ఐసీసీ టీ20 ప్రపంచకప్ కోసం పాకిస్థాన్ జట్టు శ్రీలంకకు చేరుకుంది. సోమవారం శ్రీలంక రాజధాని కొలంబోలో అడుగుపెట్టింది. భారత్‌తో మ్యాచ్‌ను బాయ్‌కట్ చేస్తున్నామని పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆ జట్టు రాక ప్రాధాన్యతను సంతరించుకుంది. సల్మాన్ అలీ అఘా సారథ్యంలోని పాకిస్థాన్ జట్టు మంగళవారం విశ్రాంతి తీసుకొని బుధవారం సిహళీస్ స్పోర్ట్స్ క్లబ్‌లో ఐర్లాండ్‌తో తమ ఏకైక వామప్ మ్యాచ్ ఆడనుంది.పాకిస్థాన్ జట్టు భారత్, అమెరికా, నెదర్లాండ్స్, నమీబియాతో గ్రూప్-ఏలో ఉంది. ఫిబ్రవరి 7న నెదర్లాండ్స్‌తో తొలి మ్యాచ్ ఆడనున్న పాకిస్థాన్.. ఫిబ్రవరి 10న అమెరికాతో, ఫిబ్రవరి 15న భారత్, ఫిబ్రవరి 18న నమీబియాతో ఆడనుంది. అయితే భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను తాము బహిష్కరిస్తున్నామని పాకిస్థాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
ఈ ప్రకటనపై ఐసీసీ ఘాటుగా స్పందించింది. టీ20 ప్రపంచకప్ 2026లో ఒక జట్టుతో మాత్రమే ఆడమని చెప్పడం క్రీడా స్ఫూర్తికి విరుద్దమని పేర్కొంది. పాకిస్థాన్ నిర్ణయం వల్ల కలిగే పరిణామాల గురించి హెచ్చరించింది. కఠిన ఆంక్షలు విధించాల్సి ఉంటుందని హెచ్చరించింది. అయితే ఈ వ్యవహారంపై పీసీబీ నుంచి అధికారిక సమాచారం లేదని పేర్కొంది.ఒకవేళ భారత్‌తో మ్యాచ్‌ను పాకిస్థాన్ రద్దు చేసుకుంటే రూ.4500 కోట్ల రూపాయాల వ్యాపారం దెబ్బతిననుందని ఎక్స్‌పర్ట్స్ అంచనా వేసారు. పాకిస్థాన్ కూడా కోట్ల రూపాయాల ఆదాయాన్ని కోల్పోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ముఖ్యంగా టోర్నీ అధికారిక బ్రాడ్‌కాస్టర్స్ ఐసీసీ నుంచి నష్టపరిహారం కోరనున్నారు. ఆ నష్టాన్ని పీసీబీ నుంచి రికవరీ చేసే అవకాశాలు ఉన్నాయి.
జియో హాట్‌స్టార్ 200 కోట్ల నుంచి 250 కోట్ల వరకు ప్రకటనల ఆదాయాన్ని కోల్పోనుంది. భారత్-పాక్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో 10 సెకన్ల యాడ్‌కు 40 లక్షలు వసూలు చేస్తారు. పాకిస్థాన్ తప్పుకుంటే భారత్‌కు 2 పాయింట్స్ వచ్చిన ఆర్థిక నష్టం భారీ స్థాయిలో ఉండనుంది.ఈ క్రమంలోనే పీసీబీతో ఐసీసీ సంప్రదింపులు ప్రారంభించింది. తమ మాట వినకపోతే టోర్నీ నుంచి పూర్తి నిషేధం విధిస్తారనే ప్రచారం కూడా జరిగింది. కానీ పాకిస్థాన్ టీమ్ శ్రీలంకలో అడుగుపెట్టడంతో ఐసీసీ తీసుకోబోయే చర్యలపై ఉత్కంఠ నెలకొంది. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతుందా? లేదా? అనేది కూడా చర్చనీయాంశమైంది.