క్రికెట్ ప్రపంచంలో సెంటిమెంట్లు అనేవి ఒక్కోసారి ఊహించని విధంగా నిజమవుతుంటాయి. ముఖ్యంగా వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలు జరుగుతున్నప్పుడు కొన్ని వింతైన పోలికలు భలే ఆసక్తిని కలిగిస్తాయి. ఇప్పుడు జరుగుతున్న 2026 టీ20 వరల్డ్ కప్‌లో కూడా సరిగ్గా అలాంటి సీనే ఒకటి కనిపిస్తోంది. ఒక చిన్న జట్టు ఏకంగా వరల్డ్ ఛాంపియన్లనే మట్టికరిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఈ ఓటమి ఆస్ట్రేలియాకు తగిలిన షాక్ మాత్రమే కాదు, దీని వెనుక టీమ్ఇండియాకు కలిసొచ్చే ఒక చరిత్ర దాగి ఉంది.
వరల్డ్ కప్ వేదికలపై ఆస్ట్రేలియాను జింబాబ్వే ఓడించడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలోనూ పలుమార్లు ఈ పసికూన జట్టు కంగారూలకు షాక్ ఇచ్చింది. 1983 వన్డే వరల్డ్ కప్‌లో ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే 13 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది.ఆ తర్వాత 2007 టీ20 వరల్డ్ కప్‌లో కేప్‌టౌన్ వేదికగా 5 వికెట్ల తేడాతో మరోసారి విజయం సాధించింది. ఇక 2014, 2022 వన్డే ఫార్మాట్లలో కూడా ఆసీస్‌పై జింబాబ్వే విజయాలు నమోదు చేసింది.
జింబాబ్వే ఆస్ట్రేలియాను ఓడించినప్పుడల్లా భారత్‌కు అదృష్టం వరిస్తుందనే సెంటిమెంట్‌కు 1983లో పునాది పడింది. ఆ ఏడాది జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో జింబాబ్వే జట్టు ఆస్ట్రేలియాను ఓడించి పెను సంచలనం సృష్టించింది. ఇక్కడ వింత ఏంటంటే, అదే టోర్నీలో అప్పటివరకు పెద్దగా అంచనాలు లేని కపిల్ దేవ్ నాయకత్వంలోని టీమ్ఇండియా అద్భుతంగా ఆడి ఫైనల్ చేరింది. అక్కడ బలమైన వెస్టిండీస్ జట్టును ఓడించి మొదటిసారి ప్రపంచ కప్‌ను ముద్దాడింది. ఆస్ట్రేలియా ఓటమి భారత్ విజయానికి నాంది పలకడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది.సరిగ్గా ఇలాంటి సెంటిమెంట్ 2007లో జరిగిన టీ20 వరల్డ్ కప్‌లోనూ జరిగింది. ఆ టోర్నీలో కూడా జింబాబ్వే జట్టు ఆస్ట్రేలియాను ఓడించింది. అయితే ఈ టోర్నీలోనూ భారత్ ఛాంపియన్‌గా నిలిచింది.
2007 ఫైనల్లో పాకిస్థాన్‌ను ఓడించి ఎంఎస్ ధోనీ సారథ్యంలో భారత్ టీ20 ఫార్మాట్లో మొదటి విశ్వవిజేతగా నిలిచింది. అలా మరోసారి జింబాబ్వే గెలుపు, ఆస్ట్రేలియా ఓటమి సెంటిమెంటుకు మరికొంత బలాన్ని ఇచ్చింది.ఇప్పుడు 2026లో మళ్లీ అదే సీన్ రిపీట్ అవ్వడంతో ఫ్యాన్స్ హ్యాట్రిక్ ఖాయమని ఫిక్స్ అయిపోతున్నారు. ప్రస్తుతం టీమ్ఇండియా ఎంతో పటిష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే గ్రూప్ స్టేజ్‌లో ఆడిన రెండు మ్యాచుల్లోనూ అమెరికా, నమీబియాలపై ఘనవిజయాలు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతోంది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు అద్భుతంగా రాణిస్తోంది. ఫిబ్రవరి 15న పాకిస్థాన్‌తో జరగబోయే కీలక పోరుకు ముందు ఈ సెంటిమెంట్ భారత్‌కు మరింత ఉత్సాహాన్ని ఇస్తోంది. మరి చరిత్ర పునరావృతమై భారత్ మూడోసారి టీ20 కప్పు కొడుతుందో లేదో చూడాలి.