అహ్మదాబాద్ లో ఆదివారం జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ పోరులో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. యువ బ్యాటర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ అద్భుత అర్ధసెంచరీలతో విరుచుకుపడ్డారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు భారత బౌలర్ల ధాటికి 159 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంతో భారత్ టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను విజయవంతంగా డిఫెండ్ చేసుకోవడమే కాకుండా, ఈ ట్రోఫీని మూడుసార్లు గెలుచుకున్న మొదటి జట్టుగా రికార్డు సృష్టించింది.
గెలుపు తర్వాత టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు నెట్టింట దుమారం రేపుతోంది. గతంలో పాకిస్థాన్‌తో జరిగిన వివాదాస్పద ఆసియా కప్ ఫైనల్ ఘటనను గుర్తు చేస్తూ, వరుణ్ మరోసారి టీ కప్పుతో ఉన్న ఫోటోను షేర్ చేసి దాయాది దేశంపై సెటైర్లు వేశాడు.వరుణ్ చక్రవర్తి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక ఆసక్తికరమైన ఫోటోను పంచుకున్నాడు. అందులో వరుణ్ ఒక చేత్తో ప్రపంచకప్ ట్రోఫీని పట్టుకుని, మరో చేత్తో టీ కప్పులో టీ తాగుతూ కనిపించారు. ఈ ఫోటో చూసిన క్రికెట్ అభిమానులు వెంటనే దీనిని పాకిస్థాన్‌పై చేసిన వ్యంగ్యాస్త్రంగా భావిస్తున్నారు. ఈ పోస్ట్‌కు వేల సంఖ్యలో లైకులు, కామెంట్లు వస్తుండగా పాకిస్థాన్‌ను మరోసారి ఆటాడుకున్న వరుణ్ చక్రవర్తి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
వరుణ్ చక్రవర్తి ఇలా టీ కప్పుతో ఫోటో దిగడం వెనుక ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. 2025 ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ పాకిస్థాన్‌ను ఓడించి విజేతగా నిలిచింది. అయితే, అప్పట్లో పీసీబీ చీఫ్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి భారత ఆటగాళ్లు నిరాకరించారు. దీంతో భారత్ ట్రోఫీ లేకుండానే స్వదేశానికి తిరిగి వచ్చింది. ఆ మరుసటి రోజు వరుణ్ చక్రవర్తి తన బెడ్‌పై పడుకుని, ట్రోఫీ ఉండాల్సిన చోట టీ కప్పును ఉంచి ఫోటో దిగాడు. అప్పట్లో అది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.