడు. తొలి మూడు మ్యాచ్‌లలో వరుసగా మూడు డకౌట్లు నమోదు చేశాడు. ఆ తర్వాత 15 పరుగులు చేశాడు. గత మ్యాచ్‌లో 55 రన్స్‌తో ఫామ్‌లోకి వచ్చినట్లే కనిపించిన అభిషేక్.. తాజాగా వెస్టిండీస్‌తో కీలకమైన మ్యాచ్‌లో మరోసారి విఫలమయ్యాడు. 11 బంతుల్లో 10 రన్స్ చేసి ఔట్ అయ్యాడు.మొత్తంగా ఈ టోర్నీలో ఆడిన ఆరు ఇన్నింగ్స్‌లలో అతడు.. 80 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో మూడు డకౌట్స్ ఉన్నాయి. అభిషేక్.. 13.33 సగటుతో.. 131 స్ట్రైక్ రేట్‌తో ఈ రన్స్ స్కోరు చేశాడు.ఈ టోర్నీకి ముందు వరకు 200లకు పైగా స్ట్రైక్ రేట్‌తో రన్స్ చేసిన అభిషేక్.. ఇప్పుడు మాత్రం ఫామ్ లేక ఇబ్బంది పడుతున్నాడు. జట్టుగా బలంగా మారుతాడనకుంటే.. బలహీనతగా మారిపోయాడు.దీంతో అభిషేక్ శర్మపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతన్ని పక్కన పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని కామెంట్ చేస్తున్నారు.

ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిషేక్ శర్మ ఆటతీరు అస్సలు మారడం లేదు.బ్యాటింగే కాదు.. ఫీల్డింగ్‌లోనూ తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. విండీస్‌తో మ్యాచ్‌లో రెండు సునాయసమైన క్యాచ్‌లను నేలపాలు చేశాడు. సంజూ శాంసన్ పుణ్యమా.. ఈ మ్యాచ్‌లో భారత్ గట్టెక్కింది. లేకుంటే అభిషేక్ శర్మ తీవ్ర విమర్శలు ఎదుర్కొనేవాడు. అతన్ని పక్కన పెట్టి రింకూ సింగ్ లేదా ఎక్స్‌ట్రా బౌలర్‌ను ఆడించాలని నెటిజన్లు పిలుపునిస్తున్నారు. అభిషేక్ శర్మ జట్టుకు భారంగా మారాడని మండిపడుతున్నారు.  సంజూ శాంసన్ ఫామ్‌లోకి వచ్చిన నేపథ్యంలో అభిషేక్ శర్మను పక్కన పెట్టి ఇషాన్ కిషన్‌ను ఓపెనర్‌గా ఆడించాలని డిమాండ్ చేస్తున్నారు. జింబాబ్వేతో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రాణించినా తన శైలికి భిన్నంగా ఆడాడు. ఈ క్రమంలోనే అభిషేక్ శర్మకు బదులు ఇతర ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని సూచిస్తున్నారు.

Published : 
  • 2 March 2026, 8:00 PM IST