2027 వరల్డ్ కప్ వరకూ ఉంటా… బీసీసీఐకి అగార్కర్ రిక్వెస్ట్…!

వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ ముగిసేవరకూ చీఫ్ సెలక్టర్ గా కొనసాగాలనుకుంటున్న అజిత్ అగార్కర్ దీనికి సంబంధించి బీసీసీఐకి రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. ఐపీఎల్‌-2025కి ముందే అగార్కర్‌ పదవీకాలాన్ని పొడగిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.

Post Published By: dialnews
Updated : 20 March 2026, 3:15 PM IST

వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ ముగిసేవరకూ చీఫ్ సెలక్టర్ గా కొనసాగాలనుకుంటున్న అజిత్ అగార్కర్ దీనికి సంబంధించి బీసీసీఐకి రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. ఐపీఎల్‌-2025కి ముందే అగార్కర్‌ పదవీకాలాన్ని పొడగిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా కథనం ప్రకారం.. అగార్కర్‌ మరోసారి తన పదవీకాలాన్ని పొడిగించాల్సిందిగా బీసీసీఐని అభ్యర్థించినట్లు సమాచారం. వన్డే వరల్డ్‌కప్‌-2027 ముగిసే వరకు తనను చీఫ్‌ సెలక్టర్‌గా కొనసాగించాలని అగార్కర్‌ బోర్డుకు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. టీమిండియా గత మూడేళ్లలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో నాలుగు ఐసీసీ టోర్నమెంట్లు ఆడింది.

సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్‌-2023 ఎడిషన్‌లో రన్నరప్‌గా నిలిచిన రోహిత్‌ సేన.. 2024లో అమెరికా- వెస్టిండీస్‌ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో చాంపియన్‌గా నిలిచింది. ఇక దుబాయ్‌లో జరిగిన ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 టైటిల్‌ను కూడా రోహిత్‌ శర్మ సారథ్యంలో భారత్‌ సొంతం చేసుకుంది. తాజాగా స్వదేశంలో జరిగిన టీ20 ప్రపంచకప్‌-2026లో సూర్య కెప్టెన్సీలో విజేతగా నిలిచి ట్రోఫీని ముద్దాడింది. అంతేకాదు సొంతగడ్డపై తొలిసారి, వరుసగా రెండోసారి, మొత్తంగా మూడోసారి పొట్టి క్రికెట్‌ వరల్డ్‌కప్‌ గెలిచిన తొలి జట్టుగా రికార్డు సాధించింది.

ఈ నాలుగు సందర్భాల్లోనూ టీమిండియా చీఫ్‌ సెలక్టర్‌గా అజిత్‌ అగార్కర్‌ ఉన్నాడు. 2020-21లోనే ఈ పదవి కోసం అతడు పోటీ పడగా చేతన్‌ శర్మకు అవకాశం దక్కింది. అయితే, చేతన్‌ శర్మ టీమిండియా ఆటగాళ్ల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడి పదవి పోగొట్టుకున్నాడు. ఫలితంగా జూన్‌, 2023లో అజిత్‌ అగార్కర్‌ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు. జట్టు ఎంపిక విషయంలో సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ ఒక్కోసారి విమర్శలు కూడా మూటగట్టుకున్నాడు . ముఖ్యంగా రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి టెస్టులకు గుడ్‌బై చెప్పిన నేపథ్యంలో హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌తో పాటు అగార్కర్‌పై కూడా విమర్శలు వచ్చాయి.

అంతేకాదు వన్డే వరల్డ్‌కప్‌-2027లో రో-కో ఆడటం కష్టమంటూ అతడు చేసిన వ్యాఖ్యలు, అర్ధంతరంగా రోహిత్‌ శర్మను వన్డే సారథిగా తప్పించి శుబ్‌మన్‌ గిల్‌కు పగ్గాలు ఇవ్వడం అగార్కర్‌పై అభిమానుల ఆగ్రహానికి కారణమయ్యాయి. అదే సమయంలో టీ20 ప్రపంచకప్‌-2026 జట్టు నుంచి టెస్టు, వన్డే కెప్టెన్‌ గిల్‌ను తప్పించడం.. అతడి స్థానంలో వచ్చిన ఇషాన్‌ కిషన్‌ చెలరేగడం అగార్కర్‌పై సానుకూలత వచ్చేలా చేశాయి. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతడికి మంచి రికార్డే ఉన్నా.. టెస్టుల్లో మాత్రం చేదు అనుభవాలు ఉన్నాయి. 2023-25 వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌లో టీమిండియా కనీసం ఫైనల్‌కు కూడా చేరలేదు. మరోవైపు వెస్ట్‌జోన్‌ నుంచి ఓ మాజీ క్రికెటర్‌ కూడా ఈ పదవి కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో టీమిండియాపై ప్రభావం చూపిన అగార్కర్‌ విషయంలో బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

Published : 
  • 20 March 2026, 3:15 PM IST