పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మకు సంజూ శాంసన్ అండగా నిలిచాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్లో అభిషేక్ శర్మ చెలరేగుతాడని జోస్యం చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఫామ్ కోల్పోవడం సాధారణమేనని, తనదైన రోజున అభిషేక్ శర్మ విజృంభిస్తాడని, అది ఫైనలే కావచ్చని అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్‌తో గురువారం వాంఖడే మైదానం వేదికగా జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 7 పరుగుల తేడాతో గట్టెక్కింది. సంజూ శాంసన్ విధ్వంసం.. జస్ప్రీత్ బుమ్రా అసాధారణ బౌలింగ్.. అక్షర్ పటేల్ కళ్లు చెదిరే ఫీల్డింగ్ టీమిండియాను విజేతగా నిలబెట్టాయి. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగే ఫైనల్లో న్యూజిలాండ్‌తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది.
సెమీఫైనల్ విజయానంతరం భారత్ తరఫున మీడియా సమావేశంలో పాల్గొన్న సంజూ శాంసన్.. అభిషేక్ శర్మ ఫామ్‌పై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం బాగుందనీ, అభిషేక్ శర్మపై తమకు నమ్మకం ఉందన్నాడు. తామంతా అతనికి అండగా ఉన్నామన్న సంజూ ప్రతీ క్రికెటర్ కెరీర్లో ఒడిదొడుకులు ఉంటాయన్నాడు. ఈ ఫార్మాట్లో ఒకటి, రెండు మంచి షాట్లు కొడితే.. అంతా కుదురుకుంటుందని తేల్చేశాడు. తనదైన రోజున అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టిస్తాడు. అది టీ20 ప్రపంచకప్ ఫైనల్ అవుతుందేమో అంటూ సంజూ శాంసన్ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాకు దూరంగా ఉండటం వ్యక్తిగతంగా తనకు కలిసొచ్చిందని సంజూ శాంసన్ చెప్పాడు. ఇప్పటికీ తాను సోషల్ మీడియా వాడటం లేదని చెప్పాడు. గత కొన్నేళ్లుగా దేశం కోసం ఇలాంటి ఇన్నింగ్స్ ఆడాలని ఎదురు చూస్తున్నట్టు తెలిపాడు. సోషల్ మీడియాకు దూరంగా ఉండి.. తన ఆటపైనే దృష్టి పెట్టాననీ వెల్లడించాడు.
కాగా న్యూజిలాండ్‌తో సిరీస్‌లో వైఫల్యం సవాల్‌గా అనిపించిందన్న సంజూ ఫామ్ అందుకొని దేశానికి ఆడాలని గట్టిగా అనుకున్నట్టు తెలిపాడు . నిజానికి తాను న్యూజిలాండ్‌తో సిరీస్‌లో ఎక్కువ ప్రయత్నించాననిపించిందన్నాడు. టీ20 క్రికెట్ చాలా విచిత్రమైనదన్న ఈ యువ క్రికెటర్ ప్రపంచంలోకెల్లా అత్యుత్తమ బ్యాటర్లు కూడా ఈ ఫార్మాట్లో పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతారని వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం భారత్ లక్ష్యం ఇంకా పూర్తి కాలేదని, ఫైనల్లో కూడా జైత్రయాత్ర కొనసాగించి ట్రోఫీ గెలిచాకే అది పూర్తవుతుందని చెప్పాడు.