ఈ సారైనా కలిసొచ్చేనా ? భారత్ కు అచ్చిరాని మోడీ స్టేడియం…!

టీ20 ప్రపంచకప్ ఇప్పుడు క్లైమాక్స్ కు చేరుకుంది. ఆదివారం జరిగే మెగా ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా, న్యూజిలాండ్ తో తలపడబోతోంది. ఈ టైటిల్ ఫైట్ కు ముందు భారత్ ఫ్యాన్స్ ను ఓ సెంటిమెంట్ వెంటాడుతోంది

Post Published By: dialnews
Updated : 7 March 2026, 9:00 PM IST

టీ20 ప్రపంచకప్ ఇప్పుడు క్లైమాక్స్ కు చేరుకుంది. ఆదివారం జరిగే మెగా ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా, న్యూజిలాండ్ తో తలపడబోతోంది. ఈ టైటిల్ ఫైట్ కు ముందు భారత్ ఫ్యాన్స్ ను ఓ సెంటిమెంట్ వెంటాడుతోంది. 2023 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ ఇదే స్టేడియం వేదికగా పరాజయం పాలైంది. ఈ సారి టీ20 ప్రపంచకప్ లో టీమిండియా ఎదుర్కొన్న ఒక్క ఓటమి కూడా ఇదే స్టేడియంలో వచ్చిందే. మరి సెంటిమెంట్ పరంగా కలిసిరాని మోదీ స్టేడియంలో భారత్ టీ20 వరల్డ్ కప్ గెలుస్తుందా ?ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా పేరున్న అహ్మదాబాద్ లో ఓవరాల్ గా భారత్ రికార్డు బాగానే ఉన్నా మెగాటోర్నీకి వచ్చేసరికి అస్సలు కలిసిరాలేదు.

2023 ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి అభిమానులకు ఒక చేదు జ్ఞాపకం. ఫైనల్ వరకూ అప్రతిహాతంగా జైత్రయాత్ర కొనసాగిస్తూ వచ్చిన టీమిండియా అసలు పోరులో మాత్రం చతికిలపడింది. లీగ్ స్టేజ్ లో పాక్ ను ఇదే వేదికలో చిత్తు చేసిన భారత్ ఫైనల్లో మాత్రం ఆసీస్ పై చేతులెత్తేసింది. ప్రస్తుత టీ20 ప్రపంచకప్ లోనూ భారత్ ఓడిపోయిన ఏకైక మ్యాచ్ కూడా ఇదే వేదికపైనే.. సూపర్ 8 స్టేజ్ ఆరంభ మ్యాచ్ లో సౌతాఫ్రికా చేతిలో టీమిండియా అహ్మదాబాద్ స్డేడియంలోనే పరాజయం పాలైంది. 188 పరుగుల టార్గెట్ ను ఛేదించలేక కేవలం 111 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఇప్పుడు భారత్ అభిమానులను ఈ ఫ్లాప్ సెంటిమెంట్ వెంటాడుతోంది.

ముఖ్యంగా 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమిని, ప్రస్తుత టీ20 ప్రపంచకప్ లో సౌతాఫ్రికాపై ఓటమిని గుర్తు చేస్తూ అహ్మదాబాద్ స్టేడియం ఈసారైనా భారత్ కు కలిసొస్తుందా అని చర్చించుకుంటున్నారు. ఓవరాల్ గా మాత్రం ఈ స్టేడియం భారత్ రికార్డు బాగానే ఉంది. ఇప్పటి వరకూ అహ్మదాబాద్ స్టేడియంలో టీమిండియా 10 టీ20లు ఆడితే ఏడింటిలో గెలిస్తే మూడు ఓడిపోయింది. ఇదిలా ఉంటే పాత సెంటిమెంట్ ను బ్రేక్ చేయాలన్న ఉద్దేశమో మరొకటో తెలీదు కానీ భారత క్రికెట్ జట్టు ఈ సారి అహ్మదాబాద్ లో తాము బస చేసే హోటల్ ను కూడా మార్చుకుంది.

గతంలో ఐటీసీలో బస చేస్తే.. ఈ సారి తాజ్ కు షిఫ్ట్ అయింది. అలాగే స్టేడియంలో డ్రెస్సింగ్ రూమ్ ను సైతం మార్చుకున్నట్టు సమాచారం. ఇక పిచ్ విషయానికొస్తే అహ్మదాబాద్ స్టేడియంలో మొత్తం 11 పిచ్ లు ఉన్నాయి. ఎర్రమట్టి పిచ్ , నల్లమట్టితో సిద్ధం చేసే పిచ్ లు ఇక్కడ వాడుతుంటారు. నల్లమట్టితో కూడిన పిచ్ సహజంగానే బ్యాటర్లకు పూర్తి అనుకూలంగా ఉంటుంది. పరుగుల వరద పారుతుంది. అదే ఎర్రమట్టి పిచ్ సిద్ధం చేస్తే మాత్రం స్పిన్నర్లకు కలిసొస్తుంది. పైగా వాంఖేడే స్టేడియంతో పోలిస్తే ఇక్కడ బౌండరీల పెద్దవి. భారీ సిక్సర్లు కొట్టాలని ప్రయత్నిస్తే వికెట్లు సమర్పించుకునే ప్రమాదముంటుంది. దీంతో బ్యాటర్లు తెలివిగా షాట్లు ఆడాల్సి ఉంది.మొత్తం మీద తమకు కలిసిరాని అహ్మదాబాద్ సెంటిమెంట్ ను ఈ సారి బ్రేక్ చేసి మరోసారి టీ20 వరల్డ్ కప్ అందుకోవాలని భారత్ ఎదురుచూస్తోంది.

Published : 
  • 7 March 2026, 9:00 PM IST