టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 మ్యాచ్‌లు ప్రారంభమైన నేపథ్యంలో ఏ జట్లు సెమీస్‌కు చేరతాయనే చర్చ జోరుగా సాగుతోంది. పలానా జట్లు సెమీస్‌కు చేరతాయి.. పలానా జట్లు నిష్క్రమిస్తాయని ఎవరి అంచనాలను వారు సోషల్‌మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. తాజాగా స్టార్ స్పోర్ట్స్ ఛానల్ నిపుణులు కూడా ఈ టాపిక్‌పై తమ అంచనాలను షేర్ చేశారు. స్టార్ స్పోర్ట్స్ ప్యానెల్‌లో టీమిండియా మాజీలు యుజ్వేంద్ర చహల్, ఛతేశ్వర్ పుజారా, మొహమ్మద్ కైఫ్, వరుణ్ ఆరోన్, సబా కరీం, సంజయ్ బాంగర్ నిపుణులుగా ఉన్నారు. వీరిలో ఒక్కొక్కరు ఒక్కో అంచనా వెల్లడించారు. అయితే అందరి అంచనాల్లో ఓ కామన్ పాయింట్ ఉంది. అదే టీమిండియా.
ఈ ఆరుగురు సెమీస్‌కు చేరే జట్లలో టీమిండియాకు అవకాశం ఇచ్చారు. చహల్ భారత్‌తో పాటు సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు సెమీస్‌కు చేరతాయని అంచనా వేయగా.. పుజారా భారత్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌తో పాటు శ్రీలంకకు ఛాన్స్ ఇచ్చాడు.కైఫ్ భారత్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు సెమీస్‌కు చేరతాయని అంచనా వేయగా.. వరున్ ఆరోన్ పై ముగ్గురికి భిన్నంగా భారత్‌తో పాటు వెస్టిండీస్, ఇంగ్లండ్, పాకిస్తాన్ జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయిని అభిప్రాయపడ్డాడు. సబా కరీం విషయానికొస్తే.. ఈ టీమిండియా మాజీ వికెట్‌కీపర్ భారత్‌తో పాటు సౌతాఫ్రికా, శ్రీలంక, ఇంగ్లండ్ జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయని గెస్ చేస్తున్నాడు.
మాజీ టీమిండియా ఆల్‌రౌండర్ బాంగర్.. భారత్‌తో పాటు సౌతాఫ్రికా, శ్రీలంక, పాకిస్తాన్ జట్లు సెమీస్‌కు చేరతాయని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం రెండు గ్రూపులు కూడా చాలా టఫ్ గా ఉన్నాయి. గ్రూప్ 1లో భారత్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ , జింబాబ్వే ఉండగా.. గ్రూప్ 2లో న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక, ఇంగ్లాండ్ చోటు దక్కించుకున్నాయి. ఇప్పటికే సూపర్ 8లో ప్రీ సీడింగ్ కు సంబంధించి విమర్శలు వస్తున్నాయి. కానీ ఐసీసీ మాత్రం రెండు ఆతిథ్య దేశాలు కావడంతో షెడ్యూలింగ్, బ్రాడ్ కాస్టింగ్, అభిమానులు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రీ సీడింగ్ ఇచ్చామని చెబుతోంది.